distribute money
-
అక్కడ ‘ఓటు’ ప్రలోభాలపర్వం రూ. లక్షకు..!
సాక్షి, బెంగళూరు: స్థానిక సంస్థల కోటాలో 25 సీట్లకు ఎమ్మెల్సీ ఎన్నికల తేదీ సమీపిస్తోంది. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు పడ్డారు. మందు, విందు, చిందులతో తమవైపు తిప్పుకోవడానికి శ్రమిస్తున్నారు. అనేకమంది అభ్యర్థులు టీపీ, జీపీ సభ్యులైన ఓటర్లకు తోటల్లో ఘుమఘమలాడే వంటకాలతో విందు వినోదాలు నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ సభ్యులు ఏ పార్టీ గుర్తు మీద గెలిచిన వారు కాదు. కాబట్టి వారిపై పార్టీ పర్యవేక్షణ ఉండదు. కొందరు సభ్యులు అన్నిపార్టీల విందులకూ హాజరై మజా చేయడం జరుగుతోంది. అందుకే అభ్యర్థులు విందు, డబ్బులు ఇవ్వడమే కాకుండా తమకే ఓటు వేయాలంటూ ఒట్టు పెట్టించుకుంటున్నారు. ఓటుకు రూ.25 వేల ముడుపు ధనవంతులైన అభ్యర్థులు రిసార్టులు, హోంస్టేలు, తోటల్లో గత నాలుగైదు రోజులుగా విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. తటస్థంగా ఉండే కొందరికి ఏదో రకంగా ప్రలోభానికి గురిచేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటుకు రూ. 5 వేల నుంచి రూ. 10 వేల మధ్య ఉన్న ప్రలోభాలపర్వం ఇప్పుడు రూ. లక్షకు చేరుకుంది. ఒక్కో నియోజకవర్గంలో ఓటుకు రూ. 25 వేలు డబ్బులు ఇచ్చేందుకు కూడా వెనుకాడడం లేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఖర్చు పెరిగిపోతోందని అభ్యర్థులు లోలోపల మథనపడుతున్నట్లు సమాచారం. -
పునరావాస పోరాటంలో.. ఓటుకు నోటు వద్దు
దేశం కోసం సర్వం వదులుకున్నారు. ఉన్న ఇంటిని, తిండి పెట్టే భూమిని ప్రభుత్వానికి ఇచ్చేశారు. ప్రత్యామ్నాయంగా పునరావాసం కల్పిస్తానన్న ప్రభుత్వ హామీని నమ్మారు. వంద కిలోమీటర్లకు దూరంగా వచ్చేశారు. అన్నం ముద్దకోసం, గుక్కెడు నీటికోసం అలమటించారు. ప్రభుత్వం పునరావాసానికి ఇచ్చిన జీఓ 1024 అమలు కోసం 49 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. వదిలివచ్చిన నివాసాలు, భూముల్లో షార్ ఏర్పాటై దేశం గర్వించేస్థాయిలో ఓ వైపు ఆనందంపడుతూనే తమ జీవితాలు బాగుపడలేదని దుఃఖిస్తున్నారు. ఓటుకు నోటును తిరస్కరిస్తూ ప్రతి ఎన్నికల్లో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సారి కూడా ఓటుకు నోటును తిరస్కరించారు. తమ సమస్యను పరిష్కరించిన వారికే పట్టం కడుతామంటున్నారు శ్రీపురంధరపురం గ్రామస్తులు. బుచ్చిరెడ్డిపాళెం: జిల్లాలోని శ్రీహరికోట పరిసరప్రాంతాల్లోని భూమధ్యరేఖ వద్ద ప్రభుత్వం