Digital andhra pradesh
-
ఏపీ ప్రభుత్వానికి గ్లోబల్ డిజిటల్ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి చౌకగా అత్యాధునిక వైద్యం అందించడమే రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ ధ్యేయమని, అందుకోసం వైద్య రంగంలో విప్లవాత్మక విధానాలు ప్రవేశపెడుతున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. వైద్యుడు, మానవతావాది అయిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అడుగుజాడల్లోనే ఆయన తనయుడు సీఎం జగన్ సాగుతున్నారని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో వైద్య రంగం అభివృద్ధికి ప్రవేశపెట్టిన సంస్కరణలు, అందరికీ వైద్యాన్ని అందుబాటులో ఉంచేందుకు చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపుగా ఏపీ ప్రభుత్వానికి రెండు గ్లోబల్ డిజిటల్ హెల్త్ అవార్డులు దక్కాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు (గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్ – 2022) ముగింపు సమావేశంలో గౌరవ అతిథిగా పాల్గొన్న మంత్రి రజిని ఈ అవార్డులను అందుకున్నారు. మహిళల కోసం డిజిటల్ హెల్త్ లోగోను ఆవిష్కరించారు. 14 దేశాలకు చెందిన ప్రముఖ వైద్యులు, శాస్త్రవేత్తలు, వైద్య రంగ పారిశ్రామికవేత్తలు పాల్గొన్న ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌లో వైద్య, ఆరోగ్య రంగంలో అనుసరిస్తున్న విధానాలపై సవివరమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిజిటల్ హెల్త్‌లో రాష్ట్రానికి వచ్చిన అవార్డులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దార్శనికతకు నిదర్శనమని చెప్పారు. లభ్యత, సౌలభ్యత, ఆమోదయోగ్యత, స్తోమత (4ఏస్) పునాదులుగా వైద్య రంగాన్ని పటిష్టం చేస్తున్నట్టు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన ‘నాడు–నేడు’ ద్వా రా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి సమగ్ర వైద్య సదుపాయాలను కల్పిస్తున్నామని వివరించారు. ఆరోగ్య సంరక్షణలో భవిష్యత్తులో ఏపీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వ కృషికి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ హెల్త్‌లో ఇప్పటికే ఆరు అవార్డులు ఇచ్చిందన్నారు. పీపీపీ విధానంలో రాష్ట్రంలో హార్ట్ మెడికల్ టీచింగ్ యూనివర్సిటీ, రీసెర్చ్ వర్సిటీ, క్యాన్సర్ కేర్ సెంటర్ స్థాపన, డిజిటల్ వైద్య సేవల్లో కలిసి పని చేయాలని ఔత్సాహికులను ఆహ్వానించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే 16 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో భాగస్వాములు కావాలన్నారు. త్వరలో ఏపీలో ‘ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్’ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఏపీలో డిజిటల్ పరిణామం మలుపు తీసుకున్న విధానంపై నమ్మి లక్ష్మి అనే మహిళ టెలీపాథాలజీ కథను వివరించారు. ఏపీలో సమర్థంగా ఆరోగ్య కార్యక్రమాలు ఏపీలో ఆరోగ్య కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలో అత్యధికంగా 3,40,15,800 ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతాలు ఏపీలోనే ఉన్నాయన్నారు. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీలో 9,500 మంది ప్రభుత్వ వైద్యులు, 11,152 స్టాఫ్ నర్సుల నమోదు పూర్తయిందన్నారు. హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీలో 14,182 ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాలు, ఈ–హాస్పిటల్ సాఫ్ట్వేర్ ద్వారా 121, డాక్టర్ కేర్ సాఫ్ట్వేర్ ద్వారా మరో 1,648 వసతులు నమోదు చేసినట్టు చెప్పారు. ఏఎన్ఎం మొబైల్ యాప్, ఎంవో యాప్, డాక్టర్ కేర్ ఈ–హాస్పిటల్, ఎంఎల్‌హెచ్‌పీ అప్లికేషన్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం, డాష్ బోర్డుతో డిజిటల్ హెల్త్‌ను మరో మెట్టు ఎక్కించడంలో ఏపీ ముందుందని తెలిపారు. ఈ సదస్సులో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జీఎస్ నవీన్ కూడా పాల్గొన్నారు. -
