diffcult
-
కొంపముంచిన ‘హాలోవీన్’ మేకప్!.. భయంకరంగా మహిళ ముఖం!
హాలోవీన్ ఉత్సవాన్ని అమెరికా, ఐరోపా దేశాల్లో జరుపుకుంటారు. ఇప్పుడు భారత్‌లోనూ ఈ ఉత్సవం క్రేజ్ కనిపిస్తోంది. ఈ ఉత్సవంలోని ప్రత్యేకత ఏమిటంటే ఇందులో పాల్గొనే జనం ఇతరులను భయపెట్టేలాంటి మేకప్ వేసుకుని రోడ్లపై తిరుగుతారు. ఒకరికొకరు బహుమతులు లేదా చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 న జరుపుకుంటారు. ఈ ఉత్సవం సందర్భంగా ఒక మహిళ తన ముఖంపై వేయించుకున్న భయంకరమైన టాటూ ఆమెను మరింత ఇబ్బందులపాలు చేసింది. ఎలిజబెత్ రోజ్ అనే మహిళ హాలోవీన్ రోజున తాను భయానకంగా కనిపించేందుకు తన ముఖంపై తాత్కాలిక టాటూలు వేయించుకుంది. ఆ మహిళ నుదిటిపైన, నోటిపైన టాటూలు వేయించుకుంది. అయితే ఆ టాటూల గుర్తులు తొలగక పోవడంతో ఆమెకు ఇబ్బంది ఎదురయ్యింది. ఆ మహిళ తన ముఖంపై ఉన్న టాటూను తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఒక వీడియోలో తెలియజేసింది. ‘నేను నా ముఖంపై టాటూ వేయించుకుని హాలోవీన్‌కు వెళ్లాను’ అని రోజ్ ఆ వీడియోలో పేర్కొంది. ఆమె ఆ టాటూను తొలగించడానికి కాటన్ ప్యాడ్‌ను ఉపయోగించింది. అయినా ఉపయోగం లేకపోయింది. మరుసటి రోజు తనకు ఆఫీసులో మీటింగ్ ఉన్న విషయం గుర్తుకువచ్చి ఆమె మరింత ఆందోళనకు గురయ్యింది. అయితే వోడ్కా, యాంటీ బాక్ జెల్, సెల్లోటేప్, ఆలివ్ ఆయిల్, నెయిల్ వార్నిష్ రిమూవర్ మొదలైనవాటిని ఉపయోగించి ఎట్టకేలకు ఆ టాటూ గుర్తులను తొలగించింది. ఇది కూడా చదవండి: ప్రియుడు ఖరీదైన గిఫ్ట్ ఇస్తే బ్రేకప్ చెప్పింది.. ట్విస్ట్ ఇదే! -
అమ్మకు ‘కాన్పు’ కష్టం!
కొత్తగూడెం రూరల్, గుండాల: అమ్మకు ‘కాన్పు’ కష్టం వచ్చింది.. ఆస్పత్రి బెడ్‌పై సురక్షితంగా బిడ్డకు జన్మనివ్వాల్సిన అమ్మ.. ఆటోలో, ఎడ్ల బండిపై ప్రసవిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఒక చోట.. రహదారి సౌకర్యం సరిగా లేక 108 అంబులెన్సు వెళ్లక మరో చోట.. ప్రమాదకర పరిస్థితుల్లో కాన్పు జరగాల్సిన దుస్థితి ఏర్పడింది. శుక్రవారం ఈ రెండు ఘటనలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగాయి. వైద్య సిబ్బంది పట్టించుకోక.. కొత్తగూడెంలోని మేదరబస్తీకి చెందిన పూజ నిండు గర్భిణి. భర్త కూలీ పనులకు వెళ్లగా.. ఉదయం 10.30 సమయంలో ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆటోలో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కవిత అనే మహిళ మృతిచెందిందంటూ ఆమె బంధువులు అక్కడ ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఎవరినీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండిపోయారు. ఈ సమయంలో ఆటోలో వచ్చిన పూజకు నొప్పులు తీవ్రమై నడవలేని పరిస్థితిలో ఉంది. ఆమెను స్ట్రెచర్‌పై ఆస్పత్రిలోకి తీసుకెళ్లాలని బంధువులు వేడుకున్నా సిబ్బంది పట్టించుకోలేదు. కొద్దిసేపటికి ఆటోలోనే పూజ ప్రసవించింది. చివరికి కొందరు వ్యక్తులు కలసి పూజను చేతులపై మోసుకుంటూ ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. వాగులు దాటి రాలేక.. కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ఎలగలగడ్డకు చెందిన ఇర్ప సుగుణ నిండు గర్భిణి. శుక్రవారం మధ్యాహ్నం ఆమెకు పురుటి నొప్పులు రావడంతో.. కుటుంబ సభ్యులు గుండాల 108కు సమాచారం అందించారు. అయితే మార్గంలో రెండు వాగులు ఉన్నందున అంబులెన్సు అక్కడివరకు రాలేదని, ఎడ్ల బండిపై కొంత దూరం తీసుకురావాలని వారు సూచించారు. దీంతో బంధువులు సుగుణను ఎడ్ల బండిపై తరలిస్తుండగా.. సాయనపల్లి సమీపంలోని జమ్మిచెరువు ప్రాంతంలో బిడ్డకు జన్మనిచ్చింది. కాసేపటికే అక్కడికి చేరుకున్న 108 వాహనంలో ఆమెను ఆస్పత్రికి తరలించారు. -
అవ్వకు ఎంత కష్టం
గుణదల : నా.. అన్నవారు ఎవరూ లేరు.. కట్టుకున్నవారు.. కన్నవారు గతించారు.. మిగిలింది నేనొక్కదానే.. మాది శ్రీకాకుళం జిల్లా వండవ... అని చెబుతున్న ఆవాల అప్పల నర్సమ్మ (75) ఒక్కరే పిండ ప్రదానం చేస్తుంటే... అయ్యో ఈ ముసలవ్వకు ఎంత కష్టం వచ్చింది అని పలువురు కళ్లొత్తుకున్నారు. సోమవారం పద్మావతి ఘాట్‌లో తన భర్త, కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు, మనుమలు, మనుమరాళ్లకు ఆమె పిండ ప్రదానం చేసింది. గ్రామంలో జరిగిన ఓ సంఘటన వల్ల తన కుటుంబీకులందరూ చనిపోయారని, తాను ఒక్కదాన్నే మిగిలానని, అకాల మరణం చెందిన తన కుటుంబ సభ్యుల ఆత్మలు శాంతించాలని పిండ ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం నుంచి ఒక్కదాన్నే వచ్చాచని ఆమె తెలిపారు.