షార్‌ను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దాని పరిధిలోని భూములను సేకరించాలని భావించింది. ఈ క్రమంలో అక్కడి వారి భూములను, నివాస స్థలాలను ఇవ్వాలని కోరింది. అందుకు ప్రత్యామ్నాయంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వారికి పునరావాసం ఇస్తానని ప్రకటించింది. పునరావాసంపై 1024 పేరిట జీఓ విడుదల శ్రీహరికోట ప్రాంతంలో నివాసాలు, భూములను ఇచ్చిన వారికి ప్రత్యామ్నాయంగా పునరావాసం, వసతులు కల్పిస్తామని 1970వ సంవత్సరం నవంబరు రెండో తేదీన జీఓ 1024ను విడుదల చేసింది. జిల్లాలోని తాండూరు, రేగడిచెలిక, నెలబల్లి, నెమలిమిట్ట ప్రాంతాల్లో పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకుంది. అక్కడి నుంచి రవాణా చేసేందుకు ఒక్కొక్కరికి రూ.500 ఇచ్చింది. ఆయా ప్రాంతాల్లో నివాసాలకు ఐదు సెంట్ల స్థలం కేటాయిస్తానని తెలిపింది. సేకరించిన భూముల ప్రకారం డ్రైల్యాండ్ అయితే ఐదు ఎకరాలు, వెట్ ల్యాండ్ అయితే రెండు ఎకరాలు ఇస్తానని తెలిపింది. దీంతో పాటుగా ఆయా ప్రాంతాల్లోని భూమిని వారికే తాగునీటి వసతి, దేవాలయాలు, పాఠశాలలు, శ్మశాన భూమి, పశువులకు ఆవాసం తదితరాలకు ఉపయోగిస్తామని పేర్కొంది. శ్రీపురంధరపురంలో జీఓ1024 అమలుపై పోరాటం పునరావాసంలో భాగంగా శ్రీహరికోట నుంచి శ్రీపురంధరపురానికి 200 కుటుంబాలు వచ్చాయి. వీరికి తొలినుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్రీపురంధరపురం ప్రాంతం తొలుత పూర్తిగా అటవీప్రాంతం. ఫారెస్ట్ భూములను ప్రభుత్వం డీ–ఫారెస్ట్‌గా మార్చి పునరావాసులకు అందించింది. అయితే జీఓలో పేర్కొన్న విధంగా ఐదు ఎకరాల మెట్ట భూమిని ప్రజలకు ఇవ్వలేదు. నేటికీ ఎకరా భూమి ఇంకా పునరావాసులకు ఇవ్వాల్సి ఉంది. దీంతో పాటుగా దాదాపు వేయి పశువులు పైగా ఉన్న ఈ ప్రాంతంలో ఆవాసం లేకుండా పోయింది. శ్మశాన భూమి కరువైంది. తాగునీటి వసతి నామ మాత్రంగా మారింది. దీంతో పాటుగా గ్రామంలోని భూమిని బయటప్రాంతాల వారు ఆక్రమించుకున్నారు. వారిపై పాస్‌పుస్తకాలు పొందారు. పునరావాస గ్రామంలో బయటప్రాంతాల వారి ఆక్రమణపై అక్కడి ప్రజలు పోరాడినా రెవెన్యూ, పోలీసు అధికారుల సహకారం ఆక్రమణదారులకు ఉండడంతో పలు ఇబ్బందులు తప్పలేదు. ఓటుకు నోటు వద్దు శ్రీపురంధరపురంలో శాసనసభ ఎన్నికల సమయంలో గ్రామంలోని అందరూ ఒకేమాటపై ఉంటారు. ఓటుకు నోటు వద్దని మూకుమ్మడిగా చెబుతారు. ప్రభుత్వ విడుదల చేసిన జీఓను అమలు చేయాలని కోరుతారు. ఇందులో భాగంగా 2012 ఉప ఎన్నికలను సైతం అక్కడి ప్రజలు వ్యతిరేకించారు. ఎన్నికలు తమకు వద్దని బాయ్‌కాట్ చేశారు. చివరకు రెవెన్యూ అధికారులు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించారు. 