అర్ధరాత్రి తెరుచుకున్న ‘డిండి’ టెండర్లు?
రూ.3,940 కోట్ల పనులను దక్కించుకున్న ప్రముఖ సంస్థలు
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు నీరందించేందుకు ఉద్దేశించిన డిండి ఎత్తిపోతల పథకం పనుల ఆర్థిక టెండర్లు (ప్రైస్ బిడ్ల)ను శుక్ర వారం అర్ధరాత్రి తెరిచినట్లు సమాచారం. మొత్తంగా 7 ప్యాకేజీలకుగాను రూ.3,940 కోట్ల విలువైన పనులను ప్రధాన కాంట్రాక్టు సంస్థలు దక్కించుకున్నట్లు తెలిసింది.
మరో వారం రోజుల్లో అప్పగింత!
నల్లగొండ జిల్లాలో ఖరారైన సింగరాజుపల్లి (0.8 టీఎంసీ), గొట్టిముక్కల (1.8 టీఎంసీ). చింతపల్లి (0.99 టీఎంసీ), కిష్టరాంపల్లి (5.68 టీఎంసీలు), శివన్నగూడెం (11.96 టీఎంసీలు) రిజర్వాయర్లు, వాటికి అనుబంధంగా మెయిన్ కెనాల్ పనుల టెండర్లకు సంబంధించి సాంకేతిక అంశాల పరిశీలనను గత నెల రెండో వారంలోనే ప్రారంభించారు.
అది ఆలస్యం కావడంతో శుక్రవారం రాత్రి ప్రైస్ బిడ్లు తెరిచిన సూపరింటెండెంట్ స్థాయి అధికారులు.. వాటిని పరిశీలన కోసం చీఫ్ ఇంజనీర్‌కు పంపించారు. వారి పరిశీలన పూర్తయ్యాక కమిషనర్ ఆఫ్ టెండర్స్ పరిశీలనకు పంపుతారు. అక్కడ టెండర్లు పొందిన ఏజెన్సీల అర్హతలను పరిశీలించిన అనంతరం పనులు అప్పగిస్తారు. ఈ ప్రక్రియకు మరో వారం రోజులు పట్టే అవకాశముంది.