చిరుత దాడి.. రెండేళ్ల బాలుడు మృతి
పింప్రి: చిరుతపులి దాడి చేయడంతో రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి జూనార్ తాలూకాలోని డింగోరే గ్రామంలో జరిగింది. దీంతో గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. అటవీ శాఖ విభాగ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మృతి చెందిన బాలున్ని సాయి సంతోష్‌గా పోలీసులు గుర్తించారు. గత పదిహేను రోజుల్లో చిరుత దాడి చేయడం ఇది మూడోసారి అని గ్రామస్తులు పేర్కొన్నారు. మొదటి ఘటనలో ఐదేళ్ల బాలుడు ప్రవీణ్, మరో ఘటనలో మూడేళ్ల బాలిక రేణుకా వాగ్మోరే తీవ్రంగా గాయపడిందన్నారు. కాగా, ఓతూర్, డింగోరే, కాముండి, గ్రామాలలో రెండు నెలలుగా చిరుత దాడి చేయడం ఇది ఆరవసారి.