జోరుగా కల్తీకల్లు విక్రయాలు
హిందూపురం అర్బన్ : కల్తీ కల్లు విక్రయాలు ఊపందుకున్నాయి. నిషిధ రసాయనాలను కలిపిన కల్లు సేవించిన పలువురు అస్వస్తతకు లోనై హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్సకు చేరారు. వివరాల్లోకి వెళితే... లేపాక్షి మండలంలోని తిమ్మగానిపల్లికి చెందిన12 మంది కల్లు తాగి శనివారం అస్వస్థతకు గురయ్యారు. విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వారిని వెంటనే హిందూపురం ఆస్పత్రికి తీసుకువచ్చారు.
చికిత్స పొందుతున్న వారిలో రామాంజినేయులు, అలివేలమ్మ, నరసింహప్ప, నరసింహులు, నరసప్పలతో మరికొందరి ప్రవర్తన విచిత్రంగా ఉంది. పరీక్షల అనంతరం పెద్ద మోతాదులో మత్తు కోసం వాడిన నిషిద్ధ రసాయనాల వల్ల వీరి నరాలు బలహీనమైనట్లు వైద్యులు పేర్కొన్నారు. వీరి రక్తనమునాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు.
మత్తు కోసం క్లోరోహైడ్రెట్, డైజోఫాం : లేపాక్షి, చిలమత్తూరు, హిందూపురం మండలాల్లో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. హిందూపురం ఎక్సైజ్ పోలీసుస్టేషన్ పరిధిలో 81 టిఎఫ్‌సీలు, 16 టిసీఎస్‌లు ఉన్నాయి. ఇవిగాక అనధికారికంగా గ్రామానికి ఒకటిగా కల్లు అంగళ్లు వెలిసాయి. వీటిల్లో కల్లు తొందరగా పులిసి పోకుండా ఉండేందుకు, మత్తు కలిగించేందుకు క్లోరోహైడ్రెట్, డైజోఫాంను కలిపి విక్రయిస్తున్నారు.
అయితే వీటిని నిర్ధిష్ట పరిమాణంలో కన్నా ఎక్కువ మోతాదులో వాడుతుండడంతో తాగిన వారిలో కొన్ని రోజుల తర్వాత ప్రభావం చూపుతూ వచ్చింది. బెదురు చూపులు, ఫిట్స్ వచ్చిన వారిలా కొట్టుకోవడం చేస్తున్నారు. ఎక్సైజ్ సిబ్బంది మాముళ్లకు అలవాటు పడి కల్లు దుకాణాలపై నిఘా ఉంచడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.
ఏడాదిలో 65 కేసులు : హిందూపురం సర్కిల్ పరిధిలో కల్లు విక్రయ దుకాణాలపై తరచు దాడులు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నట్లు తేలిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు జిల్లా ఎన్‌ఫోర్‌సమెంట్ సహాయ సూపరింటెండెంట్ స్వాతి తెలిపారు. ఎక్సైజ్ అధికారులతో కలిసి తిమ్మగానిపల్లి, కొండూరు, హిందూపురం పరిసర ప్రాంతాల్లోని కల్లు దుకాణాలపై శనివారం ఆమె దాడులు నిర్వహించారు. అనంతరం స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 65 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వారం రోజులుగా చాలా ప్రాంతాల్లో కల్లు విక్రయాలు నిలిచిపోయాయని అన్నారు. కల్లు అమ్ముతున్న ప్రాంతంలోని పరీక్షలు చేసి కల్తీ ఉన్నట్లు తేలితే వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తిమ్మగానిపల్లి ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినట్లు తెలిపారు.