breaking news
Direndra Kumar
-
స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో ఎస్‌డబ్ల్యూపీ మంచిదా?
స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో అధిక పెట్టుబడులు ఉన్నప్పుడు తక్కువ అస్థిరతలు ఉన్న సాధనాల్లోకి ఎలా మళ్లించాలి? లేదంటే స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో ఉన్న పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ)ను ఎంపిక చేసుకోవచ్చా? – హరిహరన్ అనంతనారాయణన్స్మాల్క్యాప్ పెట్టుబడుల్లో రిస్క్ అధికంగా ఉంటుంది. మీరు చెప్పిన విధంగా చేస్తే ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. ఉదాహరణకు 2006 నుంచి రూ.కోటి మొత్తాన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి, ఏటా 10 శాతం చొప్పున క్రమానుగతంగా ఉపసంహరించుకుంటూ (ఎస్‌డబ్ల్యూపీ) వచ్చినప్పటికీ.. ఆ పెట్టుబడి రూ.6.3 కోట్లకు వృద్ధి చెంది ఉండేది. స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో రాబడులు ఏ స్థాయిలో ఉంటాయన్నది ఇది తెలియజేస్తుంది. అయినప్పటికీ ఏటా 10 శాతం ఉపసంహరించుకోవాలని నేను సూచించను. దీనికి బదులు 2 శాతం చొప్పున ఉపసంహరించుకుంటే.. రూ.కోటి పెట్టుబడి రూ.18.7 కోట్లు అయి ఉండేది. నా సూచన ఏమిటంటే.. స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉంటే, ఏటా ఉపసంహరించుకునే రేటు 3 శాతం మించకుండా ఉండేట్టు అయితే, మీ పెట్టుబడులను అలాగే కొనసాగించుకోవచ్చు. దీనివల్ల మార్కెట్ల పతనాల్లో ఆందోళన చెందకుండా నిశ్చింతగా ఉండొచ్చు. వచ్చే 20–30 ఏళ్లలో ఈక్విటీ మార్కెట్లు 2008 తరహా అతిపెద్ద పతనాలను రెండు లేదా మూడు పర్యాయాలు చూసే అవకాశం ఉంటుంది. అలాంటి సమయాల్లో స్మాల్ క్యాప్ పెట్టుబడుల విలువ మరింత పడిపోతుంది. అందుకే మీ ఉపసంహరణను 2%కి పరిమితం చేసినట్టయితే ఈ పతనాలను మీరు తట్టుకోగలరు.మార్కెట్ల పట్ల నమ్మకం, ఈ తరహా మార్కెట్ సైకిల్స్‌ను గతంలో చూసిన అనుభవం అన్నవి మీ పెట్టుబడుల విధానాన్ని కొనసాగించుకునేందుకు ఎంతో అవసరం. అప్పుడు దీర్ఘకాలంలో విజయం సాధించగలరు. మరో ఉదాహరణ చూద్దాం. ఒకవేళ మీరు ఈక్విటీ సేవింగ్స్ ఫండ్‌లో రూ.కోటి ఇన్వెస్ట్ చేసి.. ఏటా 4 శాతాన్ని ఉపసంహరించుకుంటే (2005లో మొదలైందని భావించినప్పుడు) అప్పుడు మీ పెట్టుబడి రూ.1.73 కోట్లుగా మారేది. అదే స్మాల్‌క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి ఏటా 4% ఉప సంహరించుకున్నప్పుడు పెట్టుబడి రూ.15.6 కోట్లు అయ్యేది. అధిక రాబడి కోరుకుంటే అస్థిరతలకు అలవాటు పడాలి. అస్థిరతలను సమర్థవంతంగా ఎదుర్కొంటే మెరుగైన రాబడులు పొందొచ్చు. ఆ తరహా అధిక అస్థిరతలను భరించలేకపోతే మరింత రక్షణాత్మక పెట్టుబడి సాధనాలను పరిశీలించొచ్చు.అధిక రేటింగ్ కలిగిన అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలన్నది నా ఆలోచన. దీర్ఘకాలం కోసం ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయొచ్చా? – రమేశ్దీర్ఘకాలం కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. కాకపోతే పెద్ద మొత్తంలో పెట్టుబడిని ఒకే విడత పెట్టేయడం అనకూలం కాకపోవచ్చు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లు పడిపోతే ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతారు. ఉదాహరణకు మీరు రూ.50 లక్షలను ఈక్విటీ ఫండ్ లేదా అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. మార్కెట్లు పడితే పోర్ట్‌ఫోలియో విలువ సైతం క్షీణిస్తుంది. కాకపోతే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోల్చి చూస్తే మార్కెట్ పతనాల్లో స్థిరత్వాన్ని ప్రదర్శిస్తాయి. ఎందుకంటే అవి డెట్ సాధనాల్లోనూ కొంత ఇన్వెస్ట్ చేస్తాయి. మీరు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్న మొత్తాన్ని ఒకే విడత కాకుండా.. పలు విడతలుగా ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ల ఉద్దాన, పతనాల తాలూకూ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. కనుక పెట్టుబడిని ఒకే విడత కాకుండా, సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో కొంతకాలం పాటు ఇన్వెస్ట్ చేసుకునేలా ప్రణాళిక వేసుకోండి. -
ప్రాపర్టీ విక్రయించా.. పెట్టుబడి దారేది?
