వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ట
చింతపల్లి (నల్లగొండ) : నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని ఘడియగౌరారం గ్రామంలో భక్తాంజనేయస్వామి దేవస్థానంలో కీర్తి ధ్వజస్తంభ ప్రతిష్టాపన, ముత్యాలమ్మ, ఈదమ్మ విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు జపములు, హోమములు, పూజలు, తర్వాత 10 గంటల 20 నిమిషాలకు ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ట, 10 గంటల 49 నిమిషాలకు ఈదమ్మ విగ్రహ ప్రతిష్ట, అలాగే 11 గంటల 15 నిమిషాలకు కీర్తి ధ్వజస్తంభ ప్రతిష్ట, బలిహారం, కుంభ నివేదనం, పూర్ణాహుతి కార్యక్రమాలను వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య మేళతాళాలతో అమ్మవార్ల విగ్రహాలను గ్రామ పురవీధులలో వైభవంగా ఊరేగిస్తూ ప్రతిష్టాపన కార్యక్రమాలను నిర్వహించారు.
గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల గ్రామాలవారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు ఈదమ్మ, ముత్యాలమ్మ దేవతలకు గ్రామ ప్రజలు డప్పు చప్పుళ్ళతో బోనాలు సమర్పించారు. భక్తాంజనేయస్వామి దేవస్థానంలో జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్తో పాటు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యేలు ఉజ్జిని నారాయణరావు, ఉజ్జిని యాదగిరిరావు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.