తోలుచిత్రాలు
కాలం ముందుకు కదులుతూనే ఉంటుంది. ఆ ప్రస్థానానికి తగినట్లు మనిషి మారుతుండాలి. ఆ మార్పు అభ్యుదయం దిశగా సాగాలి. వ్యక్తి అయినా, వృత్తి అయినా అభివృద్ధికి ఇదే కొలమానం. ఆ సూత్రాన్ని పట్టుకున్నారు తోలుబొమ్మల కళాకారుడు దళవాయి వెంకటరమణ.
దేనికదే ప్రత్యేకం!
తోలుబొమ్మ కళాకారుల్లో ఉన్న గొప్పదనం ఏమిటంటే... డిజైన్ని ట్రేస్ పేపర్ మీద వేయడం అనే ఆలోచనే ఉండదు. ఘట్టాన్ని ఊహించుకుని స్వయంగా బొమ్మ గీసుకుంటాం. దాంతో ఈ కళలో ఉన్న డిజైన్లు మరి దేనికీ నకలుగా ఉండవు. దేనికదే కొత్త రూపం. తోలు బొమ్మలను పారేయాల్సిందే తప్ప ఎన్నేళ్లయినా అవి పాడవవు.
- వెంకట రమణ
వాకా మంజులారెడ్డి
అనంతపురం నిమ్మలకుంట గ్రామంలో ‘చిత్రకార’ కుటుంబంలో పుట్టిన రమణ... తాత ముత్తాతల నుంచి వారసత్వంగా అందివచ్చిన తోలుబొమ్మలాటను ఇష్టంగా నేర్చుకున్నారు. అందుకే... తాత ఖడేరావు దగ్గర నేర్చుకున్న పాటలు, తండ్రి గోవిందు నేర్పిన ములుకు పట్టడం (తోలు బొమ్మల తయారీలో నైపుణ్యం), నాయనమ్మ, అమ్మ దగ్గర నేర్చుకున్న రంగనాథ రామాయణం ఘట్టాల ప్రదర్శన క్రమంగా ఆదరణ కోల్పోతున్నప్పటికీ ఆ వృత్తిని వదలడానికి ఆయన మనసు ఒప్పుకోలేదు. అలాగని తోలుబొమ్మలాట దగ్గరే ఆగిపోతే కుటుంబం గడవదు. ఈ సంఘర్షణ నుంచి తనకు తాను ఓ కొత్త దారిని వేసుకున్నారు. తోలుబొమ్మలలో అందమైన ల్యాంప్షేడ్లు, వాల్ హ్యాంగింగ్, డోర్ ప్యానెల్ పార్టిషన్... ఇంకా ఇతర గృహాలంకరణ వస్తువులు రూపొందించారు! ఆ ప్రయోగం అతణ్ణి రాష్ట్రస్థాయి హస్తకళల పోటీలో విజేతను చేసింది. లేపాక్షి హస్తకళా ప్రదర్శనలో 2008లో ప్రదర్శించిన ల్యాంప్‌షేడ్‌కి బహుమతి అందుకున్న వెంకటరమణ తాజాగా తన కళాప్రావీణ్యానికి గవర్నర్ నరసింహన్ నుంచి ప్రశంసలతోపాటు రాజ్‌భవన్‌కు ఆహ్వానమూ అందుకున్నారు.
ఆట చూడకపోయినా...
‘‘తోలుబొమ్మలాట చూసే వాళ్లు లేరు కానీ తోలుబొమ్మను చూసేవాళ్లుంటారు’’ అంటారు వెంకటరమణ. ‘‘ఇది చిత్రకార ప్రధానమైన కళ. దీనిని చిత్రాలకే పరిమితం చేస్తూ కొనసాగిద్దామని ఇలాంటి ప్రయోగాలు చేశాను. నా ప్రయోగాలు విజయవంతమైన తర్వాత మధువని, కలంకారీ వంటి ఇతర చిత్రరీతులను కూడా తోలు మీద చిత్రిస్తున్నాను’’ అని చెప్పారాయన.
ధర్మవరం రంగులు
తోలుబొమ్మలకు పట్టుచీరలకు వేసే రంగులనే వెంకటరమణ వాడతారు. ‘‘మాకు ధర్మవరం పదికిలోమీటర్ల దూరం. రంగులన్నీ అక్కడి నుంచే తెచ్చుకుంటాం. ఆ రంగులు వేస్తే బొమ్మ అందంగా ఉంటుంది, ఎక్కువ కాలం ఆకర్షణీయంగా ఉంటుంది’’ అంటారు వెంకటరమణ. ఢిల్లీ ప్రగతి మైదాన్, హైదరాబాద్ శిల్పారామంలతో సహా ఇప్పటి వరకు. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన పట్టణాలలో ఆయన తన కళా కృతులను ప్రదర్శించారు.
‘‘ఆటను ప్రదర్శించడానికైతే కనీసంగా ఆరుగురు మనుషులుండాలి. చిత్రకార కుటుంబాల్లో అందరికీ ఈ కళలో ప్రవేశం ఉంటుంది. తోలుబొమ్మలాట చూడాలనే ఆసక్తి లేకపోయినా, అది ఎలా ఉంటుందో ఈ తరం పిల్లలకు చూపించాలని ఎవరైనా సరదా పడినా సరే ఆట ఆడడానికి తాము సిద్ధమే’’ అంటున్నారు వెంకటరమణ.
ఫొటోలు: నోముల రాజేశ్‌రెడ్డి