ఒంటికి.. రెంటికీ అవస్థలు
చెన్నూర్
ప్రభుత్వ పాఠశాలల్లోని మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరాయి. దీంతో కొన్ని చోట్ల నిరుపయోగంగా మారగా.. మరికొన్ని చోట్ల తలుపులు లేక వినియోగంలో లేకుండా పోయాయి. ఫలితంగా విద్యార్థులు ఒంటికి.. రెంటికి ఇంటికే వెళ్లాల్సి వస్తోంది. మండలంలో 55 ప్రభుత్వ ప్రాథమిక, 7 ప్రాథమికోన్నత, 10 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
మొత్తంగా 4,750 మంది విద్యార్థులు చదువుతున్నారు. కత్తెరసాల, అక్కెపల్లి, చింతలపల్లి, శివలింగాపూర్, బావురావుపేట తదితర గ్రామాల్లోని పాఠశాలల్లో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరాయి. కొమ్మెర, ఎల్లక్కపేట, లింగంపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు ప్రతీ రోజు కాలకత్యాలు తీర్చుకోవడానికి ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. వర్షాకాలంలో మరుగుదొడ్ల చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచి, పాములు సంచరిస్తుండడంంతో విద్యార్థులు అటు వైపు వెళ్లేందుకు జంకుతున్నారు. ఆయా పాఠశాలల్లోని బాలికల ఇబ్బందులు వర్ణణాతీతం. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు సక్రమంగా లేకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఉపాధ్యాయులూ ఇబ్బందులకు గురవుతున్నారు.
రెండేళ్ల క్రితం ఆర్డబ్ల్యూస్ ఆధ్వర్యంలో పాఠశాలల్లో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణాలు ఇప్పటికీ పూర్తి కాలేదు. అధికారులు మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని, శిథిలావస్థకు చేరినవాటిని మరమ్మతు చేయించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. మరుగుదొడ్ల విషయమై ఎంఈవో రాధాకృష్ణమూర్తిని సంప్రదించగా.. మరమ్మతుల కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తామని, మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చూస్తామని తెలిపారు.