వికలాంగులను సాటి మనుషులుగా చూడలేని వారిది చిత్త వైకల్యం!
‘వైకల్యం’ లేని మనుషులు అరుదు. కొందరికి అంగవైకల్యం, మరికొందరికి చిత్తవైకల్యం. ఎలాంటి వైకల్యమూ లేకపోవడం పరిపూర్ణత అవుతుంది. కాని అదెక్కడ కనిపిస్తుంది? చిత్తవైకల్యం మతిభ్రమణమూ కానక్కర లేదు, మందబుద్దీ కానక్కర లేదు. ఆస్థిర చిత్తాలు మనోవికారాలు ఆలోచనల వైపరీత్యాలు కూడా వైకాల్యాలే. కనుక ఒకరిని చూసి మరొకరు సానుభూతి చూపించ వలసిందేమి లేదు.వైకల్యాలు ప్రకృతి సహజంగా భావించి, పరస్పరం ప్రేమించుకొనడానికి, గౌరవించుకొనడానికి అవి అవరోధం కాకుండా చూసుకోవడమే మనం చేయవలసిందీ,చేయగలిగిందీ!‘ అంటూ ‘ మనోనేత్రం ’ పేరుతో వికలాంగుల సమస్యలను వస్తువుగా తీసుకొని, ప్రపంచ వికలాంగుల దినోత్సవ సందర్బంగా ( 19 మార్చ్ 1989 ) నేను రచించిన కవితా సంపుటికి తమ అమూల్యమైన అభినందన సందేశం అందిస్తూ ఆనాటి ప్రముఖ దినపత్రిక ఆంధ్రప్రభ సంపాదకులు పొత్తూరి వేంకటేశ్వర రావు గారు వెలిబుచ్చిన అభిప్రాయం ఇది.సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బహుకాలంగా పనిచేస్తున్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిణి సివిల్స్లో దివ్యాంగుల కోటాను విమర్శిస్తూ ‘వికలాంగులు ఐ ఏ ఎస్, ఐపీఎస్ వంటి ఉద్యోగాలకు సరిపోరని ’ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సరియైన సమాధానం పెద్దలు పొత్తూరి వారి మాటల్లో స్పష్టంగా ఉందని నేను భావిస్తున్నాను.పై అధికారిణి ప్రభుత్వంలో ఉంటూనే చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ స్వయంగా అంగవైకల్యంతో బాధపడుతున్న, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయే ఎంతో మంది అభ్యర్థులకు శిక్షణనిచ్చే ఒక ఐ ఏ ఎస్ అకాడమీని విజయవంతంగా నడుపుతున్న మల్లవరపు బాలలత గారు ‘ సివిల్ సర్వంట్ గా తాను పన్నెండేళ్లు పనిచేసానని, ఇలాంటి అధికారులు ఉండబట్టే రాజీనామా చేయాల్సి వచ్చిందని తన బాధను వ్యక్తపరిచారు. అంతేకాదు పై అధికారిణికి ఏదైనా జరగరానిది జరిగి దివ్యంగురాలు అయితే ఆమె తన పదవికి రాజీనామా చేస్తారా?’ అంటూ వారు వేసిన ప్రశ్న సమంజసమైంది, అందరూ ఆలోచించవలసింది.అంధులంటే ఎవరో కాదు కళ్లుండీ వాస్తవాన్ని చూడలేని గర్వాంధులు, ధనాందులు , మాదాంధులు ‘ అన్నాను ’ మనోనేత్రం‘ లో నేను 1992 లో కూడా ‘ వికలాంగులలో ‘విజేతలు’ పేరుతో నేను చేసిన మరో రచనలో తమ అంగవైకల్యాన్ని అధిగమించి ఎన్నో రంగాల్లో రాణించిన భక్తకవి సూరదాస్ మొదలుకొని ద్వారం వెంకటస్వామి నాయుడు( వయలిన్ ) ఎస్ జైపాల్ రెడ్డి ( రాజకీయాలు ), సుధాచంద్రన్ ( నాట్యం ), లూయీబ్రెయిల్ ( బ్రెయిల్ లిపి ), మేధావుల్లో మేటి అంటోనియో గ్రాన్సీ , విశ్వకవి భైరన్ వంటి ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ ప్రముఖుల పరిచయాలతో పాటు , నాకు గురుతుల్యులు ప్రముఖ హాస్య రచయిత ఎన్వీ గోపాల శాస్త్రి, వికలాంగుల జంట మా అమ్మానాన్నలు ఆండాళమ్మ వేముల రాజంల గురించి కూడా ఇందులో రాశాను.‘లోక కళ్యాణం కోసం కొందరు అడవులకు వెళ్లి ఋషులు మునులైతే సభ్యసమాజంలో ఉంటూ సాటివారిని బాగుచేయడానికి మరికొందరు వికలాంగులు అయ్యారు ’ అన్న నా మాటలను పేర్కొంటూ‘ వికలాంగులను సాటి మనుషులుగా చూడలేని చిత్తవైకల్యం ఎవరిలోనైనా ఉంటే ’మనోనేత్రం‘ దానిని పోగొట్టగల సాహిత్య ఔషధం’ అంటూ నా రచనకు మంచి కితాబునిచ్చి నన్ను ప్రోత్సహించిన పెద్దలు కీశే పొత్తూరి వెంకటేశ్వర రావు ( 1934 - 2020 ) గారికి శతకోటి వందనాలు !-వేముల ప్రభాకర్