ఏపీలో శ్రీదేవి డిజిటల్ సేవలు ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ సేవలు అందించేందుకు శ్రీదేవి డిజిటల్ సిస్టం ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్తో ఒప్పందం కుదుర్చుకొంది. బీఎస్ఎన్ఎల్ జీఎం ఆడమ్‌తో సంస్థ చైర్మన్ రామకృష్ణంరాజు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఆరు జిల్లాల్లో కేబుల్ టీవీతో పాటు హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్, నెట్ సేవలను ఈ సంస్థ అందించనుంది. మార్కెట్లో కార్పొరేట్ సంస్థలకు ధీటుగా తమ సేవలను అందిస్తామని రామకృష్ణంరాజు తెలిపారు. -
డిజిటల్ ఆంధ్రాగా తీర్చిదిద్దుతాం
తిరుపతిలో ఐఐటీ ప్రారంభించిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తిరుపతిమంగళం: రాష్ట్రంలో ఐటీరంగాన్ని అభివృద్ధి చేసి, డిజిటల్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని ఐటీ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖా మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. తిరుపతి కరకంబాడి రోడ్డులోని ఆర్సీఆర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ సెంటర్ ప్రాంగణంలో బుధవారం ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంకుబేషన్ సెంటర్‌ను, రేణిగుంట రోడ్డులోని కృష్ణతేజ విద్యాసంస్థల ప్రాంగణంలో ఐఐటీని ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ ఏపీని ఎడ్యుకేషనల్ హబ్‌గా, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే తిరుపతికి ఐఐటీని తీసుకొచ్చారన్నారు. ప్రతి పల్లెకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించి 4జీ సేవలు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. తద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, విద్య, వైద్య సమాచారం ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తుందన్నారు. డిజిటల్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.460కోట్లు ఇప్పటికే కేటాయించిందన్నారు. వచ్చే సంవత్సరం మార్చి కల్లా అన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, కాకినాడ నగరాల్లో ఐటీని అభివృద్ధి చేస్తున్నామని, 19 కంపెనీల ప్రతినిధులు రాష్ట్రంలో తమ సంస్థలు స్థాపించడానికి ముందుకు వచ్చారని తెలిపారు. పుట్టపర్తిని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. రాబోయే మూడేళ్లలో ఐటీ రంగంలో ఐదు లక్షలు, ఎలక్ట్రానిక్స్ రంగంలో నాలుగు లక్షల ఉద్యోగాలు టార్గెట్‌గా పెట్టుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో 20 శాతం నిధులు ఐటీ ద్వారా పొదుపు అవుతోందని, రాబోయేది ఐటీ కాలమేనన్నారు. ఎమ్మెల్సీ గాలిముద్దుకృష్ణనాయుడు, తిరుపతి ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ పాల్గొన్నారు. శ్రీరామ విద్యార్థులతో... ఐఐటీ ప్రారంభం అనంతరం తిరుపతి-కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలను మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డితోపాటు రాష్ట్ర ఐటీ సలహాదారులు సత్యనారాయణ సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడారు. 37ఐటీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. తద్వారా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. తిరుపతి కేంద్రంగా ప్రారంభించిన ఇంక్యుబేషిన్ సెంటర్లో భాగస్వామ్యానికి స్టార్టప్ కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. 