'ఆ రెండు సంస్థలు హైదరాబాద్‌ను ఆగం చేస్తున్నాయ్'
హైదరాబాద్: ఇష్టారీతిగా రోడ్లను తవ్వేస్తూ ఎయిర్టెల్, రిలయన్స్ సంస్థలు హైదరాబాద్‌ను ఆగం చేస్తున్నాయని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కేబుల్‌వైర్ల ఏర్పాటుకోసం ఆ సంస్థలు ఇంతకు ముందు తవ్వినచోట్ల ప్యాచ్ వర్క్‌లు చేయకుండా, కొత్తచోట్ల తవ్వకాలు చేపడుతున్నాయని తెలిపారు. శాసనసభలో మంగళవారం హైదరాబాద్‌పై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన రోడ్ల తవ్వకాలు, నాలాల్లో పూడిక తీత సమస్యలను లేవనెత్తారు.
‘ఒకవైపు హైదరాబాద్‌ను విశ్వనగరంగా తయారుచేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో ఆ మేరకు అవసరమైన పనులేవీ జరగడంలేదు. ఎయిర్టెల్, రిలయన్స్ లాంటి కంపెనీలు ఇష్టం వచ్చినట్లు రోడ్లు తవ్వుతున్నాయి. ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవడంలేదు. నా నియోజకవర్గం(అంబర్‌పేట)లో అలా తొవ్వి వదిలేసిన రోడ్లపై జనం ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులను కలిసినా ఫలితం శూన్యం. ప్యాచ్ వర్క్‌లు చేయకుండా కొత్తగా రోడ్లు తవ్వద్దని.. స్వయంగా నేనే పనులు అడ్డుకున్నా. దీంతో ప్రభుత్వం పోలీసులను మోహరింపజేసింది. పోలీసుల అండతో రోడ్లను తవ్వే పనులు జరుగుతున్నాయి’ అని కిషన్ రెడ్డి సభకు తెలిపారు.
హైదరాబాద్ ప్రజాప్రతినిధిగా తాను కూడా విశ్వనగర నిర్మాణంలో భాగస్వాముడనేనని, తవ్విన చోట్ల వెంటనే ప్యాచ్‌వర్క్‌లు చేసేలా స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలని కిషన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ నగరంలోని నాలాల్లో పూడిక తీత పనులపై మాట్లాడుతూ..‘అధ్యక్షా.. సరిగ్గా వర్షాలు కురవడానికి ఒకటి రెండు రోజుల ముందు నాలాల్లో పూడికతీత పనులు మొదలుపెడతారు. ఏం? 365 రోజులూ ఏం చేస్తున్నారు? జనవరిలో పూడికతీత మొదలుపెడితే, వర్షాలు కురిసేనాటికి పనులు పూర్తవుతాయికదా? ఆమేరకు కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలన కోరుతున్నా’అని కిషన్‌రెడ్డి అన్నారు.