పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి వైఎస్
సాక్షి, హైదరాబాద్: పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని, ఆయన రాజకీయాలకతీతంగా 8 కోట్ల మందికి సంక్షేమ పథకాలందించి సీఎం ఎలా ఉండాలి.. ఎలా ఉండొచ్చు అని నిరూపించారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన పీసీసీ నేతలు కొనియాడారు. వైఎస్ 66వ జయంతి సందర్భంగా బుధవారమిక్కడ ఇందిరాభవన్‌లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పీసీసీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు.
ఏపీ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు తాగునీరు, సాగునీరు, ఇతర అభివృద్ధి పథకాలు, సాంకేతిక పరిజ్ఞానం అమలయ్యాయంటే అదంతా వైఎస్ చలవేనన్నారు. అభివృద్ధి ఫలాలు ప్రజలకందించడంలో ఆయన ఏ పార్టీ, ఏ కులం, ఏ మతం అనేది చూడలేదన్నారు.
సంక్షేమ పథకాలు వైఎస్ చలవే: ఉత్తమ్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు ప్రస్తుతం సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే వైఎస్ చలవేనన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, వృద్ధాప్య, వికలాంగుల పింఛన్ తదితర పథకాలను సమర్థంగా అమలు చేశారని, బడుగు, బలహీనవర్గాల ఇబ్బందులు తెలిసిన వ్యక్తిగా వారికోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు.
తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులిద్దరూ పథకాల పేర్లు మార్చి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని, అయినా అవి అసలైన లబ్ధిదారులకు అందట్లేదని చెప్పారు. ఏపీ శాసనమండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య మాట్లాడుతూ.. రాజశేఖరరెడ్డి లేనిలోటు పూడ్చలేనిదన్నారు. తెలంగాణ శాసనమండలిలో విపక్షనేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులెదురైనా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించి 1.30 లక్షలమంది మైనార్టీలకు ఉన్నతవిద్యను అందజేసిన ఘనత ఆయనదేనని కొనియాడారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్కలు మాట్లాడుతూ..
వైఎస్ లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన పథకాలద్వారా తెలుగు ప్రజలు రోజూ గుర్తు చేసుకుంటుంటారన్నారు. కార్యక్రమంలో ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఎం.ఎ.ఖాన్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి సుధాకర్‌బాబు, మాజీ ఎంపీ తులసిరెడ్డి, రాష్ట్ర కిసాన్‌సెల్ చైర్మన్ రవిచంద్రారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెట్టి కుసుమకుమార్, కార్యదర్శి లక్ష్మణ్ యాదవ్‌లతోపాటు కాంగ్రెస్ నేతలు, వైఎస్ అభిమానులు హాజరయ్యారు.