2014 ఎన్నికల్లో గెలిచిన కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కూడా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నేటికీ హామీని అమలుచేయలేదు. అందుకే ఈ సారి కూడా అక్కడి ప్రజలు తమ సమస్యను పరిష్కరించిన వారికే మద్దతిస్తామని చెబుతున్నారు. దేశం కోసం అన్నీ వదులుకుని వచ్చాం దేశం కోసం అన్నీ వదులుకుని శ్రీపురంధరపురం వచ్చాం. ఎన్నో కష్టాలు పడ్డాం. పునరావాసం కింద ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు అమలు కాలేదు. – బిడ్డారెడ్డి జర్రారెడ్డి, శ్రీపురంధరపురం ఎకరా భూమిని కేటాయించాలి పునరావాసం కింద ఇవ్వాల్సిన మిగతా ఎకరా భూమి కేటాయించాలి. ప్రభుత్వాన్ని పలుమార్లు కోరాం. అయినా పట్టించుకోలేదు. అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదు. మాకు న్యాయం చేసిన వారికే ఈ సారి ఎన్నికల్లో మద్దతు ఇస్తాం. – కాను బోగిశయనరెడ్డి, శ్రీపురంధరపురం -
పైసాచికం
- టీడీపీ ప్రలోభాల బరితెగింపు - నియోజకవర్గానికి రూ.4 కోట్లు పంపిణీ - ఒక్కరోజులో రూ.50కోట్లకుపైగా మద్యం,డబ్బు ప్రవాహం - పనిలోపనిగా నకిలీ మద్యం, నగదు, చీరలు పంపకాలు సాక్షి,విశాఖపట్నం: ఓడిపోతామని నిర్దారణకు వచ్చేసిన టీడీపీ జిల్లా లో మంగళవారం అడ్డగోలుగా రెచ్చిపోయింది. ప్రలోభాలతో బరితెగించేసింది. డబ్బు,మద్యం పంపకాలతో పేట్రేగిపోయింది. ఓటర్లు ఎలాగూ తమవైపు లేరని తేటతెల్లమవడంతో నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థు లు కోట్లు కుమ్మరించేశారు. ఎలాగూ అనుకూల పవనాలు వీచవని ఖాయమవడంతో చివరి ప్రయత్నంగా డబ్బును మంచినీళ్లప్రాయంగా విసిరేసింది. ఒక్కరోజులోనే జిల్లా అంతటా రూ.50కోట్లకుపైగా పంపకాలు చేసింది. ఆదరణ లేక అగచాట్లు టీడీపీ డబ్బు,మద్యం,చీరలు,సైకిల్ వంటి రకరకాల ఎరలను ఆశ్రయించి ఒక్క మంగళవారం రాత్రి నియోజకవర్గానికి రూ.3 కోట్ల చొప్పున రహస్యంగా పంపకాలు జరిపింది. అనకాపల్లిలో పీలాగోవింద్కు విజయంపై ఆశలు లేకపోవడంతో ఇప్పటివరకు రూ.20కోట్లు ఖర్చుచేయగా, మంగళవారం రాత్రి రూ.3కోట్ల వరకు డబ్బు,మద్యం,చీరలు పంపిణీ చేశారు. పాయకరావుపేటలో వంగలపూడి అనితకు నియోజకవర్గంలో చుక్కెదురవడంతో క్యాడర్,ఓటర్లకు రూ.2.5కోట్ల విలువైన జాకెట్లు,పట్టీలు,నగదు,మద్యం పంచినట్లు సమాచారం. నర్సీపట్నంలో ఎదురీదుతున్న అయ్యన్నపాత్రుడు ఇప్పటివరకు