♦ జిల్లా విద్యాశాఖకు డెరైక్టరేట్ ఆదేశాలు
♦ త్వరలో సస్పెన్షన్ ఉత్తర్వులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘నకిలీ’గురువులపై త్వరలో వేటు పడనుంది. వైకల్యం లేనప్పటికీ.. వికలాంగుల కోటాలో ఉద్యోగాలు పొందిన తీరుపై విచారణ చేపట్టిన జిల్లా యంత్రాంగం ఇటీవల రాష్ట్ర విద్యాశాఖకు నివేదించింది. దీంతో స్పందించిన విద్యాశాఖ వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం విద్యాశాఖ కమిషనరేట్ నుంచి జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు వచ్చాయి. సస్పెన్షన్ కేటగిరీలో 28మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో 11మంది వినికిడి లోపం ఉన్నట్లు సర్టిఫికెట్లు సమర్పించగా.. ఏడుగురు అంధత్వం ఉన్నట్లు, 10 మంది కీళ్ల(ఆర్థో) కు సంబంధించి వైకల్యం ఉన్నట్లు ధ్రువపత్రాలు సమర్పించారు. అయి తే వీరంతా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు అధికారులు తేల్చారు.