ఉబర్ ప్రత్యర్థి దిదిలో యాపిల్ పెట్టుబడులు
బీజింగ్ : ఉబర్ కు ప్రధాన ప్రత్యర్థిగా... చైనాలో రెండో అతిపెద్ద రవాణా సర్వీసులను అందిస్తున్న దిది చుక్సింగ్ లో యాపిల్ ఇంక్ వంద కోట్ల డాలర్లు (ఒక బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టింది. అతి క్లిష్టంగా ఉండే చైనీస్ మార్కెట్ ను అర్థం చేసుకోవడానికి ఈ కంపెనీకి సాయం అందజేస్తున్నామని యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ తెలిపారు. చైనాలో ఐఫోన్ వ్యాపారాలకు గండిపడిన నేపథ్యంలో దూసుకుపోతున్న షేరింగ్, కారు టెక్నాలజీలో తన వాటాను పెంచుకోవడానికి టెక్నాలజీ దిగ్గజం ఈ పెట్టుబడులు పెట్టింది. యాపిల్ మళ్లీ తన ఐఫోన్ అమ్మకాలను చైనాలో పునరుద్ధరించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కుక్ ఈ నెలలో చైనా పర్యటనకు వెళ్లనున్నారు.
ఉబర్ కు ప్రత్యర్థి అయిన దిదిలో పెట్టుబడులు పెట్టడం, ఆటోమేకర్స్, టెక్నాలజీ కంపెనీల పెట్టుబడుల్లో కొత్త ఒరవడి సృష్టిస్తుందని తెలుస్తోంది. భవిష్యత్తులో దిది రవాణా నెట్ వర్క్, యాపిల్ రెండూ కలిసి పనిచేయడానికి అవకాశాలను చూస్తున్నామని కుక్ తెలిపారు. దిదిలో పెట్టుబడులు పెట్టడానికి చాలా కారణాలున్నాయని, చైనా మార్కెట్ గురించి లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యామని చెప్పారు. తాము పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలనే ఇస్తాయని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ డీల్ తో చైనీస్ ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఏర్పడతాయనే ఆశాభావం కుక్ వ్యక్తంచేశారు.
యాపిల్ తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం తమకు కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని దిది చుక్సింగ్ సీఈవో, వ్యవస్థాపకుడు చెంగ్ వీ తెలిపారు. బస్ లకు, ప్రైవేట్ కార్లకు బుకింగ్ లు, టాక్సీలను అద్దెకు ఇవ్వడం, రైడ్ షేరింగ్, డ్రైవింగ్ టెస్ట్ లకు కార్లను ఇవ్వడం వంటి సేవలను దిది చుక్సింగ్ అందిస్తోంది. ఒక్క రోజులో 110 లక్షల రైడ్ లను కంపెనీ జరుపుతుంటోంది. 400 చైనీస్ నగరాల్లో 3000లక్షల మంది యూజర్లు దీని సేవలను పొందుతున్నారు. ప్రైవేట్ కారు మార్కెట్ లో 87శాతం, టాక్సీలను అద్దెకు ఇవ్వడం 99శాతం షేరును ఈ కంపెనీ కలిగి ఉంది. అయితే చైనాలో ఆధిపత్య స్థానంలో ఉన్న దిది గత కొంతకాలంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. గతవారమే దిది రవాణా నెట్ వర్క్ కు చెందిన ఒక డ్రైవర్ ను, దోపిడి చేసి మహిళా ప్యాసెంజర్ ను హత్య చేసిండనే నేపథ్యంలో అరెస్టు చేశారు. గత ఆరు నెలల్లో ఇద్దరు దిది డ్రైవర్స్ అత్యాచారం, దొంగతనం కేసులో దోషులుగా గుర్తించబడ్డారు.