'రాజస్థాన్' ఆధారాలతో డైనోసార్స్ గుట్టు రట్టు!
న్యూఢిల్లీ: ఒకప్పుడు భూగోళంపై తమదైన ఆధిపత్యం చలాయించిన డైనోసార్లు (రాక్షసబల్లులు) ఎలా అంతరించాయనే విషయంపై సైంటిస్టులు ఇంకా కచ్చితమైన నిర్ధారణకు రాలేదు. భారత్ లో ఇటీవల లభ్యమైన డైనోసార్ల అవశేషాల పరిశీలతో ఆ జీవులు అంతరించిపోవడానికి గల కారణాలు వెలుగులోకి వెలుగులోకి రానున్నాయి. రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లా అటవీ ప్రాంతంలో జియాలజిస్టులు సేకరించిన డైనోసార్ పాదముద్రలపై పరిశోధనలు జరుపుతున్నామని, త్వరలోనే సంచలన ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని జైనారాయణ్ వ్యాస్ యూనివర్సిటీ జియాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సురేశ్ చంద్ర మాథుర్ చెప్పారు. జైసల్మేర్ లో డైనోసార్ అవశేషాల వెలికితీతలో ప్రధాన పాత్రపోషించింది ఈయనే.
సుమారు ఆరు కోట్ల సంవత్సరాల కిందట సంభవించిన విస్పోటనం వల్లే డైనోసార్లు అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు మొదట్లో విశ్వసించేవారు. అయితే ఇటీవలి పరిశోధనల ఫలితాలను బట్టి.. ఆ ప్రతిపాదనలు సరికావేమోనని, విస్ఫోటనం జరగడానికి ముందే డైనోసార్లు అంతరించే ప్రక్రియ మొదలై ఉంటుందని కొందరు సైంటిస్టులు అంటున్నారు.
2010లో దీనికి సంబంధించిన మరో ఆసక్తికరమైన ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. దాదాపు 10 కిలోమీట్లర వైశాల్యం ఉన్న ఓ ఉల్క మెక్సికో ప్రాంతంలో పడిపోవడం, దాంతో భారీ ఎత్తున దుమ్ము, దూళి, బూడిదలు పైకిలేశాయని, తద్వారా భూ వాతావరణంలో విపరీత మార్పులు సంభవించాయని, ఆ కారణంగానే డైనోసార్లు అంతరించి ఉంటాయనే నివేదికలు రూపొందించారు. తర్వాత మూడేళ్లకు కాలిఫోర్నియా, బర్క్ లీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మరో విశ్వసనీయ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. దాని ప్రకారం 6,60,38,000 ఏళ్ల కిందట ఉల్క భూమనిని ఢీకొట్టిందని, అది.. భూమి ఇప్పుడున్న స్థితికి రావడానికి జరిగిన చివరి మార్పు అని తేల్చిచెప్పే ప్రయత్నం చేశారు.