పైసాచికం
- టీడీపీ ప్రలోభాల బరితెగింపు
- నియోజకవర్గానికి రూ.4 కోట్లు పంపిణీ
- ఒక్కరోజులో రూ.50కోట్లకుపైగా మద్యం,డబ్బు ప్రవాహం
- పనిలోపనిగా నకిలీ మద్యం, నగదు, చీరలు పంపకాలు
సాక్షి,విశాఖపట్నం: ఓడిపోతామని నిర్దారణకు వచ్చేసిన టీడీపీ జిల్లా లో మంగళవారం అడ్డగోలుగా రెచ్చిపోయింది. ప్రలోభాలతో బరితెగించేసింది. డబ్బు,మద్యం పంపకాలతో పేట్రేగిపోయింది. ఓటర్లు ఎలాగూ తమవైపు లేరని తేటతెల్లమవడంతో నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థు లు కోట్లు కుమ్మరించేశారు. ఎలాగూ అనుకూల పవనాలు వీచవని ఖాయమవడంతో చివరి ప్రయత్నంగా డబ్బును మంచినీళ్లప్రాయంగా విసిరేసింది. ఒక్కరోజులోనే జిల్లా అంతటా రూ.50కోట్లకుపైగా పంపకాలు చేసింది.
ఆదరణ లేక అగచాట్లు
టీడీపీ డబ్బు,మద్యం,చీరలు,సైకిల్ వంటి రకరకాల ఎరలను ఆశ్రయించి ఒక్క మంగళవారం రాత్రి నియోజకవర్గానికి రూ.3 కోట్ల చొప్పున రహస్యంగా పంపకాలు జరిపింది. అనకాపల్లిలో పీలాగోవింద్‌కు విజయంపై ఆశలు లేకపోవడంతో ఇప్పటివరకు రూ.20కోట్లు ఖర్చుచేయగా, మంగళవారం రాత్రి రూ.3కోట్ల వరకు డబ్బు,మద్యం,చీరలు పంపిణీ చేశారు. పాయకరావుపేటలో వంగలపూడి అనితకు నియోజకవర్గంలో చుక్కెదురవడంతో క్యాడర్,ఓటర్లకు రూ.2.5కోట్ల విలువైన జాకెట్లు,పట్టీలు,నగదు,మద్యం పంచినట్లు సమాచారం.
నర్సీపట్నంలో ఎదురీదుతున్న అయ్యన్నపాత్రుడు ఇప్పటివరకు రూ.5కోట్లకుపైగా ఖర్చుచేయగా, మంగళవారం రూ.3కోట్ల విలువైన మద్యం,సైకిళ్లు,చీరలు,క్రికెట్ కిట్లు పంపించారు. యలమంచిలి అభ్యర్థి రాత్రికిరాత్రే అనుచరులతో మద్యం,డబ్బు,పట్టీలు పంపకాలు చేయించారని పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. అరకులో సిట్టింగ్ ఎమ్మెల్యే సోమ ఓటుకు రూ.400, నాటుసారా, జీలుగుకళ్లు పంపిణీ చేయించారు. పాడేరులో బీజేపీ అభ్యర్థి లోకులగాంధీకూడా భారీగా మద్యం నిల్వలను పంచారు. ఇక్కడ పోలీసు నిఘా లేకపోవడంతో దాచిన సరుకంతా పంపిణీ చేశారు.
మాడుగుల అభ్యర్థి రామానాయుడు ముక్కుపుడకలు, కులసంఘాలు, విద్యార్థులకు ఓటుకు రూ.500చొప్పున నేరుగా ఇంటింటికీ వెళ్లి అనుచరులద్వారా చేరవేయించినట్లు సమాచారం. చోడవరంలో రాజు(టీడీపీ) పరిస్థితి ఘోరంగా మారడంతో రాత్రి రూ.2కోట్లకుపైగా విలువైన మద్యం,నగదు కూడా పంపిణీ చేశారు. చీకటి పంపకాల్లో పనిలోపనిగా ఓటర్లకు నకిలీనోట్లు కూడా అందించి మోసం చేశారు.
నేరుగా ఇళ్లకే పంపిణీ...
గాజువాకలో పల్లా శ్రీనివాస్ ఓటుకు రూ.1000నుంచి రూ.1200చొప్పున పంచారు. డ్వాక్రామహిళలు,కులసంఘాలకూ రూ.5లక్షల చొప్పున చేరవేశారు. పెందుర్తిలో బండారు(టీడీపీ) వివిధ గ్రామాల్లో ఉంచిన రూ.2కోట్లకుపైగా విలువైన మద్యం,డబ్బును ఫోన్లద్వారా వివిధ చిరునామాలకు పంపించి ఓటర్లను తనవైపునకు తిప్పుకునే ప్రయత్నాలు తీవ్రం చేశారు. భీమిలిలో గంటా ఓటమి ఖాయమైపోవడంతో జిల్లాలో అందరికంటే ఎక్కువగా రూ.4కోట్లకుపైగా మద్యం,డబ్బు, చీరలు,క్రికెట్ కిట్లు శివారు ప్రాంతాల నుంచి అనుచరుల ద్వారా ఇళ్లకు తరలించారు.
మరికొన్ని బుధవారం తెల్లవారుఝామునే పంపకాలకు సిద్ధంచేసినట్లు సమాచారం. విశాఖ తూర్పులో వెలగపూడి ఓటుకు వెయ్యి,మద్యంతో రూ.1.5కోట్ల వరకు పంపిణీకి తెరతీశారు. చివరకు పోలీసులకూ ఇందులో కొంత ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. విశాఖ ఉత్తరంలో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు 70శాతం ప్రలోభాలు పూర్తిచేయగా, రూ.2.5కోట్లు విలువైన మద్యం,డబ్బు,పట్టీలు పంపిణీ చేయించారని సొంతపార్టీ నేతలే వివరించారు.
దక్షిణంలో వాసుపల్లి బరితెగించి బియ్యంతోపాటు తీరప్రాంత గ్రామాల్లో మద్యం,ఓటుకు రూ.500చొప్పున వెదజల్లారు. పశ్చిమంలో గణబాబు ఓటమి ఖరారైపోవడంతో ఏదోలా ఒడ్డుకు చేరుకునేందుకు రూ.1.2 కోట్ల విలువైన బట్టల దుకాణం టోకెన్లు, మద్యాన్ని పారించేశారు. అన్ని నియోజకవర్గాల్లో సుమారుగా రూ.40కోట్ల కుపైగా ప్రలోభాల విశ్వరూపాన్ని టీడీపీ ప్రదర్శించింది.