ఇక జగిత్యాల జిల్లా
మారనున్న రూపురేఖలు
దసరాకు ఆవిర్భావం
జగిత్యాల అర్బన్: కొత్త జిల్లాలపై వచ్చేవారమే నోటిఫికేషన్ రానుంది. జగిత్యాల ఇక జిల్లా కేంద్రంగా మారనుంది. ప్రభుత్వం 23 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ ఇప్పటికే సీసీఎల్ఏ నోటిఫికేషన్ జారీచేసింది. విజయదశమి నుంచి నూతన జిల్లా కేంద్రాల పరిపాలన చేపట్టేందుకు రెవెన్యూ, సీసీఎల్ఏ ఇప్పటికే సన్నాహాలు పూర్తిచేసింది. అవసరమైన మౌలిక వసతులు, ప్రత్యావ్నూయ ఏర్పాట్ల బాధ్యతలు కలెక్టర్లకు అప్పగించింది. అధికారులు, ఉద్యోగుల రేషనలైజేషన్ కోసం ప్రభుత్వం ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసింది.
కరీంనగర్ తర్వాత జిల్లాలో జగిత్యాల అతిపెద్ద పట్టణం. గ్రేడ్–1 మున్సిపాలిటీ కూడా. జిల్లా ఏర్పాటుపై ఇప్పటికే సబ్‌కలెక్టర్ శశాంక నివేదిక అందజేశారు. ఈ ప్రాంతంలోని 20 మండలాలను కలుపుతూ జిల్లా చేయొచ్చని ప్రతిపాదించారు. జగిత్యాలలో జగిత్యాల అర్బన్, రాయికల్, సారంగాపూర్, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, ధర్మపురి, పెగడపల్లి, మల్యాల, కొడిమ్యాల, కథలాపూర్, మేడిపల్లి, కోరుట్ల అర్బన్, మెట్పల్లి అర్బన్, ధర్మారం, వెల్గటూర్తో పాటు కొత్తగా జగిత్యాల రూరల్, కోరుట్ల రూరల్, మెట్పల్లి రూరల్, బుగ్గారం మండలాలుగా ఏర్పాటుచేసి కొత్త జిల్లాలో కలపనున్నారు.ప్రస్తుతం జిల్లాల జాబితాలో సిరిసిల్లకు చోటు దక్కకపోవడంతో మరిన్ని మండలాలు జగిత్యాల కలిసే అవకాశాలు ఉన్నాయి. అంతేగాకుండా రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో ఒకటి జగిత్యాల కాగా, రెండోది కోరుట్లగా అధికారులు నిర్ణయించారు.
నూకపల్లిలో కలక్టరేట్
జగిత్యాల కలక్టరేట్ సముదాయాన్ని పట్టణానికి 10 కి.మీ దూరంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ (న్యాక్) భవన ంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదించారు. కానీ.. ఇది దూరంగా ఉండటంతో ప్రస్తుతం ఉన్న సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కలక్టరేట్ ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయి.
ధరూర్‌లో స్థలఅన్వేషణ
జగిత్యాల కలెక్టర్ కార్యాలయం కోసం పట్టణంలోని ధరూర్ క్యాంపులోని 75 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఇందులో కలక్టరేట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
మారనున్న రూపురేఖలు
ప్రస్తుతం టవర్‌సర్కిల్ నుంచి ఎటు 3 కి.మీ ప్రాంతంలో విస్తరించి ఉంది. 38 వార్డులు ఉండగా 1,00,863 జనాభా కలిగి ఉంది. ప్రస్తుతం మున్సిపాలిటీలో చుట్టూ గ్రామాలైన మోతె, తిప్పన్నపేట, చల్గల్, లింగంపేట, హుస్నాబాద్, పూర్తిస్థాయిలో విలీనం అయ్యే అవకాశాలున్నాయి. దీంతో పట్టణ జనాభా పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా జగిత్యాల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. జిల్లా కేంద్రం కానుండటంతో విద్య, వైద్య సౌకర్యాలూ పెరిగే అవకాశాలు ఉన్నాయి.
చదువుల కోవెలగా..
జగిత్యాల డివిజన్ కేంద్రం ఇప్పటికే చదువుల కోవెలగా పేరుగాంచింది. కొండగట్టులోని నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలతో పాటు పొలాసలో వ్యవసాయ పరిశోధన స్థానం, అగ్రికల్చర్ కాలేజీ, బీఎస్సీ నర్సింగ్ కళాశాలతో పాటు ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలూ ఉన్నాయి. జిల్లా కేంద్రంగా మారితే మరిన్ని కళాశాలు వచ్చే అవకాశాలున్నాయి. జగిత్యాల జిల్లాలో ప్రముఖ కవులు కేవీ.నరేందర్, బీఎస్.రావ¬లు, సంగవేని రవీంద్ర, చరిత్రకారులు జైశెట్టి రమణయ్య వీరు కరీంనగర్ జిల్లాలో ప్రాముఖ్యం సంపాదించారు. వీరు జగిత్యాల ప్రాంతానికి చెందిన వారు. పట్టణంలో ముఖ్యంగా ఖిల్లా పర్యాటక కేంద్రంగా మారనుంది. జగిత్యాలలోని చింతకుంట చెరువును సైతం మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చనున్నారు.
వ్యవసాయం
జగిత్యాల జిల్లా పరిధిలో ముఖ్యంగా వరి ప్రధానమైన పంట. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి నీరు సుమారు 3 లక్షల ఎకరాల్లో సాగునీరు అందుతుంది. ఇక్కడ ప్రధానమైన పంట వరి కావడంతో పాటు పత్తి కూడా ఎక్కువ శాతం పండిస్తుంటారు. ఆరుతడి పంటల్లో మొక్కజొన్న, శెనగ తదితర పంటలు వేస్తుంటారు.
ఆలయాలు
జగిత్యాల జిల్లాలో ప్రముఖ ఆలయాలైన కొండగట్టుతో పాటు ధర్మపురి దేవస్థానం కూడా ఇందులో వస్తుంది. రెండు దేవాలయాలు ప్రధానమైనవి.