పద్యానవనం: అదంతా గతం
చింతల తోపులో కురియు చిన్కులకున్ తడిముద్దయైన బాలింత యొడిన్ శయించు పసిరెక్కల మొగ్గను వోని బిడ్డకున్ బొంతలు లేవు కప్పుటకు, బొంది హిమంబయి పోవునేమొ, పల్కింతును రుద్రవీణ పయినించుక వెచ్చని అగ్నిగీతముల్.
రుద్రవీణ మీద అగ్నిగీతాలు పలికిస్తానంటున్నాడు కవి. ఎంత ప్రగాఢ వ్యక్తీకరణ! పసిపాప ఎలా ఉంది? పసిరెక్కల మొగ్గలాగ.ఎక్కడుంది? తడిసి ముద్దయిన తల్లి ఒడిలో.ఆమె ఎక్కడ? ఇంకా చినుకులు కురుస్తున్న చింత తోపుల్లో.ఏమిటి ఇబ్బంది? కప్పడానికి బొంతలు కూడా లేవు.ఏమవుతుంది? శరీరం మంచులా గడ్డకట్టుకుపోతుందేమోనన్న ఆందోళన.మరి ఏం చేయాలి? అదీ, అందుకోసమే! కనీసం ఉపశమనంగా రుద్రవీణ మీద అగ్నిగీతాలు పలికిస్తానంటున్నాడు మహాకవి దాశరథి.
ఉక్కుబంధనాల నుంచి విముక్తమైన తన ప్రాంతం వేగంగా పురోగమించాలనే వాంఛ ఎంత ప్రగాఢమైనదో ‘‘మూర్చన’’లోని ఈ వ్యక్తీకరణల్లో తెలుస్తుంది. తరతరాల బూజు నిజాం రాజు కబంద హస్తాల నుంచి హైదరాబాద్ రాష్ట్రం విముక్తమైనపుడు వేగంగా, శర వేగంగా ఆ ప్రాంతం పురోగమించాలని అభిలషించారాయన. నిజాం వ్యతిరేకపోరాటంలో మాటై, పాటై, బావుటాయై నిలువునా దహించుకుపోయారు. ఒక్కసారిగా లభించిన విముక్తి తర్వాత భవిష్యత్తు కర్తవ్యాన్ని గుర్తుచేసుకుంటున్నట్టుంటుంది ఈ పద్యం. ప్రజ్వలిత అగ్నిజ్వాల కాదు. పసికూన శరీరం కాస్త వెచ్చబెట్టాలి కనుక, ‘ఇంచుక’ వెచ్చని అగ్నిగీతమట పలికించేది. ఎంత సముచిత, సందర్భోచిత పదప్రయోగం! పరుగులిడ నవసరం లేదు, మెల మెల్లగానయినా పథకం ప్రకారం ముందడుగు వేయాలనే సద్యోచన. నిజమే! ఇప్పుడైనా.... పూర్వపు స్థితి నుంచి విడివడి కొత్త రాష్ట్రంగా ఏర్పడుతున్న ప్రాంతమేదైనా, కొత్త చిగుళ్లు తొడిగి ఎదగాలి. అందుకు అందరి చేయూత, తోడ్పాటూ అవసరం. అన్నీ అమరిన ఇంట్లోలాగా చింతల తోపుల్లో బొంతలుండవు. ఉలన్ దుప్పట్లు అసలే ఉండవు. వారి సహాయమో, వీరి సహాయమో ఒక్కొక్కటి సమకూర్చుకోవాల్సిందే, సందేహము లేదు. ఏదో చేయాలన్న తపన, ఆర్థి ముఖ్యం.
ముఖ్యంగా పాలకులకు. అనేకానేక కారణాల వల్ల కుంటువడిపోయిన ప్రగతి, నిలిచి పోయిన సంక్షేమం, నీరసించిన పాలనలో... నిస్తేజమైన జనజీవన గమనాన్ని మెలమెల్లగా నడిపించాలి, ఆపై పరుగులెత్తించాలి. అభ్యుదయం బాటన సాగించాలి. యోచనాపరులు బాధ్యత తీసుకొని ముందుకు రావాలి. నిబద్దత కలిగిన నాయకత్వం కొత్త దీక్ష తీసుకొని దార్శనికత కనబరచాలి. ఓ గొప్ప‘రోడ్ మ్యాప్’ గీసుకొని పథకం ప్రకారం, ప్రణాళికా బద్దంగా ముందుకు నడిపితే తప్ప గమ్యం చేరం, లక్ష్యం నెరవేరదు. ప్రతి ఆలోచనా, ఆచరణా భవిష్యత్తుపై విశ్వాసం, అంతకు మించి భరోసా కలిగించాలి. అలా చేయకుంటే జాతి క్షమించదు!
విముక్తి లభించగానే రుద్రవీణ అందుకున్న ఇదే దాశరథి తనప్రాంతాన్ని ఓ వీణతో పోల్చి ఉద్యమానికి ఊపిరులూదారు. ‘‘ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మా కెన్నడేని, తీగెలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ’’ అంటూ పరితపించాడు, తగిన శాస్తి జరుగుతుందని నిజామును శపించాడు. గతం తెలియని వాడు కాదు. కానీ, పోరాట శక్తులకు సైనిక చర్యతోడై నిజాం పీచమణిచినపుడు, విముక్తిని నిండు హృదయంతో స్వాగతించాడు. అంతే తప్ప, అదే గతాన్ని ముందేసుకొని చింతతోనో, ప్రతీకార చింతనతోనో రగిలిపోలేదు. ఆశావహ దృక్పథంతో భవిష్యత్తు వైపు అడుగులు వేశాడు.
మావో-సే-టుంగ్ గేయమొకటి తర్జుమా చేస్తూ, ఆయనే చెప్పిన ఒక పంక్తి ఇక్కడ ప్రస్తావనార్హం.
‘‘అదంతా గతం నేటితో అది ఖతం’’.
- దిలీప్‌రెడ్డి