‘అపెక్స్’ చైర్మన్ అరెస్ట్
మరో ఇద్దరిని కూడా
18కి పెరిగిన అరెస్ట్‌ల సంఖ్య
డీసీసీ బ్యాంక్‌లో రూ. కోట్లు గోల్మాల్ వ్యవహారం
వైద్య పరీక్షలకు తరలింపు
శివమొగ్గ : డీసీసీ బ్యాంకు స్థానిక శాఖలో చోటు చేసుకున్న కోట్ల రూపాయల అవకతవకలకు సంబంధించి రాష్ర్ట అపెక్స్ బ్యాంకు చైర్మన్, శివమొగ్గ డీసీసీ బ్యాంకు అధ్యక్షుడు ఆర్ఎం. మంజునాథ గౌడను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డీసీఐబీ (జిల్లా నేర పరిశోధన విభాగం) ఇన్స్పెక్టర్ జైరాజ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఆయనతో పాటు డీసీసీబీ చీఫ్ మేనేజర్ నాగభూషణరావు, ఈ కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్న కుంసి గ్రామానికి చెందిన బసప్పలను కూడా అరెస్టు చేసింది.
దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 18కి పెరిగింది. మంజునాథ గౌడ ఆరెస్టు శివమొగ్గ జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్ర సహకార రంగంలో సంచలనాన్ని సృష్టించింది. నకిలీ బంగారు నగలను తాకట్టుగా పెట్టి స్థానిక డీసీసీబీ శాఖలో రూ.62 కోట్ల వరకు పలువురు రుణం తీసుకున్నారు. రుణ మంజూరు విధి విధానాలను కూడా పట్టించుకోలేదని దర్యాప్తులో వెల్లడైంది.
గత నెల 17న స్థానిక శాఖలో రూ.2.79 కోట్ల మేరకు అవతవకలు జరిగాయని బ్యాంకు జనరల్ మేనేజర్ దొడ్డపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్న సమయంలో భారీ కుంభకోణం బయట పడింది. మరింత లోతైన దర్యాప్తు కోసం ఇన్స్పెక్టర్ జైరాజ్ నాయకత్వంలో ప్రత్యేకృ బందాన్ని ఏర్పాటు చేశారు.
తీగ లాగితే డొంక కదిలినట్లు ప్రత్యేకృ బందం దర్యాప్తులో అనేక అక్రమాలు వెలుగు చూశాయి. కాగా ఈ కుంభకోణంలో మంజునాథ గౌడ ప్రత్యక్ష పాత్ర ఉందని, ఆయనపై మోసం, వంచన, బ్యాంకు విశ్వాసానికి ద్రోహం లాంటి ఆరోపణలపై ఐపీసీ 420, 406, 408, 409, 134 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ కౌశలేంద్ర కుమార్ విలేకరుల సమావేశంలో తెలిపారు.