ఎన్నాళ్లీ నిరీక్షణ
ఆకివీడు: డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ టీచింగ్(డైట్) విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఏడాది జూన్ 6న ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులకు నేటికీ ఆయా కాలేజీల్లో చేరేందుకు కౌన్సెలింగ్ చేపట్టలేదు. జిల్లాలోని 36 డైట్ కాలేజీల్లో 1200 సీట్లు ఉండగా 600 మంది మాత్రమే ప్రవేశ పరీక్ష రాశారు. వారిలో 400 మంది అర్హత పొందారు. అర్హత పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 20 నుంచి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని సూచించారు. అయితే ఈ తేదీని వాయిదా వేస్తూ అక్టోబర్ 20న వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని, 21, 22 తేదీల్లో కాలేజీల అలాట్మెంట్ ప్రకటిస్తామని తాత్కాలిక ఆదేశాలు జారీ చేశారు. 23న అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
అక్టోబర్ 22వ తేదీ దాటిపోయినా అలాట్మెంట్ ప్రకటన విడుదల చేయలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 23 నుంచి 26 వరకూ కౌన్సెలింగ్ ఉంటాదని ప్రకటించారు. వెబ్ ఆప్షన్స్, అలాట్మెంట్ ప్రకటించకుండా కౌన్సె లింగ్కు ఎలా హాజరవుతామని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. 2017 డైట్ వెబ్సైట్లోకి వెళితే ఖాళీ ప్రదేశం చూపిస్తోందన్నారు. అసలు కౌన్సెలింగ్ ఉంటుందా అనే సందేహం విద్యార్థుల్లో ఏర్పడింది. డైట్ విద్యార్థుల పట్ల విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. ఇటు డిగ్రీలో చేరలేక, అటు డైట్ సీటు వదులుకోలేక విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏడాది కోల్పోయాను
ఇంటర్ పూర్తయిన తర్వాత డైట్ ప్రవేశ పరీక్ష రాశాను. 151వ ర్యాంక్ వచ్చింది. నేటికీ తరగతులు ప్రారంభించలేదు. అసలు కౌన్సెలింగ్ జరగలేదు. డిగ్రీలో చేరిన నేను ర్యాంక్ రావడంతో సర్టిఫికెట్లు వెనక్కి తీసుకున్నాను. ఈ విద్యా సంవత్సరం కోల్పోయినట్లే. డైట్ కౌన్సెలింగ్లో కాలేజీ అలాట్మెంట్ తక్షణం ఇచ్చి, తరగతులు ప్రారంభించాలి.
–బోణం రమ్య, డైట్ ర్యాంకర్, ఆకివీడు
కన్వీనర్దే బాధ్యత
డైట్ కన్వీనర్ ఆదేశాల మేరకే ప్రవేశాల పక్రియ నిర్వహిస్తారు. 23న సర్టిఫికెట్ల తనిఖీకి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. 2017 డైట్ వెబ్సైట్లోకి వెళితే వివరాలన్నీ వస్తాయి. కౌన్సెలింగ్ తేదీల కోసం విద్యార్థులు ఫోన్ చేసి అడుగుతున్నారు. వెబ్సైట్లోకి వెళితేనే గాని మాకూ ఏమీ తెలియదు. ఆన్లైన్లోనే డైట్ కార్యకలాపాలు జరుగుతున్నాయి.
–చంద్రకళ, డైట్ ప్రిన్సిపల్, దూబచర్ల