ఉగ్ర సూర్య
- రికార్డు స్థాయి ఉష్ణోగ్రత
- గరిష్టంగా 44.3 డిగ్రీలు
- ఐదేళ్ల తర్వాత ఇదే అత్యధికం
- మరో మూడు రోజులు ఇదే పరిస్థితి
- వడదెబ్బకు ముగ్గురి మృతి
- నేడు మరో డిగ్రీ పెరగనున్న గరిష్ట ఉష్ణోగ్రత?
- అప్రమత్తత అవసరం: వాతావరణ శాఖ
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌పై నిప్పుల వాన కురుస్తోంది. సూర్యుడు మండిపోతున్నాడు. గురువారం గరిష్టంగా 44.3 డిగ్రీలు... కనిష్టంగా 31.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఐదేళ్ల తరవాత మహా నగరంలో వేసవిలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత ఇదే.2010 మే 12న గ్రేటర్లో 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తరవాత ఆ స్థాయిలో ఇప్పుడుఎండలు మండిపోతున్నాయి. వాయువ్య భారతదేశం నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా నగరంలో వడగాల్పులు అధికంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు రోజుల పాటు వడగాలులు, గరిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత ఇదే స్థాయిలో నమోదయ్యేఅవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఎండ తీవ్రంగాఉన్న సమయాల్లో బయటికి వెళ్లేటపుడు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని... అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గాలిలో తేమ 22 శాతానికి పడిపోవడంతో బయటకువెళ్లినవారు ఎండ, వేడిగాలుల తీవ్రతకు సొమ్మసిల్లుతున్నారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ వడదెబ్బ కేసులు, కుక్క కాటు కేసులు బాగా పెరిగాయి. గ్రేటర్ పరిధిలో నీటి వినియోగం పెరిగింది. జలమండలి సరఫరా చేస్తున్న 385 గ్యాలన్ల జలాలు నగరంలో పలు ప్రాంతాలకు పూర్తి స్థాయిలో సరిపోవడం లేదు.
ట్యాంకర్ నీళ్లకు డిమాండ్ ..
ఈనెల తొలివారం నుంచి ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుండడం.. శివార్లలో బోరుబావులు వట్టిపోవడంతో నగరంలో ట్యాంకర్ నీళ్లకు డిమాండ్ పెరిగింది. గత 20 రోజులుగా జలమండలి ట్యాంకర్ నీళ్లు కావాలని 43,343 మంది బుకింగ్ చేసుకోగా.. వీరిలో 41,365 మందికి బుక్ చేసుకున్న రోజునే నీటిని సరఫరా చేసినట్లు సంబంధిత వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. మరో 1978 మంది ట్యాంకర్ నీళ్ల కోసం నిరీక్షిస్తున్నారు. గత 20 రోజులుగా ప్రైవేటు వ్యాపారుల వద్ద సుమారు లక్ష ట్రిప్పుల వరకు (ఐదువేల లీటర్ల సామర్థ్యం గలవి) ట్యాంకర్ నీళ్లు అమ్ముడయినట్లు అంచనా. నీటికి డిమాండ్ పెరుగుతుండడంతో ప్రైవేటు వ్యాపారులు వినియోగదారుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ఒక్కో ట్యాంకర్‌కు ప్రాంతం, డిమాండ్‌ను బట్టి రూ.750 నుంచి రూ.1500 వరకు వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారు. జలమండలి ట్యాంకర్ నీళ్లకు రూ.450 కాగా..ప్రైవేటు ట్యాంకర్ల దోపిడీకి కళ్లెం వేసేవారు లేకపోవడం పట్ల వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
- పెద్ద సంఖ్యలో వడదెబ్బ బాధితులు ఆస్పత్రుల్లో చేరారు
- ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ ప్రచండం
- పది గంటల నుంచి రోడ్లు నిర్మానుష్యం
- ప్రధాన ప్రాంతాలు సైతం బోసిపోయాయి
- డిస్కం చరిత్రలోనే అత్యధికంగా గురువారం
- 51 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించినట్టు తేలింది
- వివిధ సంస్థల్లోని కంప్యూటర్ నెట్వర్క్... సాంకేతిక వ్యవస్థలు దెబ్బ తిన్నాయి
- నగరంలోని వివిధ ప్రాంతాల్లో అనేకసార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం
- నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తాయి. ప్రజలు దాహంతో అల్లాడారు
- ఎండ వేడిమికి తట్టుకోలేక పౌల్ట్రీలలో పెద్ద సంఖ్యలో కోళ్లు మృతిచెందాయి
అప్రమత్తంగా ఉండండి
మరో మూడు రోజుల పాటు నగరంలో వడగాల్పులుఅధికంగా ఉంటాయి. ఎండ తీవ్రత కూడా తగ్గే అవకాశం లేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాయువ్య భారతదేశం నుంచి వీస్తున్న వేడిగాలులతోనే పరిస్థితి ఇలా ఉంది. దీంతో నగరంలో వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. వచ్చే వారంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
- వై.కె.రెడ్డి,డెరైక్టర్,వాతావరణశాఖ, బేగంపేట్