ఓటమి గుబులుతో విలవిలలాడుతోన్న టీడీపీ ఓటర్లను ప్రలోభపర్చుకోవడానికి రకరకాల ఎత్తులు ప్రయోగిస్తోంది. డబ్బు, మద్యం రూపంలోనైనా ఎరవేసి తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
ఓటమి గుబులుతో విలవిలలాడుతోన్న టీడీపీ ఓటర్లను ప్రలోభపర్చుకోవడానికి రకరకాల ఎత్తులు ప్రయోగిస్తోంది. డబ్బు, మద్యం రూపంలోనైనా ఎరవేసి తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. గడువు సమీపిస్తుండటంతో పార్టీ అభ్యర్థులు బరితెగింపులకు దిగుతున్నారు. అర్ధరాత్రి వేళ విందులు, వినోదాలు ఏర్పాటుచేయడం, రాత్రి పదకొండు తర్వాత నేరుగా నగదు పంచడం..గ్రామస్తులు, కుల సంఘాల ఆర్థిక అవసరాలు తీర్చడం ఇలా రకరకాల విన్యాసాలు చేస్తుండగా, మద్యం,నగదును రప్పించి రహస్య ప్రాంతాల్లో నిల్వ ఉంచారని సమాచారం.
- సాక్షి, విశాఖపట్నం
భీమిలి, నర్సీపట్నం, యలమంచిలి, మాడుగుల, చోడవరం,విశాఖతూర్పు,విశాఖ దక్షిణం, పశ్చిమం, అనకాపల్లి, పాయకరావుపేట, గాజువాకలో ఇప్పటికే టీడీపీ అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి అడ్డంగా తలుపులు తెరిచేశారు. వైఎస్సార్‌సీపీ నుంచి తీవ్రమైన పోటీ ఉండడం, గెలుస్తామోలేదో తెలి యని పరిస్థితి నెలకొనడంతో ఈస్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ప్రచారం కన్నా ప్రలోభాలనే నమ్ముకుంటున్నారు. గత వారం నుంచి డబ్బు, మద్యం, చీరలు, జాకెట్లు, ముక్కుపుడకలు, బియ్యం అనుచరులతో పంచుతున్నారు. అనుచరులను గ్రూపులుగా విభజించి కుల సంఘాల,డ్వాక్రాసంఘాలకు వీటిని చేరవేస్తున్నారు.
ఇప్పటివరకు జిల్లాలో రూ.2కోట్ల వరకు పట్టుబడగా, అందులో ఒక్క భీమిలి నియోజకవర్గంలోనే రూ.31లక్షలు పట్టుబడ్డాయి. ఇక్కడ వైఎస్సార్‌సీపీ నుంచి తీవ్రపోటీ, తిరుగుబాటు అభ్యర్థి అనిత సకురు రూపంలో తలనొప్పులు ఉండడంతో గంటా ఎంత ఖర్చైనా పెట్టడానికి సిద్ధపడుతున్నారు. రెండురోజుల తర్వాత నగదు,మద్యం పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. యలమంచిలిలో ఇంటిపోరుతో వెనుకబడిపోయిన పంచకర్ల కూడా మంచినీళ్లప్రాయంలా డబ్బు వెదజల్లుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఇంతవరకు వివిధ తనిఖీల్లో రూ.25లక్షలు పట్టుబడ్డంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనకాపల్లిలో స్థానికేతర అభ్యర్థికి నిరసనసెగ ఎక్కువగా
ఉండడంతో ఈయనకూడా డబ్బు,మద్యాన్నే నమ్ముకున్నారు. ఇక్కడ రూ.25లక్షలు పట్టుబడగా, ఇటీవల రహస్యప్రాంతానికి కోట్లలో నగదు, మద్యం నిల్వలు తరలించారని పార్టీలో అంతర్గత సమాచారం. నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు పరిస్థితి కలవరంగా మారింది. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈసారి ఎలాగైనా గెలవాలనే కోరికతో ఆయన అంతులేకుండా ఖర్చు పెడుతున్నారు.
ఇటీవల ఇక్కడ పంపిణీకి సిద్ధంగా ఉంచిన చీరలు సైతం దొరికాయి. మద్యం నిల్వలను ఇప్పటికే గుట్టుచప్పుడుకాకుండా కొందరు అనుచరుల ఇళ్లల్లో నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది. చోడవరం,మాడుగుల,పాయకరావుపేట,విశాఖదక్షిణం,పశ్చిమం,గాజువాక నియోజకవర్గాల్లో ఇప్పటికే బియ్యం,మద్యం పంపిణీలు ఊపందుకున్నాయి.
ఈనియోజకవర్గాల అభ్యర్థులకు పార్టీ నుంచి సహకారం లేకపోవడంతో ప్రచారంలో తీవ్రంగా వెనుకబడిపోయారు. చివరి అస్త్రంగా మద్యం,డబ్బును నమ్ముకుని ఇప్పటికే పంపకాలు చేస్తున్నారు. మే 2 నుంచి రహస్యప్రాంతాలకు డబ్బు,మద్యం,చీరలు తరలించి అక్కడినుంచి అనుచరులు,క్యాడర్ ద్వారా అర్థరాత్రి ఇంటింటికి చేర్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల పరిశీలకుల కంటబడకుండా ఉండేందుకు వృద్ధులు,చిన్నపిల్లలు,మహిళలను వీటికోసం వాడుకునేందుకు కొందరు అభ్యర్థులు వ్యుహాలు కూడా సిద్ధంచేశారు.