దర్శకుడు వంశీకృష్ణపై చీటింగ్ కేసు
హైదరాబాద్ : సినిమాల్లో హీరో వేషం ఇస్తానని నమ్మించి ఓ యువకుడి నుంచి రూ.35 లక్షలు వసూలు చేసి ముఖం చాటేసిన వర్థమాన దర్శకుడు వంశీకృష్ణపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం... శ్రీనగర్ కాలనీ సమీపంలోని ప్రగతి నగర్లో నివసించే దర్శకుడు వంశీకృష్ణ వీ-డ్రీమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టి ప్రకటనలు ఇచ్చాడు.
అప్పటికే 'జోరు' అనే సినిమాలో హీరోగా నటించిన అరవింద్ ఈ ప్రకటన చూసి వంశీకృష్ణను సంప్రదించాడు. తనకు హీరోగా అవకాశం కల్పించాలని కోరగా అందుకోసం వంశీకృష్ణ రూ.35లక్షలు తీసుకున్నాడు. సినిమా తీయకపోవడంతో తనకు డబ్బు తిరిగి చెల్లించాలని అరవింద్ కోరగా...బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్శకుడు వంశీకృష్ణపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.