disinvestment department
-
హిందుస్తాన్ జింక్ 26 శాతం వాటా విక్రయంపై ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2002లో హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జెడ్‌ఎల్)లో 26 శాతం పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని కేంద్రం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. గత ఏడాది ఇచ్చిన తీర్పులో అత్యున్నత న్యాయస్థానం సూచించిన విధంగానే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనానికి తెలియజేశారు. ఈ కేసులో తాజా పరిస్థితిపై నివేదికను దాఖలు చేయాలని సొలిసిటర్ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది. వేసవి సెలవుల తర్వాత తదుపరి విచారణను చేపడతామని పేర్కొంది. సుప్రీం ఆదేశాల నేపథ్యం... హిందుస్తాన్ జింక్ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) వ్యవహారాల్లో (26 శాతం వాటా విక్రయాలకు సంబంధించి) అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సీబీఐని ఆదేశిస్తూ గత ఏడాది నవంబర్18వ తేదీన ఇచ్చిన సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దీనిని ఉపసంహరించుకోవాలని కోరుతూ కేంద్రం ఒక రికాల్ పిటిషన్ వేసింది. ఈ కేసులో సీబీఐ సమర్పించిన ప్రాథమిక అంశాలు వాస్తవంగా తప్పని, రీకాల్ కోసం చేసిన అభ్యర్థన అవసరమైనదని, సమర్థించదగినదని తొలుత ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. అవరమైతే ఈ కేసు విచారణకు కేంద్రం చట్టాల ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందన్నారు. అయితే ఈ వాదనలతో న్యాయమూర్తులు డి వై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం అప్పట్లో విబేధించింది. పిటిషన్‌ను కొట్టివేస్తారస్న సంకేతాలతో వెంటనే దీనిని ఉపసంహరించుకోడానికి అనుమతించాలని తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు. దీనికి బెంచ్ అంగీరిస్తూ, ‘డిస్మిస్డ్ విత్ విత్‌డ్రాన్’గా అప్పట్లో రూలింగ్ ఇచ్చింది. నేపథ్యం ఇదీ... గత ఏడాది నవంబర్‌లో ఈ అంశం సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. హిందుస్తాన్ జింక్‌లో కేంద్రానికి మిగిలిన 29.5 శాతం వాటా విక్రయానికి లైన్ క్లియర్ చేసింది. అయితే హిందుస్తాన్ జింక్ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. ‘మే ము కొన్ని కీలకమైన వాస్తవాలు, ప్రమేయం ఉన్న వ్యక్తుల పేర్లపై వ్యాఖ్యానించడాన్ని నిరాకరిస్తున్నా ము. తద్వారా ఈ విషయం యొక్క దర్యాప్తునకు ఎటువంటి పక్షపాతం కలుగకుండా ఉంటుంది‘ అని అత్యున్నత స్థాయి ధర్మాసనం గతంలో వ్యా ఖ్యానించింది. 2002లో జరిగిన హిందుస్తాన్ జింక్ డిజిన్వెస్ట్‌మెంట్ అవకతవకలపై ప్రాథమిక విచారణను సాధారణ కేసుగా మార్చాలని సీబీఐకి చెందిన పలువురు అధికారుల సిఫారసులను ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఆరోపణ లకు ఈ అంశం బలాన్ని ఇస్తోందని పేర్కొంది. 