మూడేళ్లలో రూ.10 లక్షలు సమకూర్చుకోవాలన్నది నా ఆలోచన. లార్జ్‌క్యాప్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? – సాత్విక్మూడేళ్లలో రూ.10లక్షలు రావాలని కోరుకుంటుంటే.. అందుకు ఈక్విటీ పెట్టుబడులు అనుకూలం కాదు. స్వల్పకాలానికి ఈక్విటీలు ఎంతో రిస్క్‌తో ఉంటాయి. కనుక స్వల్పకాలం కోసం భద్రతతో పాటు, స్థిరమైన రాబడులను ఇచ్చే సాధనాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగంలో షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. వీటిల్లో స్థిరమైన రాబడులు ఉంటాయి. దీంతో మీ పెట్టుబడులు మార్కెట్ అస్థిరతలకు గురికావు. ఒకవేళ లక్ష్య కాలాన్ని మూడేళ్లకు మించి పెంచుకోగలిగి, రిస్క్ తీసుకునేట్టు అయితే అప్పుడు ఈక్విటీ పెట్టుబడులను పరిశీలించొచ్చు. కనీసం ఐదేళ్లు, అంతకుమించిన కాలానికే ఈక్విటీలు సూచనీయం. దీర్ఘకాలంలో మార్కెట్ అస్థిరతలను అధిగమించి పెట్టుబడులు వృద్ధి చెందుతాయి. ప్రాపర్టీ విక్రయించగా వచ్చిన లాభం నుంచి పన్ను చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలా? లేక దీర్ఘకాల మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు కోసం ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ జారీ చేసే సెక్షన్ 54ఈసీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవాలా..? – వీరేశ్ప్రాపర్టీని విక్రయించిన ఆరు నెలల్లోపు క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54ఈసీ కింద రూ.50 లక్షల వరకు లాభాన్ని మూలధన లాభాల నుంచి మినహాయింపునకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ మద్దతు గల ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ తదితర ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ కంపెనీలు జారీ చేసే బాండ్లను క్యాపిటల్ గెయిన్ బాండ్లుగా చెబుతారు. ఇవి ఐదేళ్ల లాకిన్ పీరియడ్‌తో ఉంటాయి. వీటిపై 5.25 శాతం వార్షిక వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి పన్ను పోను ఈ బాండ్లపై లభించే నికర రాబడి 3.68 శాతం అవుతుంది. ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చి చూసినప్పుడు క్యాపిటల్ గెయిన్ బాండ్లపై లభించే 5.25 శాతం రేటు చాలా తక్కువ. ఈక్విటీల్లో దీర్ఘకాలానికి రెండంకెల రాబడి వస్తుంది.ఫ్లెక్సీక్యాప్ ఫండ్ గత ఐదేళ్ల కాల సగటు రాబడి 20 శాతంగా ఉంది. ఇప్పుడు పన్ను ఆదా కోసం క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఐదేళ్ల కాలానికి రూ.50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, 5.25 శాతం రేటు ప్రకారం గడువు తీరిన తర్వాత రూ.63 లక్షలు సమకూరుతుంది. అదే రూ.50 లక్షల లాభంపై 20 శాతం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ (రూ.10లక్షలు) చెల్లించి, మిగిలిన రూ.40 లక్షలను ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లలో రూ.70 లక్షలు సమకూరొచ్చు. ఇలా చూస్తే మూలధన లాభాల పన్ను చెల్లించి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైనది అవుతుంది. కానీ, ఈక్విటీల్లో మెరుగైన రాబడి వస్తుందని చెప్పి మొత్తం తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేయడం సరికాదు. ఐదేళ్లు, అంతకుమించిన కాలాలకు ఈక్విటీల్లో మెరుగైన రాబడులు వస్తాయి. కానీ ఇది కచ్చితమని చెప్పలేం. ఆటుపోట్లు ఉంటాయి. కానీ, క్యాపిటల్ గెయిన్ బాండ్లు హామీతో కూడిన పన్ను లేని రాబడిని ఇస్తాయి. కనుక రిస్క్ లేని రాబడి కోరుకుంటూ, ఐదేళ్ల తర్వాత కచ్చితంగా పెట్టుబడి మొత్తం తిరిగి వెనక్కి తీసుకోవాలని అనుకుంటే క్యాపిటల్ గెయిన్ బాండ్లకు వెళ్లొచ్చు. కొంత రిస్క్ తీసుకుని, అవసరమైతే ఐదేళ్లకు అదనంగా మరికొంత కాలం పాటు ఇన్వెస్ట్ చేసేట్టు అయితే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ పథకాలకు కేటాయించుకోవచ్చు.ఇదీ చదవండి: ప్రభుత్వ బ్యాంకుల్లోనే.. జీతం ఎక్కువ! -
జాయింట్ ఖాతాకు నామినీ అవసరమా..?
