diseased
-
పింఛన్లు:65,98,138
సాక్షి, అమరావతి: అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వివిధ రకాల చేతి వృత్తిదారులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మరో 1,93,680 మందికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మంగళవారం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో ప్రతి నెలా అందజేసే పింఛన్ల సంఖ్య రికార్డు స్థాయిలో 65,98,138కి చేరింది. కొత్తగా మంజూరైన వారికి ఈ నెల నుంచే ఫింఛన్ డబ్బులు పంపిణీ చేసేందుకు వీలుగా ఈ నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని 14వతేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. కొత్త పింఛన్ల మంజూరుకు అదనంగా అవసరమయ్యే నిధులను కూడా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని, చాలా చోట్ల మంగళవారం సాయంత్రం నుంచే కొత్త పింఛన్‌దారులకు నగదు పంపిణీ ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెలలో కొత్తగా పింఛన్ మంజూరైన 1,93,680 మంది లబ్ధిదారులలో 95,653 మంది అవ్వాతాతల వృద్ధాప్య పింఛన్లున్నాయి. 40,058 మంది వితంతువులు, 29,858 మంది దివ్యాంగులు, 6,861 మంది డప్పు కళాకారులు, 4,763 మంది మత్య్సకారులు, 2,844 మంది కల్లుగీత కార్మికులు, 4 వేల మంది హెచ్ఐవీ బాధితులు కాగా మిగిలినవి ఇతర పింఛన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెలలో కొత్తగా 3,42,452 మందికి పింఛన్లు... ఎప్పటిమాదిరిగానే ఈ నెల ఒకటో తేదీనే ప్రభుత్వం పింఛన్ల పంపిణీ ప్రారంభించే సమయంలో 1,48,772 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. అప్పటికే పింఛన్ల పొందుతున్న వారితో కలిపి సెప్టెంబరు ఒకటో తేదీన ప్రభుత్వం మొత్తం 64,04,458 మంది లబ్ధిదారులకు పింఛన్ల మొత్తాన్ని విడుదల చేసింది. తాజాగా రెండో విడతగా మంగళవారం మంజూరు చేసిన 1,93,680 మంది కొత్త లబ్ధిదారులతో కలిపి ఈ నెలలో రెండు విడతల్లో మొత్తం 3,42,452 మందికి ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేయడం గమనార్హం. ఒక్క నెలలో పింఛన్లకు రూ.1,819.02 కోట్లు.. సెప్టెంబరు ఒకటో తేదీన మొత్తం 64,04,458 మందికి పింఛను డబ్బుల పంపిణీకి రూ.1,764.83 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా కొత్తగా మంజూరు చేసిన వారితో కలిపి ఈ నెలలో మొత్తం 65,98,138 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం మొత్తం రూ.1,819.02 కోట్లను సెప్టెంబర్‌లో విడుదల చేసింది. ఈ నెలలో రెండు విడతలతో పాటు కొత్తగా పింఛన్లు మంజూరు చేసిన 3,42,452 మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.96.12 కోట్ల చొప్పున అదనంగా ఖర్చు చేసేందుకు ముందుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నాలుగేళ్లలో 28.26 లక్షల కొత్త పింఛన్లు రాష్ట్రంలో ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న ప్రతి పది మందిలో నలుగురుకి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తరువాతే కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. జగన్ సీఎం అయ్యాక 28,26,884 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు గణాంకాలతో వెల్లడిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ల కోసం సరాసరిన రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం సెప్టెంబరు నెలలో ఏకంగా రూ.1,819 కోట్లు వెచ్చించడం గమనార్హం. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత గత నాలుగేళ్లుగా లంచాలు, వివక్షకు తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. అవ్వాతాతలతో పాటు దివ్యాంగులకు ఏ చిన్న కష్టం లేకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ల సొమ్మును అందజేస్తున్నారు. -
