hindupuram govt hospital
-
హిందూపురం కోవిడ్ ఆస్పత్రిలో కలకలం
హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో సోమవారం కలకలం చోటు చేసుకుంది. ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రిలో 8 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. అయితే వీరి మృతికి ఆక్సిజన్ అందకపోవడం కారణం కాదని.. ఆక్సిజన్ నిల్వలు ఆస్పత్రిలో సమృద్ధిగా ఉన్నాయని.. చివరి క్షణంలో ఆస్పత్రికి రావడం వల్లే ఆరోగ్యం విషమించి వారు మృతి చెందారని అధికారులు తెలిపారు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. హిందూపురం కోవిడ్ ఆస్పత్రిలో 150 బెడ్లతోపాటు 50 ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉండగా 232 మంది చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఆరోగ్యం విషమించి మంజునాథ్ (39), హిందూపురం ముబారక్ (63), మడకశిర రమేష్ (42), గోళాపురం నంజేగౌడ, నరసింహప్ప (58), సదాశివప్ప (50), లక్ష్మమ్మ (60), గంగరత్న(58) మృతి చెందారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా వైద్యుల నిర్లక్ష్యమే మరణాలకు కారణమని మృతుల కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న సీఐ బాలమద్దిలేటి ఆస్పత్రికి చేరుకుని వారికి సర్దిచెప్పడంతో శాంతించారు. 24 గంటలూ పర్యవేక్షిస్తున్నాం ఆక్సిజన్ అందక కోవిడ్ రోగులు మృతి చెందారనేది అవాస్తవమని జిల్లా అటవీ శాఖాధికారి, ఆక్సిజన్ మానిటరింగ్ అధికారి జగన్నాథ్‌సింగ్, పెనుకొండ సబ్ కలెక్టర్ నిషాంతి తెలిపారు. సోమవారం హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో వారు సూపరింటెండెంట్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ.. ఆస్పత్రిలో 204 బెడ్లు ఉండగా ఇందులో 22 వెంటిలేటర్ బెడ్లు ఉన్నాయన్నారు. 6 కేఎల్ ఆక్సిజన్ ట్యాంకర్‌తోపాటు అదనంగా సిలిండర్లు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతోనే కోవిడ్ రోగులు మృతి చెందారని తెలిపారు. ఆక్సిజన్ మానిటరింగ్ కమిటీ ద్వారా 24 గంటలు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. విషమ పరిస్థితిలో ఆస్పత్రికి వచ్చినవారే.. మృతిచెందినవారంతా విషమ పరిస్థితిలో ఆస్పత్రికి వచ్చినవారే. వారికి ఆక్సిజన్ లెవల్ 80లోపు ఉంది. తెల్లవారుజామున ఆక్సిజన్ సిలిండర్లు రీస్టోర్ చేసే సమయంలో భయపడటం వల్లే శ్వాస సమస్య తలెత్తి వారు మరణించినట్లు భావిస్తున్నాం. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత, ఇతర సాంకేతిక సమస్యలు లేవు. – డాక్టర్ దివాకర్, సూపరింటెండెంట్, హిందూపురం ప్రభుత్వాస్పత్రి -
ఆక్సిజన్ యూనిట్లో షార్ట్ సర్క్యూట్.. పసికందు మృత్యువాత
హిందూపురం: ఆక్సిజన్ యూనిట్లో షార్ట్ సర్క్యూట్ సంభవించటంతో పుట్టిన కొన్ని గంటల్లోనే పసికందు మృత్యువాత పడిన దుర్ఘటన అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ బంధువులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. వివరాలివీ.. హిందూపురం పట్టణ సమీపంలోని కొట్నూరుకు చెందిన సుహేల్ భార్య మదీన బేగంకు పురిటినొప్పులు రాగా, శనివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి సాధారణ ప్రసవం అవుతుందన్నారు. తర్వాత కొద్దిసేపటికి అత్యవసరంగా సిజేరియన్ చేయాల్సి వస్తుందని చెప్పి ఆపరేషన్ చేశారు. మగబిడ్డ పుట్టాడు. కొంత సమయం తర్వాత