నా వద్ద రూ.30 లక్షలు ఉన్నాయి. వీటిని మెరుగైన రాబడులు ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది యోచన. ఇందుకు ఎలాంటి సాధనాలను ఎంపిక చేసుకోవాలి? – వైశాలి సురేంద్రన్ప్రతీ ఇన్వెస్టర్ తన పెట్టుబడిపై అధిక రాబడి కోరుకోవడం సహజం. కానీ ఇన్వెస్టర్‌గా మీ లక్ష్యం గరిష్ట రాబడి ఒక్కటే కాకూడదు. రిస్క్‌ను కూడా తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ దృష్ట్యా సరైన పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. కేవలం రాబడి కోణంలోనే పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకుంటే అది నష్టానికి దారితీయవచ్చు. అందుకుని ప్రతీ పెట్టుబడి సాధనంలోనూ ఉండే సానుకూల, ప్రతికూలతలను చూడాలి. ఈక్విటీ పథకాలు స్వల్పకాలంలో అధిక రాబడులు ఇవ్వగలవు. కానీ అది కచ్చితం అని చెప్పలేం. ప్రతికూల పరిస్థితుల్లో స్వల్పకాలంలో నష్టాలనూ ఇస్తాయి. అస్థిరతలు ఎక్కువ. మార్కెట్ ఏ సమయంలో అయినా దిద్దుబాటుకు గురికావచ్చు.మనకు పెట్టుబడులు అవసరమైన అత్యవసర పరిస్థితుల్లో మార్కెట్లు కరెక్షన్కు లోనైతే అప్పుడు నష్టానికి అమ్ముకోవాల్సి వస్తుంది. అందుకుని స్వల్పకాలానికి ఈ తరహా రిస్‌్కను అధిగమించేందుకు డెట్ సాధనాల్లోనూ కొంత మేర ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈక్విటీ పెట్టుబడులు ఐదేళ్లు, అంతకుమించిన కాలానికి ఉండాలి. ఇక మీ పెట్టుబడులను వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోవడం ద్వారా వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఫండ్ బలహీన పనితీరు చూపిస్తే, మరో ఫండ్ మంచి పనితీరుతో రాబడుల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోవడం మరో మార్గం. ఇందుకు సిప్‌ను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల స్వల్ప కాలంలో పెట్టుబడులపై మార్కెట్ కరెక్షన్ల ప్రభావాన్ని అధిగమించొచ్చు. ఈక్విటీ, డెట్ సాధనాల మధ్య పెట్టుబడుల వ్యూహమైన అస్సెట్ అలోకేషన్‌ను పాటించాలి. డెట్, ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడంతోనే పని ముగిసినట్టు కాదు. తప్పకుండా ఏడాదికోసారి వాటి పనితీరు ఎలా ఉందన్నది తప్పకుండా సమీక్షించుకోవాలి. మీ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా డెట్, ఈక్విటీ కేటాయింపుల్లో మార్పులు చేసుకోవాలి. ఎనీవన్ లేదా సర్వైవర్ అనే ఆప్షన్‌తో ఉన్న జాయింట్ బ్యాంక్ ఖాతాకు నామినీ నమోదు అవసరమా? – జోషి భవేరాబ్యాంక్ ఖాతా అయినా, పెట్టుబడి అయినా నామినీ నమోదు చేయడం ఎంతో అవసరం. ఎనీవన్ లేదా సర్వైవర్ బ్యాంక్ ఖాతాని ఇద్దరు కంటే ఎక్కువ మంది నిర్వహించొచ్చు. బ్యాంకింగ్ లావాదేవీలపై ఎవరో ఒకరు సంతకం చేస్తే సరిపోతుంది. ఎవరైనా ఒక ఖాతాదారు దురదృష్టవశాత్తూ మరణిస్తే, అప్పుడు ఆ ఖాతాలోని బ్యాలన్స్, వడ్డీని జీవించి ఉన్న ఖాతాదారుకు చెల్లిస్తారు. ఆ తర్వాత అదే ఖాతాను కొనసాగించుకోవచ్చు. ఒకవేళ ఏ ఖాతాదారుడూ జీవించి లేకపోతే, ఆ ఖాతాకు నామినీ నమోదు చేసి లేకపోతే.. అప్పుడు ఖాతాదారుడి వారసులు అన్ని రకాల పత్రాలు సమర్పించిన అనంతరం అందులోని బ్యాలన్స్‌ను క్లెయిమ్ చేసుకోగలరు. నామినీని నమోదు చేయడం వల్ల అనుకోని పరిస్థితుల్లో అవి సాఫీగా బదిలీ అయ్యేందుకు వీలుంటుంది. అందుకని ఎనీవన్ లేదా సర్వైవర్ ఖాతాకు సైతం నామినీ నమోదు చేసుకోవడం అనవసర సమస్యలను తప్పిస్తుంది. -
పిల్లల విద్య కోసం పెట్టుబడి మార్గం?
