డీఐసీ ఫైళ్లు తీసుకెళ్తున్నవాహనం బోల్తా
అటెండర్‌కు తృటిలో తప్పిన ప్రాణాపాయం
పైరవీ కార్ల వత్తిడితోనే
ఫైళ్ల తరలింపు?
ప్రమాద సంఘటనను గోప్యంగా ఉంచుతున్న అధికారులు
సాక్షి, సంగారెడ్డి :డీఐసీ(పరిశ్రమల శాఖ ) కీలకమైన ఫైళ్లు హైదరాబాద్‌కు తరలిస్తున్న ఓ ప్రైవేటు వాహనం ఔటర్‌రింగ్ రోడ్డుపై శనివారం ప్రమాదానికి గురైంది. అయితే ఈ విషయం బయటికి పొక్కకుండా డీఐసీ అధికారులు గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం. ప్రమాదంలో డీఐసీలో పనిచేస్తున్న అటెండర్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయానికి వేగంగా ఫైళ్లు చేరవేయాలన్న తొందరలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే పటా¯ŒSచెరు పాశమైలారం ప్రాంతంలోని ఓ పరిశ్రమకు చెందిన కీలకమైన ఫైల్ కొద్దికాలంగా పెండింగ్‌లో ఉంది.
ఆ ఫైల్ శనివారం సాయంత్రంలోగా కమిషనర్ కార్యాలయానికి చేరకపోతే కంపెనీకి నష్టం వాటిల్లుతుంది. దీంతో కంపెనీ తరపున ఓ వ్యక్తి రంగంలోకి దిగి పైరవీలు మొదలు పెట్టారు. డీఐసీలోని ఓ ఉన్నతాధికారిని కలిసి తమ కంపెనీ ఫైల్ అర్జెంట్‌గా కమిషనర్ కార్యాలయానికి చేరవేయాల్సిందిగా కోరినట్లు తెలిసింది. కమిషనర్ కార్యాలయానికి ఒకే ఫైల్ పంపితే బాగుండదని తోడుగా మరికొన్ని ఫైళ్లు జతచేసి వాటిని అర్జెంట్‌గా పట్టుకెళ్లాలని అటెండర్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే కమిషనర్ కార్యాలయానికి వెళ్లేందుకు అటెండర్ ససేమిరా అనడంతో ఉన్నతాధికారి పైళ్లు తీసుకెళ్లకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు
. దీంతో చేసేదేమిలేక పైళ్లు తీసుకెళ్లేందుకు అటెండర్ అంగీకరించినట్లు తెలిసింది. కంపెనీ తరపున వ్యక్తి కమిషనర్ కార్యాలయానికి వేగంగా పైల్ తీసుకెళ్లేందుకు ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఆ వాహనంలో అ టెండర్ పైళ్లు తీసుకుని కమిషనర్ కార్యాలయానికి బయలుదేరారు. త్వరగా కమిషనర్ కార్యాలయానికి వెళ్లాలని డ్రైవర్ వేగంగా కారు నడపటంతో ఔటర్ రింగ్‌రోడ్డుపై వాహనం అదుపుతప్పి బోల్తాపడింది.
ప్రమాదంలో డ్రైవర్, అ టెండర్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల వాహనాల్లో కమిషనర్ కార్యాలయానికి ఫైళ్లు పంపించటం, అటెండర్‌ను బలవంతంగా పంపిన తీరును డీఐసీ సిబ్బంది తప్పుబడుతున్నారు. ఈ విషయమై డీఐసీ అధికారుల వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ప్రమాదం విషయాన్ని నిర్థారించుకునేందుకు అటెండర్ సైతం అందుబాటులో లేడు.