బిడ్డ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడంటూ కృత్రిమంగా ఆక్సిజన్ ఇవ్వాలని చిన్నపిల్లల వార్డుకు తరలించారు. ఆక్సిజన్ ఇస్తున్న సమయంలో సంబంధిత యూనిట్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో రాత్రి 9 గంటల ప్రాంతంలో పసిబిడ్డ మృతి చెందింది. బిడ్డ చనిపోవడంతో బాధితులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై సూపరింటెండెంట్ కేశవులు మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని, బిడ్డ ఆరోగ్య పరిస్థితి సరిగా లేని కారణంతోనే మృతి చెందినట్లు చెప్పారు. -
జోరుగా కల్తీకల్లు విక్రయాలు
హిందూపురం అర్బన్ : కల్తీ కల్లు విక్రయాలు ఊపందుకున్నాయి. నిషిధ రసాయనాలను కలిపిన కల్లు సేవించిన పలువురు అస్వస్తతకు లోనై హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్సకు చేరారు. వివరాల్లోకి వెళితే... లేపాక్షి మండలంలోని తిమ్మగానిపల్లికి చెందిన12 మంది కల్లు తాగి శనివారం అస్వస్థతకు గురయ్యారు. విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వారిని వెంటనే హిందూపురం ఆస్పత్రికి తీసుకువచ్చారు. చికిత్స పొందుతున్న వారిలో రామాంజినేయులు, అలివేలమ్మ, నరసింహప్ప, నరసింహులు, నరసప్పలతో మరికొందరి ప్రవర్తన విచిత్రంగా ఉంది. పరీక్షల అనంతరం పెద్ద మోతాదులో మత్తు కోసం వాడిన నిషిద్ధ రసాయనాల వల్ల వీరి నరాలు బలహీనమైనట్లు వైద్యులు పేర్కొన్నారు. వీరి రక్తనమునాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. మత్తు కోసం క్లోరోహైడ్రెట్, డైజోఫాం : లేపాక్షి, చిలమత్తూరు, హిందూపురం మండలాల్లో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. హిందూపురం ఎక్సైజ్ పోలీసుస్టేషన్ పరిధిలో 81 టిఎఫ్సీలు, 16 టిసీఎస్లు ఉన్నాయి. ఇవిగాక అనధికారికంగా గ్రామానికి ఒకటిగా కల్లు అంగళ్లు వెలిసాయి. వీటిల్లో కల్లు తొందరగా పులిసి పోకుండా ఉండేందుకు, మత్తు కలిగించేందుకు క్లోరోహైడ్రెట్, డైజోఫాంను కలిపి విక్రయిస్తున్నారు. అయితే వీటిని నిర్ధిష్ట పరిమాణంలో కన్నా ఎక్కువ మోతాదులో వాడుతుండడంతో తాగిన వారిలో కొన్ని రోజుల తర్వాత ప్రభావం చూపుతూ వచ్చింది. బెదురు చూపులు, ఫిట్స్ వచ్చిన వారిలా కొట్టుకోవడం చేస్తున్నారు. ఎక్సైజ్ సిబ్బంది మాముళ్లకు అలవాటు పడి కల్లు దుకాణాలపై నిఘా ఉంచడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఏడాదిలో 65 కేసులు : హిందూపురం సర్కిల్ పరిధిలో కల్లు విక్రయ దుకాణాలపై తరచు దాడులు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నట్లు తేలిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు జిల్లా ఎన్ఫోర్సమెంట్ సహాయ సూపరింటెండెంట్ స్వాతి తెలిపారు. ఎక్సైజ్ అధికారులతో కలిసి తిమ్మగానిపల్లి, కొండూరు, హిందూపురం పరిసర ప్రాంతాల్లోని కల్లు దుకాణాలపై శనివారం ఆమె దాడులు నిర్వహించారు. అనంతరం స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 65 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వారం రోజులుగా చాలా ప్రాంతాల్లో కల్లు విక్రయాలు నిలిచిపోయాయని అన్నారు. కల్లు అమ్ముతున్న ప్రాంతంలోని పరీక్షలు చేసి కల్తీ ఉన్నట్లు తేలితే వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తిమ్మగానిపల్లి ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినట్లు తెలిపారు.