నేను రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. వీటిపై మెరుగైన రాబడులకు ఉన్న మార్గం ఏంటి? – సుదీప్త్ సేన్ఏ ఇన్వెస్టర్ అయినా గరిష్ట రాబడి కోరుకోవడం సహజమే. కానీ, అధిక రాబడి ఒక్కటే ప్రామాణికం కాకూడదు. పెట్టుబడులపై మెరుగైన రాబడులను పొందేందుకు కొన్ని అంశాల పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా సరైన పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. కేవలం రాబడి కోణంలోనే పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకుంటే అది నష్టానికి దారితీయవచ్చు. అందుకుని ప్రతీ పెట్టుబడి సాధనం ఎంపిక ముందు అందులోని సానుకూల, ప్రతికూలతలను చూడాలి. ఈక్విటీ పథకాలు స్వల్పకాలంలో అధిక రాబడులు ఇవ్వగలవు. కానీ, దీనికి గ్యారంటీ ఉండదు. మార్కెట్ ఏ సమయంలో అయినా దిద్దుబాటుకు గురికావచ్చు. అస్థిరతలు ఎక్కువగా ఉంటుంటాయి. అత్యవసర పరిస్థితుల్లో మార్కెట్లు కరెక్షన్కు లోనై ఉంటే అప్పుడు నష్టానికి అమ్ముకోవాల్సి వస్తుంది. అందుకుని స్వల్పకాలానికి ఈ తరహా రిస్క్‌ను అధిగమించేందుకు డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.ఐదేళ్లు అంతకుమించిన కాలానికి ఈక్విటీలను ఎంపిక చేసుకోవాలి. అలాగే పెట్టుబడులను వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోవడం ద్వారా వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఒక ఫండ్ బలహీన పనితీరు చూపించినా.. మరో ఫండ్ మంచి పనితీరుతో రాబడుల్లో స్థిరత్వం ఉంటుంది. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోవడం మరో మార్గం. ఇందుకు సిప్‌ను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల స్వల్ప కాలంలో పెట్టుబడులపై మార్కెట్ కరెక్షన్ల ప్రభావాన్ని అధిగమించొచ్చు. చివరిగా అస్సెట్ అలోకేషన్‌ను పాటించాలి. డెట్, ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడంతోపాటు, ఆ పెట్టుబడులను ఏడాదికోసారి సమీక్షించుకోవాలి. మీ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా డెట్, ఈక్విటీ పెట్టుబడుల్లో, కేటాయింపుల్లో మార్పులు చేసుకోవాలి. నాకు పదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి ఉన్నత విద్య కోసం ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టాలన్నది ఆలోచన. ఇందుకు ఏ సాధనాలను ఎంచుకోవాలి? – విద్యారణ్యపిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే విషయంలో చాలా మంది తల్లిదండ్రులు సందేహం ఎదుర్కొంటుంటారు. ఒకే విడత పెట్టుబడితోపాటు క్రమానుగత పెట్టుబడి (సిప్)ని సైతం ఎంపిక చేసుకోవచ్చు. ఉన్నత విద్య కోసం అనుకుంటే అందుకు, సాధారణంగా పదేళ్ల కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలు మెరుగైన సాధనమే అని చెప్పాలి. ఫ్లెక్సీక్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండేలా చూస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన (డైవర్సిఫైడ్) కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది.ఇదీ చదవండి: కరెంట్ బిల్లు పరిధి దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే!ఈక్విటీల్లో అస్థిరతలు సహజంగా ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోనూ ఈ ప్రభావం కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి, మార్కెట్లు గరిష్టాల వద్ద ఉన్నప్పుడు రిస్క్‌ను తగ్గిస్తుంది. మీ దగ్గర ఉన్న మొత్తాన్ని ఒక డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి.. దాని నుంచి ప్రతి నెలా సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎన్టీపీ) రూపంలో ఎంపిక చేసుకున్న ఈక్విటీ పథకాల్లోకి మళ్లించుకోవాలి. మూడేళ్ల కాలంలో దీన్ని పూర్తి చేయాలి. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. -
ఒకటికి మించిన ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా?
సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) అంటే ఏంటి? ఏక మొత్తంలో ఓ పథకంలో పెట్టుబడి పెట్టి, తదుపరి నెల నుంచి ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఆదాయం పొందొచ్చా? అలా అయితే అది నా పెట్టుబడిపై ప్రభావం చూపిస్తుందా? – రాఘవరాజుపెట్టుబడులను పెట్టడమే కాదు.. వాటిని వెనక్కి తీసుకునే విషయంలోనూ తగిన ప్రణాళిక కలిగి ఉండాలి. మార్కెట్లలో అస్థిరతలను అధిగమించేందుకు క్రమానుగత పెట్టుబడులకు సిప్ ఎలా ఉపయోగపడుతుందో..? అదే మాదిరి.. పెట్టుబడిని నిర్ణీత కాలానికి ఓసారి వెనక్కి తీసుకునేందుకు ఎస్‌డబ్ల్యూపీ వీలు కల్పిస్తుంది. మార్కెట్లు కనిష్టాల్లో (తక్కువ విలువల వద్ద) ఉన్నప్పుడు పెట్టుబడి మొత్తాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఎస్‌డబ్ల్యూపీ సాయపడుతుంది. రిటైర్మెంట్ తీసుకున్న వారికి, అదనపు ఆదాయం కోరుకునే వారికి అనుకూలం. దీని ద్వారా వారు తమకు కావాల్సినంత స్థిరమైన ఆదాయం పొందే ఏర్పాటు చేసుకోవచ్చు. ఎన్ని రోజులకు ఒకసారి ఆదాయం రావాలన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుంది.ఇన్వెస్టర్ ప్రతీ నెలా నిర్ణీత తేదీన, నిర్ణీత మొత్తాన్ని ఎస్‌డబ్ల్యూపీ ద్వారా రావాలని నిర్ణయించుకుంటే.. అదే రోజు ఆ మొత్తం బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. ఆ మేరకు పెట్టుబడుల విలువ తగ్గుతుంటుంది. సిప్ ఎంపిక చేసుకుంటే.. ప్రతీ నెలా నిర్ణీత మొత్తం బ్యాంకు ఖాతా నుంచి మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడిగా వెళుతుంది. దీనికి పూర్తి వ్యతిరేకంగా పనిచేసేదే ఎస్‌డబ్ల్యూపీ. మీ మొత్తం పెట్టుబడుల్లో కనీసం మూడింట ఒక వంతును ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒక ఏడాదిలో ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఉపసంహరించుకునే మొత్తం పెట్టుబడుల విలువలో 4–6 శాతం మించకుండా జాగ్రత్తపడాలి. దీనివల్ల పెట్టుబడికి నష్టం లేకుండా ఉంటుంది.ఇదీ చదవండి: ‘దేశానికి రక్షణ కల్పించండి.. మీ సమస్యలతో మేం పోరాడుతాం’ఉదాహరణకు మీ పెట్టుబడులపై రాబడి వార్షికంగా 8–9 శాతంగా ఉండి, 5 శాతాన్ని వెనక్కి తీసుకునేట్టు అయితే.. అప్పుడు మిగిలిన 3–4 శాతం రాబడి పెట్టుబడిని వృద్ధి చేస్తుంటుంది. దీనివల్ల ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెట్టుబడి విలువ క్షీణించకుండా స్థిరంగా ఉంటుంది. ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఏటా ఉపసంహరించుకునే మొత్తంపై పన్ను పడదు. నికర లాభంపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఏడాదిలో రూ.1.25 లక్షల దీర్ఘకాల మూలధన లాభంపై పన్ను లేదు. అంతకు మించిన మొత్తంపైనే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను పడుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఏడాదిలోపు ఈక్విటీ పెట్టుబడులపై 15 శాతం స్వల్పకాల మూలధన లాభం చెల్లించాలి. డెట్ పెట్టుబడులపై లాభం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఒకటికి మించిన ఫండ్ విభాగాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయమేనా? – చిట్టి లాస్యఒకటికి మించిన మ్యూచువల్ ఫండ్స్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టుకున్నప్పటికీ.. నిర్ణీత