రెండంకెల అభివృద్ధే లక్ష్యం
–రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనరేట్ జాయింట్ డైరెక్టరు శ్రీధర్
–ఖరీఫ్–2017 ప్రణాళికపై రైతులతో సమీక్ష
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రైతు ఆదాయం ద్వారా రెండంకెల అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనరేట్ జాయింట్ డైరెక్టరు, ఖరీఫ్ ప్రణాళిక జిల్లా పరిశీలకులు వి.శ్రీధర్ అన్నారు. రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ ఖరీఫ్ వ్యవసాయ ప్రణాళికపై శుక్రవారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో వ్యవసాయాధికారులు, రైతులతో సమీక్ష నిర్వహించారు. శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రప్రథమంగా 13 జిల్లాల్లో రైతులు, వ్యవసాయాధికారులతో చర్చించి వ్యవసాయ ప్రణాళికలు తయారు చేస్తున్నట్టు తెలిపారు. పంటలు, ప్రాంతాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 60వేల హెక్టార్లలో అపరాలు పండించి రైతులకు అదనపు ఆదాయం అందేలా చర్యలు చేపట్టామన్నారు. గ్రామాలు, మండలాలు, డివిజన్ స్థాయి సదస్సులు ఏర్పాటు చేసి రైతుల డిమాండ్లను ప్రణాళికలో చేర్చుతామన్నారు. ప్రస్తుతం సాగులో లేని భూమిని సైతం వ్యవసాయ అనుబంధశాఖల అధికారులతో చర్చించి ఆ ప్రాంతాల్లో ఏ పంటలు పండుతాయో వాటిని వేసేలా చర్యలు చేపడతామన్నారు. ముందుగా మండలాల వారీగా రైతులు, వ్యవసాయాధికారుల అభిప్రాయాలను తీసుకున్నారు. జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ కేఎస్వీప్రసాద్, డిప్యూటి డైరెక్టర్లు కె.లక్ష్మణరావు, వీటీ రామారావు, బోసుబాబు, ఏరువాక కోఆర్డినేటర్ ప్రవీణ, కేవీకే శాస్త్రవేత్త సత్యవాణి, రాజమహేంద్రవరం , కోరుకొండ సహాయ సంచాలకులు కె.సూర్యరమేష్, డి.కృష్ణ, వ్యవసాయాధికారులు, ఏఈవోలు, ఎంపీఈవోలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.