2002లో పెట్టుబడుల ఉపసంహరణలో జరిగిన అవకతవకలపై ప్రాథమిక విచారణను ముగించి, సీబీఐని తక్షణమే రెగ్యులర్ కేసు నమోదు చేయాలని, అలాగే కేసు విచారణ పురోగతిపై త్రైమాసికం వారీగా లేదా కోర్టు సమయానుకూల ఆదేశాలకు అనుగుణంగా అత్యున్నత న్యాయస్థానానికి నివేదిక అందజేయా లని ఆదేశించింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం 2002లో హిందుస్తాన్ జింక్ నుంచి కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాటాలు ఇలా... హిందుస్తాన్ జింక్ లో తనకున్న వాటా 100 శాతంలో 24.08 శాతాన్ని దేశీయ మార్కెట్లో కేంద్రం తొలుత 1991–92లో విక్రయించింది. ఈ పెట్టుబడుల ఉపసంహరణతో కేంద్రం వాటా 75.92 శాతానికి తగ్గింది. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మొదటిసారి అధికారంలో ఉన్న 2002 సమయంలో అప్పట్లో ‘మినీ రత్న’ హోదా హిందుస్తాన్ జింక్‌లో 26 శాతాన్ని వ్యూహాత్మక భాగస్వామి– ఎస్‌ఓవీఎల్‌కు (అనిల్ అగర్వాల్ నడుపుతున్న స్టెరిలైట్ ఆపర్చునిటీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్) కేంద్రం విక్రయించింది. 2002 ఏప్రిల్ 10న ఎస్‌ఓవీఎల్ ఓపెన్ మార్కెట్లో మరో 20 శాతాన్ని కొనుగోలు చేసింది. 2003 ఆగస్టులో కేంద్రంతో జరిగిన షేర్‌హోల్డర్ అగ్రిమెంట్ ద్వారా మరో 18.92 శాతం కొనుగోలు చేసింది. వెరసి ప్రస్తుతం ఎస్‌ఓవీఎల్ వద్ద హిందుస్తాన్ జింక్‌లో మెజారిటీ 64.92 శాతం వాటా ఉంది. కేంద్రం వద్ద 29.5 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయానికి కూడా 2012లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. హిందుస్తాన్ జింక్ లో ప్రస్తుతం ఎస్‌ఓవీఎల్ వాటా 64.92 శాతంసహా మిగిలిన వాటా ప్రభుత్వం, డీఐఐ, ఎఫ్ఐఐ, రిటైల్ ఇన్వెస్టర్ల వద్ద ఉంది. ఎన్ఎస్ఈలో శుక్రవారం హిందుస్తాన్ జింక్ షేర్ ధర క్రితంలో పోల్చితే స్వల్పంగా పెరిగి రూ.321 వద్ద ఉంది. చదవండి: బ్రెడ్ మాత్రమే మిగిలింది.. మారుతి భార్గవ కీలక వ్యాఖ్యలు -
ఆ బ్యాంకు కూడా ప్రైవేటు పరం ఖాయం!
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియ యధాతథంగానే కొనసాగుతోందని ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలిపారు. రోడ్‌షో పూర్తయిన తర్వాత వాటాల విక్రయ పరిమాణంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. అయితే, ప్రస్తుతం ఎల్ఐసీ చేతిలో ఉన్న మేనేజ్మెంట్ హక్కులను కచ్చితంగా కొత్త కొనుగోలుదారుకు బదలాయించే అవకాశం ఉందని పాండే వివరించారు. ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం తనకున్న వాటాలను, ఇన్వెస్టర్ల స్పందనను బట్టి, ఏకమొత్తంగా విక్రయించాలా లేక విడతలవారీగా విక్రయించాలా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వానికి 45.48 శాతం, ఎల్ఐసీకి 49.24 శాతం వాటాలు ఉన్నాయి. బ్యాంకులో వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్, మేనేజ్మెంట్ హక్కుల బదలాయింపునకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ గతేడాది మేలో సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. మరోవైపు, ఎల్ఐసీని లిస్ట్ చేయడమనేది కేంద్ర ప్రభుత్వ దీర్ఘకాలిక వ్యూహాల్లో భాగమని పాండే చెప్పారు. ముందుగా 5 శాతం వాటాలు విక్రయించాలని భావించినా, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 3.5 శాతానికి పరిమితం చేస్తున్నట్లు వివరించారు. చదవండి: మా 25వేల కోట్లను ఇన్వెస్టర్లకు ఇవ్వండి, లేదంటే తిరిగి మాకే ఇచ్చేయండి! -
డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం కుదింపు?
మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం... న్యూఢిల్లీ: పెట్టుబడుల ఉపసంహరణలకు (డిజిన్వెస్ట్‌మెంట్) సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) లక్ష్యాన్ని కుదించే అంశాన్ని కేంద్రం యోచిస్తున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణల బడ్జెట్ లక్ష్యం రూ.69,500 కోట్లు. ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటా విక్రయం ద్వారా విక్రయించాలని భావిస్తున్న మొత్తం ఇందులో రూ.41,000 కోట్లు. మిగిలిన రూ. 28,500 కోట్లు వ్యూహాత్మక వాటా విక్రయం ద్వారా సేకరించాలని ప్రతిపాదించారు. అయితే ఈ మొత్తం లక్ష్యాన్ని సగానికి కన్నా ఎక్కువగా రూ.30,000 కోట్లకు తగ్గించాలని డిజిన్వెస్ట్‌మెంట్ శాఖ భావిస్తున్నటు సమాచారం. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు దీనికి కారణం. ఇప్పటివరకూ ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి ఏడు నెలలు గడిచిపోతున్నాయి. అయితే ఇప్పటివరకూ కేవలం నాలుగు కంపెనీల ద్వారా మాత్రమే కేంద్రం వాటాలు విక్రయించింది. పీఎఫ్సీ, ఆర్ఈసీ, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, ఐఓసీల నుంచి జరిగిన ఈ వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 12,600 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. 2015-16 లక్ష్యాల ప్రకారం... 20 ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు కేబినెట్ ఆమోదం ఉంది. వీటిలో ఓఐఎల్, నాల్కో, ఎన్ఎండీసీ, కోల్ ఇండియా (10 శాతం చొప్పున), ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, బీహెచ్ఈఎల్ (5 శాతం చొప్పున)లు ఉన్నాయి. ఇటీవలి ఐఓసీ, పీఎఫ్సీ డిజిన్వెస్ట్మెంట్ల విషయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాయి. గత ఐదేళ్లుగా బడ్జెట్ నిర్దేశిస్తున్న స్థాయిల్లో పెట్టుబడుల ఉపసంహరణల లక్ష్యం నెరవేరకపోవడం గమనార్హం. -
ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ రూ.30,000 కోట్లే..!
న్యూఢిల్లీ : పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ ఏడాది రూ.30,000 కోట్లుకు మించి ప్రభుత్వానికి ఆదాయం రాకపోవచ్చని డిజిన్వెస్ట్‌మెంట్ (డీఓడీ) శాఖ ఆర్థికమంత్రిత్వశాఖకు నివేదించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.69,500 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోవడానికి మార్కెట్ ఒడిదుడుకుల పరిస్థితులే కారణమని వివరించింది. మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా భారీ లక్ష్య సాధన వ్యూహం తగిన ఫలితాలను ఇవ్వదని తెలిపింది. ఇటీవలి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ఘనవిజయం సాధించి, ఖజానాకి రూ.1,600 కోట్లు జమ అయినప్పటికీ డీఓడీ తాజా అంచనాలు ఆసక్తిగా మారాయి. ఆర్ఈసీ నుంచి కేంద్రం రూ.1,550 కోట్లు సమీకరించింది. -
అక్టోబర్‌కల్లా వైజాగ్ స్టీల్ ఐపీవో!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్(ఆర్ఐఎన్ఎల్- వైజాగ్ స్టీల్) పబ్లిక్ ఇష్యూని అక్టోబర్‌కల్లా చేపట్టే అవకాశముంది. ఐపీవోలో భాగంగా ప్రభుత్వం 10% వాటాను విక్రయించనుంది. రెండు వారాల్లోగా వైజాగ్ స్టీల్‌ను లిస్ట్ చేసే అంశంపై డిజిన్వెస్ట్‌మెంట్ శాఖ కసరత్తును మొదలుపెట్టనున్నట్లు స్టీల్ శాఖ అధికారి ఒకరు చెప్పారు. వార్షికంగా 2.9 మిలియన్ టన్నుల స్టీల్ తయారీ సామర్థ్యాన్ని కలిగిన వైజాగ్ స్టీల్ రూ. 12,300 కోట్లతో చేపట్టిన విస్తరణ కార్యక్రమాలు దాదాపు పూర్తికావస్తున్నాయి. తద్వారా 6.3 మిలియన్ టన్నుల స్టీల్ తయారీ సామర్థ్యాన్ని అందుకోనుంది. అంతేకాకుండా 2025-26కల్లా 20 మిలియన్ టన్నులకు సామర్థ్యాన్ని విస్తరించాలని ప్రణాళికలు వేసింది. కాగా, వైజాగ్ స్టీల్ లిస్టింగ్ ప్రతిపాదనను గత రెండేళ్లలో ప్రభుత్వం మూడుసార్లు వాయిదా వేసింది. ఐపీవోకు నిర్ణయించిన ధర విషయంలో ఏర్పడ్డ వివాదాలతో ఒకసారి, ప్లాంట్‌లో యాక్సిడెంట్ జరిగి 19 మంది మరణించడంతో మరోసారి ఐపీవో వాయిదా పడిన విషయం విదితమే. 2010లో షరతుల ద్వారా లభించిన నవరత్న హోదాను నిలుపుకోవాలంటే వైజాగ్ స్టీల్‌ను లిస్టింగ్ చేయాల్సి ఉంది.