సియాచిన్.. ఓ మృత్యు యుద్ధ క్షేత్రం
న్యూఢిల్లీ: లాన్స్ నాయక్ హనుమంతప్ప అతని తొమ్మిదిమంది అనుచరులను మింగేసిన సియాచిన్ మంచు పర్వతం పైకి చల్లగా.. నిశ్శబ్దంగా కనిపించినా అదొక మృత్యుశిఖరం లాంటిదని అక్కడి ఘటనలు చెప్తున్నాయి. ప్రతి నెల మంచుకొండ చరియలు విరిగిపడటం ద్వారానో, లేక ప్రతికూల వాతావరణ పరిస్థితులు అక్కడ ఏర్పడటం మూలంగానో కనీసం ఒక సైనికుడిని బలితీసుకుంటూనే ఉంటుంది. ఇలా, మోగుతున్న భారత వీర జవాన్ల మృత్యు మృదంగం ఇప్పటిదేం కాదు.. 1984 నుంచే ఇది ప్రారంభమైంది.
తొలిసారి పాకిస్థాన్ సైన్యాన్ని ఏ విధంగానైనా కట్టడి చేయాలనే ఉద్దేశంతో అత్యంత దుర్భేద్యమైన దాదాపు 22 వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ గ్లేసియర్ వద్ద భారత సైనిక శిబిరాలను ఏర్పాటుచేశారు. 1984 నుంచి అక్కడ భారత సేనలను నిలపడం ప్రారంభించారు. అంటే దాదాపు ఎవరెస్టు శిఖరం ఎత్తులో భారత జవాన్లు దేశ రక్షణ కోసం గట్టగట్టి చనిపోయే చలిలో నిత్యం గస్తీ కాస్తున్నారన్నమాట. ప్రభుత్వం లోక్ సభలో ప్రకటించిన ప్రకారం 1984 నుంచి 2015 మధ్య మొత్తం 869 మంది భారత సైనికులు సియాచిన్ గ్లేసియర్ వద్ద మృత్యువాత పడ్డారు.
దాని అనంతరం జరిగిన కొన్ని ఘటనలు మొన్న జరిగిన ప్రమాదంలో పదిమంది సైనికులను కలుపుకొని మొత్తం ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన సైనికుల సంఖ్య 883కు చేరుకుంది. వీరిలో 33 మంది అధికారులు, 54 మంది జూనియర్ ఆఫీసర్లు, 782 ఇతర ర్యాంకుల జవాన్లు ఉన్నారు. కాగా, అత్యధికంగా 2011లో 24 మంది సైనికులు ఈ గ్లేసియర్లో మృత్యువాత పడగా.. 2015 ఐదుగురు చనిపోయారు. ఏడాదికి భారత ప్రభుత్వం ఈ ప్రాంత గస్తీ కోసం దాదాపు వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఒక్క 2012-13, 2014-15 మధ్యనే రూ.6,566 కోట్లు ఖర్చు చేసింది. వీటిని అక్కడ ఉండే సైనికులకు కావాల్సిన వస్త్రాలు, పర్వాతారోహణ సామాగ్రి ఇతర వస్తువులకు ఎక్కువగా ఖర్చయ్యేవి. మరో విషయమేమిటంలో సియాచిన్ గ్లేసియర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న యుద్ధ క్షేత్రం.
ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 45 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. ప్రత్యేక చీతా హెలికాప్టర్లు మాత్రమే ఇక్కడికి వెళ్లగలిగి ఆహార సామాగ్రిని చేరవేస్తాయి. ప్రతి సంవత్సరం మూడు బెటాలియన్ల నుంచి 3,000 మంది నుంచి 4 వేలమంది సైనికులు ఇక్కడ భద్రతా సేవలు అందిస్తారు. ఒక్కో బెటాలియన్ మూడు నెలల వరకు ఇక్కడ గస్తీ కాస్తుంది. అయితే,ఇలా ప్రతికూల పరిస్థితులున్నాయని, ప్రాణనష్టం ఎదురవుతుందని అక్కడ నుంచి సైనికులను విరమించుకుంటే దేశ రక్షణ గాలికొదిలేసినట్లవుతుందని, ఇది ఏమాత్రం సురక్షితం కాదని ఇటీవల రక్షణమంత్రి మనోహర్ పారికర్ చెప్పిన మాటలు సరైనవే అని ఆమోదించక తప్పదేమో.