కాలానికి ఒకసారి పోర్ట్‌ఫోలియోని రీబ్యాలన్స్ (సమీక్ష/మార్పులు, చేర్పులు) చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రత్యామ్నాయంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోడాన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే ఈ పథకాలు అన్నిరకాల మార్కెట్ విభాగాల్లోని కంపెనీల్లో (స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్) ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మార్కెట్ పరిస్థితులు, వ్యాల్యూయేషన్ల ఆధారంగా ఆయా విభాగాలకు కేటాయించే పెట్టు బడుల మొత్తం మారిపోతుంటుంది.సాధారణంగా ఫ్లెక్సీక్యాప్ పథకాలు తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో 70–75 శాతాన్ని లార్జ్‌క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మిగిలిన పెట్టుడులను మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాలకు కేటాయిస్తుంటాయి. మీరు రెండు నుంచి మూడు ఫ్లెక్సీ క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఎక్కువ మొత్తాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి మీరు విడిగా లార్జ్‌క్యాప్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు. పెట్టుబడులపై అధిక రాబడులు కోరుకుంటూ, రిస్క్ తీసుకునే సామర్థ్యం కలిగిన వారు.. ఫ్లెక్సీక్యాప్నకు అదనంగా 10–15 శాతం పెట్టుబడులను మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు కేటాయించుకోవచ్చు. -
రిటైర్మెంట్ కోసం స్మాల్‌క్యాప్ బెటరా?
మనీ మార్కెట్ ఫండ్ ఎవరికి అనుకూలం? – స్వర్ణముఖిమనీ మార్కెట్ ఫండ్ అన్నది డెట్ మ్యూచువల్ ఫండ్ పథకం. ఏడాది కాలంలో గడువు ముగిసే స్వల్ప కాల డెట్ ఇన్స్ట్రుమెంట్లు, ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. రిస్క్‌లేని ఊహించదగిన రాబడులను ఇవి ఇవ్వగలవు. ఇవి అధిక నాణ్యత కలిగిన సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ దాదాపు రిస్క్‌లేని, అధిక రక్షణతో కూడినవి. స్వల్పకాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే కాస్త అధిక రాబడులను ఇస్తాయి. ఎందుకంటే ఇవి వైవిధ్యమైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఏడాది కాలానికి ఇన్వెస్ట్ చేసుకునే వారు వీటిని పరిశీలించొచ్చు. బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్లపై రాబడి కంటే అధిక రాబడిని ఇవ్వగలవు. బ్యాంక్ ఖాతాల్లో ఎక్కువ బ్యాలన్స్ ఉంచుకునే వారు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.మొత్తం 16 రకాల డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉండగా, లిక్విడ్ ఫండ్స్, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అన్నవి రిటైల్ ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉంటాయి. మీ పెట్టుబడుల కాల వ్యవధి ఏడాది అయితే లిక్విడ్ ఫండ్స్ మంచివి. ఇవి తక్కువ రిస్క్ పథకాలు. అత్యవసర నిధికి వీటిని ఉపయోగించుకోవచ్చు. ఏడాదికి మించిన కాలానికి ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే షార్ట్ డ్యురేషన్ ఫండ్‌ను ఎంపిక చేసుకోండి. ఏడాది నుంచి మూడేళ్ల కాల సాధనాల్లో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడంలో ఉన్న ప్రాథమిక లక్ష్యం పెట్టుబడి పరిరక్షణతోపాటు, కొంత రాబడి కోరుకోవడం. ఈ దృష్ట్యా లిక్విడ్ ఫండ్స్, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి.రిటైర్మెంట్ నిధి కోసం స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? – అనిరుధ్ భట్టాచార్యదీర్ఘకాలంలో సంపద సృష్టికి స్మాల్‌క్యాప్ పథకాలను పరిశీలించొచ్చు. స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులకు దీర్ఘకాలం ఒక్కటే ప్రామాణికం కాదు. నష్ట భయాన్ని, యూనిట్ల విలువ క్షీణించినా తట్టుకునే గుండె నిబ్బరం కావాలి. ఇవి నిర్ణీత సమయాల్లో (సైకిల్స్) భారీ నష్టాలకు గురవుతుంటాయి. మార్కెట్లో ఇతర విభాగాలు మంచి పనితీరు చూపిస్తూ, స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులు నష్టాలను చూపిస్తుంటే ఆందోళన చెందడం సహజం. అందుకనే మీ మొత్తం పెట్టుబడుల్లో 10–15% మించి స్మాల్‌క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోకుండా ఉండడం సూచనీయం. చిన్న కంపెనీని ఎంపిక చేసుకుంటే, అది ఆ తర్వాతి కాలంలో పెద్ద కంపెనీగా మారితే, మంచి సంపద సృష్టి జరుగుతుంది. కానీ, అలా ఎంపిక చేసుకున్న ప్రతి కంపెనీ బడా కంపెనీ అవ్వాలనేమీ లేదు. సంపదను తుడిచిపెట్టేవీ ఉంటాయి. ఆటుపోట్లను తట్టుకునే బలం చిన్న కంపెనీలకు తక్కువ. లార్జ్‌క్యాప్ కంపెనీలతో పోలిస్తే మంచి వృద్ధిని చూపించగలవు.ఇదీ చదవండి: దీర్ఘకాలానికి మంచి ట్రాక్ రికార్డుమరీ చిన్న కంపెనీలు అయితే ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు సైతం దూరంగా ఉంటారు. స్మాల్‌క్యాప్ విభాగం పెద్దది. స్మాల్‌క్యాప్ విభాగంలో వివిధ పథకాల మధ్య ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. కనుక సిప్ ద్వారా స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా స్మాల్‌క్యాప్ కంపెనీలకు సంబంధించి తగినంత లిక్విడిటీ ఉండదు. చిన్న కంపెనీలు కావడంతో ఫ్రీ ఫ్లోటింగ్ ఈక్విటీ తక్కువ. దీంతో మార్కెట్ల కరెక్షన్లలో కొద్ది విక్రయాలకే ఎక్కువ నష్టపోతుంటాయి. మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీలతో పోలిస్తే స్మాల్‌క్యాప్ కంపెనీలు రిస్క్ ఎక్కువతో ఉంటాయి. చిన్న కంపెనీల్లో ఏ ధరలో ప్రవేశించారు, ఎక్కడ విక్రయించారన్నది రాబడులకు కీలకం అవుతుంది. -
రేటింగ్ క్షీణిస్తున్నా, పెట్టుబడులు కొనసాగించాలా?
నా వయస్సు 33 సంవత్సరాలు. ఆన్లైన్ టెర్మ్ కవర్ తీసుకోవాలనుకుంటున్నాను. ఐ-లైఫ్ ప్లాన్‌లో విదేశాల్లో మరిణిస్తే పాలసీదారునికి డెత్ కవర్ వర్తించదని అవైవా ఏజంట్ చెప్పారు. నేను తరచుగా ప్రయాణాలు చేస్తున్నట్లైతే, ఆఫ్‌లైన్ ప్లాన్ తీసుకోవడం ఉత్తమమా? చాలా ఆన్లైన్ ప్లాన్లకు మెడికల్ చెకప్ అడగడం లేదు. ఎలాంటి చెకప్ లేకుండా బీమా పాలసీ తీసుకుంటే పాలసీ క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఏమైనా సమస్యలైనా వస్తాయా? - ఆనంద్, బెంగళూరు అవైవా ఐ-లైఫ్, హెచ్డీఎఫ్సీ క్లిక్2ప్రొటెక్ట్ తదితర చాలా ఆన్లైన్ టెర్మ్ పాలసీలు విదేశాల్లో మరణానికి కూడా కవర్ చేస్తాయి. కాకుంటే మీరు పాలసీ తీసుకున్న బీమా సంస్థకు మీ టూర్ ప్రణాళికలు, ఎంత తరుచుగా మీరు విదేశీయానం చేస్తుంటారు తదితర పూర్తి వివరాలను రాత పూర్వకంగా వెల్లడించాల్సి ఉంటుంది. యువ జనుల మెడికల్ చెకప్ గురించి చాలా బీమా సంస్థలు అడగడం