డయాగ్నస్టిక్స్ సేవల్లోకి మ్యాన్‌కైండ్
పాత్ కైండ్ ల్యాబ్స్ పేరుతో సర్వీసులు
మార్కెట్లో తీవ్రతరం కానున్న పోటీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగంలో ఉన్న మ్యాన్‌కైండ్ ఫార్మా డయాగ్నస్టిక్స్ సర్వీసుల్లోకి అడుగుపెడుతోంది. పాత్ కైండ్ ల్యాబ్స్ పేరుతో రోగ నిర్ధారణ సేవలను అందించనుంది. ఆగస్టు నుంచి ఈ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని మ్యాన్‌కైండ్ బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా తొలి ఏడాది 12 భారీ ల్యాబ్‌లు, 20 ర్యాపిడ్ రెస్పాన్స్ ల్యాబ్స్‌తోపాటు 150 సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పాత్ కైండ్ డయాగ్నస్టిక్స్ ఎండీ సంజీవ్ వశిష్ట తెలిపారు. ల్యాబ్‌లను అనుసంధానిస్తూ చిన్న పట్టణాలు, గ్రామాల్లోనూ సేకరణ కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పారు. వచ్చే నాలుగేళ్లలో కంపెనీ రూ.305 కోట్లు వెచ్చించనుంది. గుర్గావ్లో రెఫరెన్స్ ల్యాబ్‌ను రానుంది. అయిదేళ్లలో మొత్తం 130 ల్యాబ్‌లు, 1,300 కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నది కంపెనీ ప్రణాళిక.
అందుబాటు ధరలో..: ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను పాత్ కైండ్ లక్ష్యంగా చేసుకుంది. అత్యంత నాణ్యమైన రోగ నిర్ధారణ సేవలను అందుబాటు ధరలో అందిస్తామని సంజీవ్ తెలిపారు. మైళ్ల కొద్దీ నడవాల్సిన అవసరం లేకుండానే ప్రజల వద్దకే సేవలను విస్తరిస్తామని వెల్లడించారు. ‘రోగ నిర్ధారణ సేవలు దేశంలో ఆశించిన స్థాయిలో విస్తరించలేదు. ల్యాబ్‌లు అందుబాటులో లేకపోవడం, అవగాహన లేమితో జనాభాలో 20 శాతం మంది ఇప్పటి వరకు కనీసం రక్త పరీక్ష చేయించుకోలేదు.
వైద్యులను, ప్రజలను చైతన్యపరిస్తే పరీక్షల శాతం గణనీయంగా పెరుగుతుంది. నాణ్యమైన సేవల లోటు చాలా ఉంది. ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నాణ్యమైన డయాగ్నస్టిక్స్ సెంటర్లకు డిమాండ్ రానుంది’ అని వివరించారు. దేశంలో డయాగ్నస్టిక్స్ రంగం 2017–18లో రూ.60,000 కోట్లకు చేరుకోనుంది. 2014–15లో రూ.38,000 కోట్లు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా ఒక లక్షకుపైగా డయాగ్నస్టిక్స్ సెంటర్లున్నాయి.