రూ.5కోట్లకుపైగా ఖర్చుచేయగా, మంగళవారం రూ.3కోట్ల విలువైన మద్యం,సైకిళ్లు,చీరలు,క్రికెట్ కిట్లు పంపించారు. యలమంచిలి అభ్యర్థి రాత్రికిరాత్రే అనుచరులతో మద్యం,డబ్బు,పట్టీలు పంపకాలు చేయించారని పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. అరకులో సిట్టింగ్ ఎమ్మెల్యే సోమ ఓటుకు రూ.400, నాటుసారా, జీలుగుకళ్లు పంపిణీ చేయించారు. పాడేరులో బీజేపీ అభ్యర్థి లోకులగాంధీకూడా భారీగా మద్యం నిల్వలను పంచారు. ఇక్కడ పోలీసు నిఘా లేకపోవడంతో దాచిన సరుకంతా పంపిణీ చేశారు. మాడుగుల అభ్యర్థి రామానాయుడు ముక్కుపుడకలు, కులసంఘాలు, విద్యార్థులకు ఓటుకు రూ.500చొప్పున నేరుగా ఇంటింటికీ వెళ్లి అనుచరులద్వారా చేరవేయించినట్లు సమాచారం. చోడవరంలో రాజు(టీడీపీ) పరిస్థితి ఘోరంగా మారడంతో రాత్రి రూ.2కోట్లకుపైగా విలువైన మద్యం,నగదు కూడా పంపిణీ చేశారు. చీకటి పంపకాల్లో పనిలోపనిగా ఓటర్లకు నకిలీనోట్లు కూడా అందించి మోసం చేశారు. నేరుగా ఇళ్లకే పంపిణీ... గాజువాకలో పల్లా శ్రీనివాస్ ఓటుకు రూ.1000నుంచి రూ.1200చొప్పున పంచారు. డ్వాక్రామహిళలు,కులసంఘాలకూ రూ.5లక్షల చొప్పున చేరవేశారు. పెందుర్తిలో బండారు(టీడీపీ) వివిధ గ్రామాల్లో ఉంచిన రూ.2కోట్లకుపైగా విలువైన మద్యం,డబ్బును ఫోన్లద్వారా వివిధ చిరునామాలకు పంపించి ఓటర్లను తనవైపునకు తిప్పుకునే ప్రయత్నాలు తీవ్రం చేశారు. భీమిలిలో గంటా ఓటమి ఖాయమైపోవడంతో జిల్లాలో అందరికంటే ఎక్కువగా రూ.4కోట్లకుపైగా మద్యం,డబ్బు, చీరలు,క్రికెట్ కిట్లు శివారు ప్రాంతాల నుంచి అనుచరుల ద్వారా ఇళ్లకు తరలించారు. మరికొన్ని బుధవారం తెల్లవారుఝామునే పంపకాలకు సిద్ధంచేసినట్లు సమాచారం. విశాఖ తూర్పులో వెలగపూడి ఓటుకు వెయ్యి,మద్యంతో రూ.1.5కోట్ల వరకు పంపిణీకి తెరతీశారు. చివరకు పోలీసులకూ ఇందులో కొంత ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. విశాఖ ఉత్తరంలో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు 70శాతం ప్రలోభాలు పూర్తిచేయగా, రూ.2.5కోట్లు విలువైన మద్యం,డబ్బు,పట్టీలు పంపిణీ చేయించారని సొంతపార్టీ నేతలే వివరించారు. దక్షిణంలో వాసుపల్లి బరితెగించి బియ్యంతోపాటు తీరప్రాంత గ్రామాల్లో మద్యం,ఓటుకు రూ.500చొప్పున వెదజల్లారు. పశ్చిమంలో గణబాబు ఓటమి ఖరారైపోవడంతో ఏదోలా ఒడ్డుకు చేరుకునేందుకు రూ.1.2 కోట్ల విలువైన బట్టల దుకాణం టోకెన్లు, మద్యాన్ని పారించేశారు. అన్ని నియోజకవర్గాల్లో సుమారుగా రూ.40కోట్ల కుపైగా ప్రలోభాల విశ్వరూపాన్ని టీడీపీ ప్రదర్శించింది.