నకిలీ టీచర్లపై వేటు పడదేం..?
► తప్పుడు కుల, వికలాంగ ధ్రువీకరణతో 51 మందికి టీచర్ ఉద్యోగాలు
► 18 మందిని తొలగించాలని కమిషనర్ ఆదేశం
► ఇప్పటివరకు డిస్మిస్ చేసింది కేవలం ఆరుగురినే...
సాక్షి, హైదరాబాద్: వైకల్యం లేదు కానీ దివ్యాంగుల కోటాలో ఉద్యోగం దక్కించుకున్నాడో ప్రబుద్ధుడు.. అగ్రకులానికి చెందిన మరోవ్యక్తి వెనకబడిన కులాల కోటా కింద చాన్స్ కొట్టేశాడు.. ఇలాంటి ఘనకార్యాలు చేసింది ఒకరిద్దరే కాదు. ఏకంగా 51 మంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి టీచర్ కొలువులో కొనసాగుతున్నారు. విద్యాశాఖకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చ ల్, మహబూబ్నగర్ జిల్లాల్లో ఏకంగా 51 మంది ఇలా తప్పుడు ధ్రువీకరణ ప్రతాలు సమర్పించి ఉపాధ్యాయ ఉద్యోగాలు దక్కిం చుకున్నారు.
ఈ అంశంపై విద్యాశాఖ ప్రత్యేకంగా అధికారులను నియమించి విచారణ చేసి, నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొంది న వారిపై వేటు వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ పూర్తయి ఆర్నెల్లు గడిచినా క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు వేటు వేసేందుకు సాహసించకపోవడం గమనార్హం. నకిలీ టీచర్లపై విచారణ ప్రక్రియంతా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అప్పటి డీఈవో ఆధ్వర్యంలో జరిగింది.
ఈక్రమంలో డీఈవో నివేదికను పరిశీలించిన విద్యాశాఖ 18 మందిని విధుల నుంచి పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. అయితే జిల్లా ల విభజన నేపథ్యంలో తొలగింపు ప్రక్రియ నాలుగైదు జిల్లాలకు వ్యాపించింది. విద్యాశాఖ కమిషనర్ నిర్దేశించిన ప్రకారం 18 మందిపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా... ఇప్పటివరకు కేవలం ఆరుగురిని మాత్రమే విధుల నుంచి డిస్మిస్ చేశారు. మరో 12 మందిపై చర్యలు తీసుకోకుండా ఆయా జిల్లా విద్యాశాఖ అధికారులు వాయిదాలు వేయడంపై విమర్శలు వస్తున్నాయి.
డీఈవో నివేదికలో ముఖ్యాంశాలు..
► 28 మంది ఉపాధ్యాయులు పీహెచ్ (ఫిజికల్ హేండీకాప్డ్) కేటగిరీలో ఉద్యోగాలు పొందారు. వీరిలో 11 మంది వినికిడి, ఏడుగురు అంధత్వ, 10 మంది ఆర్థో కేటగిరీలో సర్టిఫికెట్లు సమర్పించారు. వీటిని మెడికల్ బోర్డు, ప్రభుత్వ ఈఎన్టీ, సరోజినీదేవి ఆస్పత్రితో పాటు గాంధీ ఆస్పత్రుల రికార్డులతో సరిపోల్చడంతో పాటు వారికి వైద్యపరీక్షలు నిర్వహించగా వ్యత్యాసం ఉన్నట్లు తేలింది.
► ముగ్గురు ఉపాధ్యాయులు నకిలీ కుల సర్టిఫికెట్లు సమర్పించగా వాటిని క్షేత్రస్థాయిలో ప్రత్యేకాధికారితో పరిశీలన చేయిస్తే అందులోనూ లోపాలున్నట్లు బయటపడింది.
► 16 మంది ఉపాధ్యాయులు నకిలీ బోనఫైడ్లు సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపైనా విచారణ చేపట్టినట్లు నివేదికలో పేర్కొన్నారు.
► మరో నలుగురు ఉపాధ్యాయులకు సంబంధించి సరైన సమాచారం లభించలేదని నివేదికలో వివరించారు.