మీసేవ సిబ్బంది మాయాజాలం
వీఆర్వో, ఆర్ఐ సంతకాలతో దరఖాస్తులు
శోధన్‌నగర్ మీ సేవ కేంద్రంగా దందా
సహకరిస్తున్న తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది
గుట్టురట్టు చేసిన అధికారులు
నెల్లూరు (రూరల్/ పొగతోట): రెవెన్యూ అధికారులతో సంబంధం లేకుండా మీసేవ సిబ్బంది అక్రమంగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరు చేయిస్తున్నారు. నెల్లూరులోని శోధన్‌నగర్ మీసేవ(ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని) అడ్డాగా రెండు నెలలుగా ఈ అక్రమాల పర్వం గుట్టుగా సాగుతోంది. అయితే మరీ శ్రుతి మించి నెల్లూరు ఆర్ఐ సంతకాలతో సిద్ధం చేసిన దరఖాస్తులను వెంకటాచలం మండలం వాసులకు విక్రయించడం, అక్కడి అధికారులు అప్రమత్తం కావడంతో గుట్టు రట్టయింది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాజర్ మీసేవలో దాడులు నిర్వహించి సిబ్బందిలో ఒకరితో పాటు వాచ్‌మన్‌ను అదుపులోకి తీసుకుని తన సంతకంతో ఉన్న దరఖాస్తులను స్వాధీనం చేసుకున్నారు.
జరగాల్సిందిలా..
కుల, ఆదాయ పత్రాల కోసం మీసేవలో దరఖాస్తు చేసుకుని నిర్ణీత వ్యవధి వరకు ఆగాలి. దరఖాస్తుతో పాటు వీఆర్వో, ఆర్ఐ ధ్రువీకరించిన సర్టిఫికెట్ సమర్పించాలి. ఆ తర్వాత దరఖాస్తు మీసేవ ద్వారా తహసీల్దార్ కార్యాలయానికి చేరుతుంది. అక్కడ అధికారులు అన్నీ పరిశీలించాక డిజిటల్ సైన్‌తో సర్టిఫికెట్‌ను అప్రూవల్ చేయాలి.
జరుగుతోందిలా..
నిబంధనల మేరకు ప్రక్రియ సాగాలంటే కొంత వ్యవధి పడుతుండటంతో మీసేవ సిబ్బందిలో కొందరు అక్రమాలకు తెరదీశారు. అందరి సంతకాలు తామే చేయించి రెండు రోజుల్లో అందిస్తామని దరఖాస్తుదారులకు వల వేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ అపరేటర్ల సహకారం కూడా ఉండటంతో వీరి దందాకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.200 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్ఐ సంతకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. సంతకం మినహా పేర్లు, అడ్రసుపై వైట్నర్తో కనిపించకుండా చేసి జెరాక్స్ తీయించారు. కులధ్రువీకరణ పత్రాల కోసం వచ్చిన వారి నుంచి నగదు తీసుకుని ఆర్ఐ సంతకం చేసిన ఖాళీ దరఖాస్తును నింపి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. ఆర్ఐ సంతకం ఉండడంతో రెవెన్యూ అధికారులు విచారించకుండా కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ల సహకారం ఉండటంతో గంటల వ్యవధిలోనే సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి.
బయటపడిందిలా..
వెంకటాచలం మండలం, అనికేపల్లికి చెందిన కొందరు గిరిజనులు కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం శుక్రవారం నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న మీసేవ కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఉన్న వాచ్‌మన్ దరఖాస్తు ఫారాలను ఇచ్చారు. వాటిని తీసుకుని అనికేపల్లి వీఆర్వో శ్రీహరి వద్దకు వెళ్లారు. దరఖాస్తులపై నెల్లూరు ఆర్ఐ సంతకం గమనించిన వీఆర్వో వెంటనే ఆయనకు సమాచారం అందించాడు. దీంతో ఆర్ఐ షేక్ నాజర్ మీ సేవ సెంటర్‌కు వెళ్లి పరిశీలించగా వాచ్‌మన్ నున్నా శివకుమార్ వద్ద తన సంతకం ఉన్న జెరాక్స్ పత్రాలను స్వాధీనం చేసుకుని విచారించాడు. తనకేమీ తెలియదని, కంప్యూటర్ ఆపరేటర్ భువనేశ్వరి జెరాక్స్ తీసుకు రమ్మంటే, తీసుకొచ్చానని తెలిపాడు. దీంతో భువనేశ్వరి, శివకుమార్లను తహశీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు. ఒకరికి ఒకరు పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. డిప్యూటీ తహసీల్దార్ విజయకుమార్, ఆర్ఐ నాజర్‌లు వారి చెప్పిన సమాచారాన్ని నమోదు చేసుకుని తహశీల్దార్ వెంకటేశ్వర్లుకు అప్పగించారు. అనంతరం మీ సేవ కేంద్రం మేనేజర్ వ్యక్తిగత పూచీకత్తుపై వారిని తీసుకెళ్లారు.
బాధ్యులపై కఠిన చర్యలు: జి.వెంకటేశ్వర్లు, తహసీల్దార్, నెల్లూరు
ఆర్ఐ, వీఆర్వో సంతకాలు ఉన్న జెరాక్సు పత్రాలతో కుల, ఆదాయ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆర్ఐకి సూచించాను. మీ సేవ కేంద్రాల్లో జరిగే అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. వారికి సహకరిస్తున్నారని ఆరోపణలు వచ్చిన మా కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్లను బదిలీ చేశాం.
నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు: ఏ. మహమ్మద్‌ఇంతియాజ్, జేసీ
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మీ–సేవ కేంద్రాలు ఏర్పాటు చేసింది. నిబంధనల ప్రకారం సర్టిఫికెట్లు మంజూరు చేయాలి. అక్రమ మార్గంలో సర్టిఫికెట్లు మంజూరు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. జరిగిన ఘటనపై విచారణ జరిపిస్తాం.