కాంగ్రెస్‌కు రాంబాబు రాంరాం
జీహెచ్ఎంసీ ఫ్లోర్‌లీడర్, పార్టీ పదవులకు రాజీనామా
నేడు బీజేపీలోకి దిడ్డి
కాచిగూడ: నగరానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బర్కత్‌పురా కార్పొరేటర్ దిడ్డి రాంబాబు బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పదవికి, కాంగ్రెస్ పార్టీ పదవులను వదులుకున్నారు. తన రాజీనామా లేఖను పార్టీ గ్రేటర్ అధ్యక్షులు, మాజీ మంత్రి దానం నాగేందర్‌కు పంపించినట్టు ఆయన విలేకరులకు తెలిపారు. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడి నాయకత్వం పట్ల ఆకర్షితుడినై ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు వీలుగా బీజేపీలో చేరనున్నట్టు రాంబాబు ప్రకటించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా గురువారం నగరానికి వస్తున్న సందర్భంగా సికింద్రాబాద్ ఇంపీరిల్ గార్డెన్లో జరిగే సమావేశంలో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బి.వెంకట్‌రెడ్డి, జాతీయ, రాష్ట్ర నాయకుల నేతృత్వంలో అమీత్‌షా సమక్షంలో తనతో కలిసి వచ్చే అనుచరులతో బీజేపీలో చేరుతున్నట్టు వెల్లడించారు.
బర్కత్‌పురా నుంచి ర్యాలీగా..
బర్కత్‌పురా లింగంపల్లిలోని కార్పొరేటర్ కార్యాలయం నుంచి సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్ వరకు గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు తన అనుచరులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు రాంబాబు తెలిపారు.