5వేలు స్టార్టప్స్‌ను రాష్ట్రంలో ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఐటీ కంపెనీలకు పెట్టుబడులు పెట్టేందుకు ఇదే తరుణమన్నారు. చదలవాడ విద్యాసంస్థల అధినేత్రి చదలవాడ సుచరిత, శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాల అధినేత మన్నెం రామిరెడ్డి, డెరైక్టర్లు మన్నెం అరవిందకుమార్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, బిసి వెంకటరెడ్డి, ప్రిన్సిపాల్ కె. జయచంద్రారెడ్డి, నాయకులు శ్రీధర్ వర్మ, గాలి సురేంద్రనాయుడు, నరిసింహయాదవ్, సూరా సుధాకర్‌రెడ్డి, ఊట్ల సురేంద్రరె డ్డి, మునిశేఖర్, పుష్పావతి పాల్గొన్నారు. -
డిజిటల్ ఏపీ దిశగా చర్యలు: మంత్రి పల్లె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుందని ఏపీ సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ శాఖల్లో ఈ- గవర్నెన్స్ అమల్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్లో మంత్రి మీడియాతో మాట్లాడారు. తొలి విడతగా పది ప్రభుత్వ శాఖల్లో కాగిత రహిత పాలన కొనసాగుతుందని, మొత్తం ఆన్లైన్ ద్వారానే కార్యకలాపాలు సాగుతాయని చెప్పారు. రుణ మాఫీకి చంద్రబా బు కట్టుబడి ఉన్నారని, తొలి విడత రుణ మాఫీపై ప్రకటన చేసినా.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖలో ధర్నాకు దిగడం సరికాదన్నారు. -
డిజిటల్ ఏపీ ఆవిష్కరిస్తాం
ఐటీ కంపెనీల సీఈవోల సదస్సులో సీఎం చంద్రబాబు హైటెక్ సిటీని తలదన్నే రీతిలో విశాఖలో ‘సిగ్నేచర్ టవర్’ ఐటీ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిని చేస్తాం ప్రతి ఇంటిని ఒక ఐటీ కేంద్రంగా మారుస్తాం సిలికాన్ కారిడార్‌గా విశాఖ అభివృద్ధి చేస్తాం గూగుల్, విప్రో తదితర సంస్థలతో ఒప్పందాలు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో విస్తారంగా ఉన్న సహజ వనరులు, మానవ వనరులను సద్వినియోగం చేసుకుని అతి త్వరలోనే ‘డిజిటల్ ఆంధ్రప్రదేశ్’ను ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి కనీసం ఒకర్ని ఈ-ఆక్షరాస్యునిగా చేయడంతోపాటు ఒకర్ని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. ఐటీ కంపెనీల సీఈవోలతో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విశాఖపట్నంలో నిర్వహించిన సదస్సులో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇన్నోవేషన్-స్టార్ట్ అప్ విధాన పత్రాలను విడుదల చేశారు. రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు గూగుల్ సంస్థతో రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఐటీ కంపెనీల స్థాపనకుగాను విప్రో, సమీర్, టెక్ మహేం ద్ర, టిస్సాల్వ్, మోబ్మి సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకుంది. అదే విధంగా 16 ఐటీ కంపెనీలకు విశాఖపట్నం, విజయవాడలలో భూములు, ఇంక్యుబేషన్ సెంటర్లో స్థలాలు కేటాయించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తూ ఏమన్నారంటే... - రానున్న నాలుగేళ్లలో రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం. ఐటీ రంగ ఫలాలను సామాన్యునికి అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. స్వయంసహాయక సంఘాల కార్యకలాపాలను ఆన్లైన్ విధానంలోకి తీసుకువస్తాం. చిన్నతరహా- మధ్యతరహా పరిశ్రమలు, వ్యాపారాలను ఆన్లైన్ విధానంలోకి తీసుకువచ్చి వాటి విస్తరణకు బాటలు వేస్తాం. - ఇంటర్నెట్ సేవలను తెలుగు భాషలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మా ప్రభుత్వం గూగుల్ సంస్థకు పూర్తిగా సహకరిస్తుంది. ప్రతి ఇంటిని ఓ ఐటీ కేంద్రంగా రూపాంతరం చెందేలా చేస్తాం. - హైదరాబాద్‌లోని హైటెక్ సిటీని తలదన్నేరీతిలో విశాఖపట్నం మధురవాడలో ‘సిగ్నేచర్ టవర్’ను నిర్మిస్తాం. ఇందుకోసం త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపడతాం. విశాఖపట్నంను సిలికాన్ కారిడార్‌గా అభివృద్ధి పరుస్తాం. ముంబాయి తరువాత దేశానికి ఆర్థిక, పారిశ్రామిక రాజధానిగా విశాఖపట్నంను తీర్చిదిద్దుతాం. - రాజకీయ- పరిపాలన రాజధానిగా విజయవాడ, ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతిలను అభివృద్ధి పరుస్తాం. ఈ మూడు మెగాసిటీలతోపాటు రాష్ట్రంలో 30 స్మార్ట్ సిటీలను తీర్చిదిద్దుతాం. విశాఖపట్నం జిల్లాలో ఉన్న బాక్సైట్‌తోపాటు వివిధ జిల్లాల్లో ఉన్న ఖనిజ సంపదను వెలికితీస్తాం. - ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాలలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉండేలా చర్యలు తీసుకుంటాం. హారాష్ట్రంలో ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగా లు, ఎలక్ట్రానిక్ రంగంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఐటీ కంపెనీల స్థాపనకు వీలుగా సింగిల్ విండో విధానం ద్వారా నాలుగు వారాల్లోనే అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. - సమావేశంలో ఐటీ శాఖ సలహాదారు జె.సత్యన్నారాయణ, ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిష్ గోపాలకృష్ణన్, మోబ్మి సీఈవో సంజయ్ విజయ్‌కుమార్‌లతోపాటు నాస్కామ్, గూగుల్, టీసీఎస్, విప్రో, టెక్ మహేంద్ర సంస్థల ప్రతినిధులు, పలు ఐటీ సంస్థల సీఈవోలు పాల్గొన్నారు. -ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, పీతల సుజాత, ఎంపీలు కె. హరిబాబు, అవంతి శ్రీనివాస్, కొత్తపల్లి గీత, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, వాసుపల్లి గణేష్, బండారు సత్యన్నారాయణమూర్తి, తదితరులు హాజరయ్యారు. 20 ఎకరాల్లో సిగ్నేచర్ టవర్! విశాఖశివారులోని మధురవాడలో ‘సిగ్నేచర్ టవర్’ పేరిట ఐటీ కేంద్రం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మధురవాడ ఎస్ఈజెడ్లోని హిల్-3 మీద 20 ఎకరాలను కేటాయించాలని నిర్ణయించింది. సీఎం సోమవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి టవర్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఈమేరకు భూ కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ యువరాజ్‌తోపాటు ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. సిగ్నేచర్ టవర్ డిజైన్‌ను నిర్ణయించేందుకు టెండర్ల ప్రక్రియ చేపట్టాలని సూచించారు. అలాగే విశాఖపట్నంలో ఐఐఎంతోసహా పలు ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు కోసం భూములు గుర్తింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. కేంద్ర మానవ వనరుల శాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్‌లో త్వరలో సమావేశం నిర్వహించనున్నామని, ఆలోపు భూముల గుర్తింపు పూర్తి చేయాలని చెప్పారు. ఆ సమావేశం తర్వాత విశాఖలో ఏఏ విద్యా సంస్థలు ఏర్పాటు చేసేది స్పష్టత ఇస్తామని సీఎం తెలిపారు. ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభం అంతకుముందు సీఎం చంద్రబాబు విశాఖపట్నం శివారులోని మధురవాడలోని ఐటీ ఎస్ఈజెడ్లో రూ.23 కోట్లతో నిర్మిం చిన టెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ (సన్‌రైజ్ స్టార్ట్అప్)ను ప్రారంభిం చారు. ఏపీఐఐసీ అధికారులతో మాట్లాడి ఐటీ రంగ సమస్యలను తెలుసుకున్నారు. విశాఖపట్నంలో ఐటీ, పర్యాటక రంగాలను జోడించి అభివృద్ధి పరిచేలా ప్రణాళిక రూపొందించమని అధికారులకు సూచిం చారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. విద్యార్థులు నిరంత రం కొత్త ఆలోచనలతో ముందుకువచ్చి అందుబాటులోని టెక్నాలజీని ఉపయోగిం చి అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.