కరోనా మృతులతో వైరస్ వ్యాపించదు
కర్నూలు(హాస్పిటల్): కరోనా వ్యాధితో మృతి చెందిన వారి నుంచి వైరస్ వ్యాపించదని, అలా మృతి చెందిన వారికి గౌరవంగా అంత్యక్రియలు చేయడానికి ప్రజలు సహకరించాలని కర్నూలు మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్, కోవిడ్ సలహా కమిటీ సభ్యులు, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ సి. ప్రభాకర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలను శ్మశానవాటికకు దగ్గరగా ఉన్న స్థానికులు అడ్డుకుంటున్నారని, ఇది చాలా బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా ఒక రోగి మృతి చెందిన తర్వాత హైపోక్లోరైడ్‌తో వైరస్ చనిపోయేటట్లు చేసి..ఒక సంచిలో మూసివేస్తారని తెలిపారు. ఆ తర్వాతే మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్తారని పేర్కొన్నారు. -
జోరుగా కల్తీకల్లు విక్రయాలు
హిందూపురం అర్బన్ : కల్తీ కల్లు విక్రయాలు ఊపందుకున్నాయి. నిషిధ రసాయనాలను కలిపిన కల్లు సేవించిన పలువురు అస్వస్తతకు లోనై హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్సకు చేరారు. వివరాల్లోకి వెళితే... లేపాక్షి మండలంలోని తిమ్మగానిపల్లికి చెందిన12 మంది కల్లు తాగి శనివారం అస్వస్థతకు గురయ్యారు. విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వారిని వెంటనే హిందూపురం ఆస్పత్రికి తీసుకువచ్చారు. చికిత్స పొందుతున్న వారిలో రామాంజినేయులు, అలివేలమ్మ, నరసింహప్ప, నరసింహులు, నరసప్పలతో మరికొందరి ప్రవర్తన విచిత్రంగా ఉంది. పరీక్షల అనంతరం పెద్ద మోతాదులో మత్తు కోసం వాడిన నిషిద్ధ రసాయనాల వల్ల వీరి నరాలు బలహీనమైనట్లు వైద్యులు పేర్కొన్నారు. వీరి రక్తనమునాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. మత్తు కోసం క్లోరోహైడ్రెట్, డైజోఫాం : లేపాక్షి, చిలమత్తూరు, హిందూపురం మండలాల్లో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. హిందూపురం ఎక్సైజ్ పోలీసుస్టేషన్ పరిధిలో 81 టిఎఫ్సీలు, 16 టిసీఎస్లు ఉన్నాయి. ఇవిగాక అనధికారికంగా గ్రామానికి ఒకటిగా కల్లు అంగళ్లు వెలిసాయి. వీటిల్లో కల్లు తొందరగా పులిసి పోకుండా ఉండేందుకు, మత్తు కలిగించేందుకు క్లోరోహైడ్రెట్, డైజోఫాంను కలిపి విక్రయిస్తున్నారు. అయితే వీటిని నిర్ధిష్ట పరిమాణంలో కన్నా ఎక్కువ మోతాదులో వాడుతుండడంతో తాగిన వారిలో కొన్ని రోజుల తర్వాత ప్రభావం చూపుతూ వచ్చింది. బెదురు చూపులు, ఫిట్స్ వచ్చిన వారిలా కొట్టుకోవడం చేస్తున్నారు. ఎక్సైజ్ సిబ్బంది మాముళ్లకు అలవాటు పడి కల్లు దుకాణాలపై నిఘా ఉంచడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఏడాదిలో 65 కేసులు : హిందూపురం సర్కిల్ పరిధిలో కల్లు విక్రయ దుకాణాలపై తరచు దాడులు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నట్లు తేలిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు జిల్లా ఎన్ఫోర్సమెంట్ సహాయ సూపరింటెండెంట్ స్వాతి తెలిపారు. ఎక్సైజ్ అధికారులతో కలిసి తిమ్మగానిపల్లి, కొండూరు, హిందూపురం పరిసర ప్రాంతాల్లోని కల్లు దుకాణాలపై శనివారం ఆమె దాడులు నిర్వహించారు. అనంతరం స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 65 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వారం రోజులుగా చాలా ప్రాంతాల్లో కల్లు విక్రయాలు నిలిచిపోయాయని అన్నారు. కల్లు అమ్ముతున్న ప్రాంతంలోని పరీక్షలు చేసి కల్తీ ఉన్నట్లు తేలితే వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తిమ్మగానిపల్లి ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినట్లు తెలిపారు.