లేదు. అయితే పాలసీ తీసుకునేటప్పుడు పాలసీ తీసుకునే వ్యక్తి తన ఆరోగ్య స్థితిగతుల గురించి వీలైనంత సమాచారం సదరు బీమా సంస్థకు తెలియజేయడం ఉత్తమం. దీంతో ఎలాంటి పొరపొచ్చాలకు తావుండదు. మీరు లేనప్పుడు మీ అప్పులను తీర్చి, మీ కుటుంబానికి ఆర్థికంగా బాసటనిచ్చేలా సరైన మొత్తానికి బీమా పాలసీ తీసుకోవడం మంచిది. నేను గత కొన్నేళ్లుగా ఒక ఫైవ్ స్టార్ రేటెడ్ ఫండ్‌లో సిప్ విధానంలో మదుపు చేస్తున్నాను. అయితే ఈ ఫండ్ పనితీరు నానాటికీ దిగజారుతోంది. పెట్టుబడులను ఉపసంహరించమంటారా? లేక కనీసం 2-3 ఏళ్ల వరకూ పెట్టుబడులు కొనసాగించి, ఆ తర్వాత ఫండ్ పని తీరును బట్టి నిర్ణయం తీసుకోమంటారా? ముం దుగానే విత్ డ్రా చేసుకుంటే షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందా? వివరించగలరు. - ప్రసన్న, విశాఖ పట్టణం మీరు మదుపు చేసిన ఫండ్ పనితీరు తగ్గిపోవడం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తోంది. అయితే సిప్ విధానంపై నమ్మకం పోగొట్టుకోకండి. ఒక ఫైవ్‌స్టార్ రేటింగ్ ఉన్న ఫండ్ పనితీరు దిగజారి దాని రేటింగ్ ఫోర్ స్టార్కో, త్రీ స్టార్కో పడిపోయినప్పటికీ, ఆ ఫండ్‌లోనే ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగిం చడం మంచిది. ఇలాంటి పరిస్థితుల్లోనే మీ పెట్టుబడులను జాగ్రత్తగా మదింపు చేయాలి. మీ ఫండ్ పనితీరు మరింత దిగజారి రేటింగ్ టూ స్టార్ లేదా వన్ స్టార్కో వచ్చినప్పుడు మాత్రమే పెట్టుబడులు ఆపండి. పనితీరు సరిగ్గా లేని ఫండ్‌లో మీ పెట్టుబడులు కొనసాగించడం వల్ల మీ నష్టాలు మరింతగా పెరుగుతాయి. అదే సమయంలో మంచి పనితీరు కనబరిచే ఫండ్ అందించే లాభాలను మీరు మిస్ అవుతారు. ఇక ఈక్విటీ ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాదిలోపే ఉపసంహరించుకుంటే, మీరు షార్ట్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మా నాన్నగారు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్ గ్రోత్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేశారు. ఆయన ఈ నెలలో రిటైరవుతున్నారు. ఈ ఫండ్ గ్రోత్ ఆప్షన్ నుంచి డివిడెండ్ పే అవుట్ ఆప్షన్‌కు మారాలనుకుంటున్నారు. ఏం చేయాలి? - యాదగిరి, నిజామాబాద్ ఒక ప్లాన్ నుంచి మరొక ప్లాన్‌కు మారడం అంటే ప్రస్తుతమున్న ప్లాన్ నుంచి యూనిట్లను విక్రయించి, కొత్త ప్లాన్ యూనిట్లను కొనుగోలు చేయడం కిందే వస్తుంది. గ్రోత్, డివిడెండ్ ప్లాన్ల ఎన్ఏవీ రెండూ వేర్వురుగా ఉంటాయి. డివిడెండ్ ప్లాన్‌లో ఎప్పటికప్పుడు డివిడెండ్లు చెల్లిస్తారు. అదే గ్రోత్ ప్లాన్‌లో డివిడెండ్లను రీ ఇన్వెస్ట్ చేస్తారు. అందుకనే గ్రోత్ ప్లాన్స్ ఎన్ఏవీ, డివిడెండ్ ప్లాన్ ఎన్ఏవీ కంటే అధికంగా ఉంటుంది. ఇక ప్లాన్ మార్పు గురించి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఓరియంటెడ్ స్కీమ్స్ అన్నీ క్లోజ్డ్ ఎండ్ స్కీమ్స్. వీటిని మీరు రిడీమ్ చేసుకోలేరు. అందుకనే ఈ స్కీమ్స్ మెచ్యూరిటీ కంటే ముందుగానే వీటి నుంచి మారడం మినహా మరో మార్గం లేదు. క్లోజ్డ్ ఎండ్ స్కీమ్స్‌కు సంబంధించి డివిడెండ్ ఆప్షన్ ప్లాన్‌లో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి కూడా లేదు. క్లోజ్డ్ ఎండ్ స్కీమ్‌ల్లో న్యూ ఫండ్ ఆఫర్(ఎన్ఎఫ్ఓ) సమయంలోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.