వీల్‌చెయిర్లతో దివ్యాంగుల టి-20 క్రికెట్!
ఇప్పటివరకు మనం అంధుల క్రికెట్ వరల్డ్ కప్ చూశాం. కానీ దివ్యాంగులు వీల్ చెయిర్లలో కూర్చుని క్రికెట్ ఆడటం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు కాదు.. 2009 నుంచే ఈ తరహా క్రికెట్ మన దేశంలో మొదలైంది. ఇప్పటికి యూపీ, హరియాణా, పంజాబ్, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలకు ప్రత్యేకంగా జట్లు ఉన్నాయి. త్వరలోనే అంటే.. ఈ సంవత్సరం మే నెలలో నేపాల్‌లో టి-20 వీల్‌చెయిర్ క్రికెట్ వరల్డ్ కప్ కూడా నిర్వహిస్తున్నారు. అందుకోసం ముందుగా దేశంలో ఉన్న ఆరు రాష్ట్రాలకు చెందిన జట్ల మధ్య పోటీలు నిర్వహించి, వాటన్నింటిలోంచి ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసి జాతీయ జట్టును కూడా రూపొందిస్తున్నారు.
ఇందుకోసం ఇటీవలే జైపూర్‌లోని చౌగన్ స్టేడియంలో జాతీయ ట్రయాంగ్యులర్ టి-20 వీల్‌చెయిర్ క్రికెట్ సిరీస్ ఒకటి జరిగింది. దివ్యాంగులు పోటా పోటీగా ఇందులో పాల్గొన్నారు. ఫీల్డర్లయితే కుర్చీలోంచి కిందకు జారి డైవ్ చేసి మరీ.. బంతిని ఆపడం లాంటి విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయి. ఇటీవలి వరకు రాజస్థాన్ క్రీడాకారులు కూడా ఢిల్లీ జట్టుకు ఆడేవారు. కానీ ఇప్పుడు వాళ్ల సొంత జట్టు రూపొందింది. ఈ జట్టు త్రికోణ సిరీస్‌లో పంజాబ్ జట్టును ఫైనల్స్‌లో ఓడించింది.
ఇప్పటివరకు భారతదేశంలోని ఆరు రాష్ట్రాల జట్లలో కేవలం పంజాబ్‌కు చెందిన రోహిత్ అన్హోత్రా మాత్రమే సెంచరీ చేశారు. స్పోర్ట్స్ వీల్ చెయిర్ ఖరీదు దాదాపు 35వేల రూపాయల వరకు ఉంటుందని, చాలామంది దాన్ని కొనుక్కునే స్థోమత లేక, సాధారణంగా పేషెంట్లకు వాడే వీల్చెయిర్నే వాడతారని రోహిత్ చెప్పాడు. అవి బాగా నెమ్మదిగా కదులుతాయని, పైగా వాటిని వాడితే ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా ఉందని అన్నాడు. అంతేకాదు, వీళ్లు ప్రాక్టీసు చేయడం కూడా చాలా ఇబ్బంది అవుతోంది. వీల్‌చెయిర్లను పిచ్ మీద, గ్రౌండ్లోను అనుమతిస్తే అవి పాడవుతాయని క్రికెట్ సంఘాల వాళ్లు అంటున్నారు.
(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)