అప్పీలుకు రాక్షసుడు
సాక్షి, చెన్నై : చిన్నారి అనే దయ లేకుండా ఆరేళ్ల హాసినిపై లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా అతి కిరాతకంగా హతమార్చిన నరరూప రాక్షసుడు దశ్వంత్ హైకోర్టు తలుపు తట్టాడు. తనకు విధించిన ఉరి శిక్షను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించింది. నాలుగు వారాల్లోపు వివరణ ఇవ్వాలని పోలీసులకు న్యాయమూర్తులు ఆదేశాలు జారీచేశారు.
చెన్నై శివారులోని కుండ్రత్తూరు సంబంధం నగర్‌కు చెందిన దశ్వంత్ (24) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మాంగాడు సమీపం మహాలింగం అపార్టుమెంటులో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న సమయంలో అఘాయిత్యానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే. అదే అపార్టుమెంటులో నివసిస్తున్న బాబు కుమార్తె ఆరేళ్ల వయస్సున్న హాసిని గత ఏడాది ఫిబ్రవరి 5 వ తేదీన ఎత్తుకెళ్లాడు. ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి ఆపై సజీవంగా తగులబెట్టి హతమార్చడం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అరెస్టుచేసి కటకటాల్లోకి నెట్టగా బెయిల్ మీద దర్జాగా దశ్వంత్ బయటకు వచ్చాడు.
జైలు జీవితంతో మంచివాడిగా మారుతాడుకున్న వాడు మరింత కిరాతకుడయ్యాడు. జులాయిగా తిరగడం మొదలెట్టిన దశ్వంత్ ఖర్చుల కోసం డబ్బు ఇవ్వలేదన్న ఆగ్రహంతో కన్న తల్లి సరళను సైతం కడతేర్చి ఉడాయించాడు. ఈ నరరూప రాక్షసుడ్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగానే శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు అరెస్టుచేసి కోర్టు బోనులో నిలబెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన ఇతనికి ఉరి శిక్ష విధిస్తూ చెంగల్పట్టు మహిళా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇచ్చి నెలన్నర రోజుల అనంతరం దశ్వంత్ అప్పీలుకు సిద్ధం అయ్యాడు. బుధవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అప్పీలుకు దశ్వంత్
తనకు విధించిన ఉరి శిక్షను పిటిషన్లో వ్యతిరేకించాడు. చార్జ్ షీట్లో పేర్కొన్న అంశాలను వివరించారు. మహిళా కోర్టు విచారణ తీరును గుర్తు చేశాడు. సాక్షుల విచారణ, వాంగ్మూలం గురించి వివరించాడు. అయితే, సాక్షుల వాంగ్మూలం అంతా అసంబద్ధంగా ఉందని ఆరోపించాడు. పోలీసులు సమర్పించిన ఆధారాల గురించి వివరిస్తూ, విచారణలో అవన్నీ తారుమారయ్యాయని పేర్కొన్నాడు. అస్సలు విచారణ సమగ్రంగానే సాగలేదని హైకోర్టు దృష్టికి తెచ్చాడు. తనకు శిక్ష వి«ధించి కేసును ముగించాలన్నట్టుగానే తంతు సాగిందే గానీ సమగ్ర విచారణ జరగ లేదని ఆరోపించాడు. ఆ ఉరి శిక్షను రద్దు చేయాలని, సాక్ష్యాలు, ఆధారాలను సమగ్రంగా పరిశీలించి తుది తీర్పును ఇవ్వాలని దశ్వంత్ చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు పరిగణించింది. న్యాయమూర్తులు విమల, రామతిలగం నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం విచారణకు స్వీకరించింది. అలాగే దశ్వంత్ పిటిషన్‌కు నాలుగు వారాల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది.
చదవండి:
హాసిని అత్యాచారం కేసులో దశ్వంత్ కు ఉరి
కిరాతకుడు దశ్వంత్ ముంబైలో అరెస్ట్