కరుణాకరరెడ్డిపై టీడీపీ అభ్యర్థి దాడి
తిరుపతిలో పోలింగ్ రోజూ టీడీపీ వారి దాష్టీకం కొనసాగింది. ప్రచార పర్వంలో డబ్బు, మద్యంతో వీరు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నించడం తెలిసిందే. పోలింగ్ రోజు ఏకంగా బూత్‌ల వద్ద వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. దీంతో ఇరు పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులూ అక్కడకు చేరుకున్నారు. నేతల మధ్య వాగ్వాదం జరగడంతో కరుణాకరరెడ్డిపై వెంకటరమణ చేయి చేసుకున్నారు. పోలీసులు అభ్యర్థులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: తిరుపతి ఎమ్మెల్యే స్థానానికి వైఎస్‌ఆర్ సీపీ తరఫున పోటీ చేస్తున్న భూమన కరుణాకరరెడ్డిపై బుధవారం టీడీపీ అభ్యర్థి వెంకటరమణ చేయి చేసుకున్నారు. దీంతో రాజీవనగర్ పంచాయతీ జీవకోనలో ఉద్రిక్తత నెలకొంది.
వివరాలిలా.. బుధవారం ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓటింగ్ సరళి వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా ఉండటంతో టీడీపీ వారు అసహనానికి గురయ్యారు. దీంతో పోలింగ్ బూత్‌ల వద్ద హల్‌చల్ చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో తిరుపతి సత్యనారాయణపురంలోని ప్రాథమికపాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నాయకులను వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా వారంతా వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు.
ఈ దాడిలో ఇద్దరు వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అభ్యర్థులు భూమన కరుణాకరరెడ్డి, ఎం.వెంకటరమణ అక్కడికి చేరుకున్నారు. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమికూడారు. దీంతో నేతల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం టీడీపీ అభ్యర్థి ఎం. వెంకటరమణ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ తన వెంట పదిమందిని తీసుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు.
కార్యకర్తలను పోలింగ్ కేంద్రంలోకి తీసుకురావడంపై కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. పోలీసులు కూడా స్పందించి వెంకటరమణకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం రాజీవ్‌నగర్ పంచాయతీ జీవకోనలోని గురుకృప పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి అభ్యర్థులు ఇద్దరూ వేర్వేరుగా వెళ్లారు. లోపల దాదాపు 30 నిమిషాలు పాటు ఇరువురు అభ్యర్థులు పోలింగ్‌ను పరిశీలించారు. అదే సమయంలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున బయట గుమికూడారు.
సత్యనారాయణపురంలో తమ కార్యకర్తలపై దాడి ఎలా చేయిస్తారంటూ స్థానిక టీడీపీ నాయకులు అన్నా రామచంద్రయ్య, అన్నా రామకృష్ణను వైఎస్‌ఆర్ సీపీ నాయకులు మబ్బు చెంగారెడ్డి, పెంచలయ్య ప్రశ్నించారు. తాము దాడి చేయలేదని, ఎవరని ప్రశ్నించగా వారు పారిపోయారంటూ టీడీపీ నేతలు సమాధానం చెప్పారు. ఈ వ్యవహారంపై మాటామాటా పెరిగి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి తీవ్ర స్థాయిలో వాగ్వాదాలకు దిగారు. ఒక దశలో ఘర్షణకు దిగారు. పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది.
ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. ఈ విషయం తెలిసి వెంకటరమణను కరుణాకరరెడ్డి నిలదీశారు. ఇలా దాడులు చేయడం తగదన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన కరుణాకరరెడ్డిపై చేయి చేసుకున్నారు. అభ్యర్థులు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. రెండుపార్టీల కార్యకర్తలు తిరుపతి ఎస్పీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తగా వ్యవ హరించారు. చివరకు ఇద్దరినీ విడుదల చేశారు.