బెల్టు షాపులకు పచ్చజెండా | Approved belt shops | Sakshi
Sakshi News home page

బెల్టు షాపులకు పచ్చజెండా

Published Tue, Sep 9 2014 1:13 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

బెల్టు షాపులకు పచ్చజెండా - Sakshi

బెల్టు షాపులకు పచ్చజెండా

  • అవి మా వాళ్ల షాపులు..వాటిజోలికి వెళ్లొద్దు
  •  అల్టిమేటం జారీ చేసిన టీడీపీ పెద్దలు
  •  ఓ ఉన్నతాధికారిశల్య సారథ్యం
  •  దాడులు నిలిపివేసిన ఎక్సైజ్ శాఖ
  • సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:బెల్టు దుకాణాలను మూయించమని ప్రభుత్వం చెప్పడంతో జిల్లాలో ఎక్సైజ్ అధికారులు తెగ హడావుడి చేశారు.  ఈ ఏడాది జూన్ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని బెల్టు దుకాణాలను గుర్తించి దాడులు చేశారు. ఆగస్టు 31నాటికి జిల్లాలో 325 బెల్టు దుకాణాలను మూయించివేశారు. 340 మందిని అరెస్టు చేశారు. కానీ అంతలోనే...
     
    శివాలెత్తిన ప్రజాప్రతినిధులు

    మద్యం వ్యాపారమే ప్రధాన ఆదాయవనరుగా ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధులు రంగ ప్రవేశం చేశారు. బెల్టు దుకాణాల వ్యవస్థకు కర్త,కర్మా అంతా తానై వ్యవహరిస్తున్న విశాఖ నగరంలోని ఓ ప్రజాప్రతినిధి అయితే ఎక్సైజ్ అధికారులపై ఒంటికాలిపై లేచారు.  ‘నాకు చెప్పకుండా నా నియోజకవర్గంలో దాడులు ఎలా చేస్తారు?... ఆ షాపులు ఎవరివో ముందు కనీసం తెలుసుకోరా? ఎన్నో ఏళ్లుగా మా వాళ్లతో వాటిని నడిపిస్తున్నాను. నేను ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడే నా బెల్టు షాపుల జోలికి ఎవ్వరూ రాలేకపోయారు.

    అలాంటిది మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా షాపులపై దాడులు చేస్తారా?’అని ఆయన శివాలెత్తిపోయారు. ‘వెంటనే దాడులు ఆపండి. లేకపోతే మీ డిపార్టుమెంటులో ఒక్కరు కూడా ఇక్కడ పనిచేయలేరు’అని ఆయన అల్టిమేటం జారీ చేశారు. రూరల్ జిల్లాలో ప్రముఖ వ్యాపార కేంద్రం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధి కూడా అదే రీతిలో అధికారులపై నిప్పులు చెరిగారు. మద్యం సిండికేట్‌లో ఆయనకు కూడా భాగస్వామ్యం ఉండటమే ఇందుకు కారణం. వీరిద్దరే కాదు జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లోని  అధికార పారీ ద్వితీయశ్రేణి నేతలు కూడా ఎక్సైజ్ అధికారులపై విరుచుకుపడ్డారు.
     
    ఉన్నతాధికారే సూత్రధారి : ఈ తతంగానికి ఎక్సైజ్ శాఖలోని ఓ కీలక అధికారే ఇందుకు సూత్రధారిగా వ్యవహరించారన్నది విస్మయకర వాస్తవం. ప్రభుత్వం చెప్పినట్లుగా ముందుగా తన కింది అధికారులు, సిబ్బందితో ఆయన బెల్టు దుకాణాలపై దాడులు చేయించారు. అనంతరం అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో మాట్లాడి కథ నడిపించారు. ‘మీరు ఆగ్రహం వ్యక్తం చేయండి. అదే సాకుగా చూపించి నేను దాడులు నిలిపివేస్తాను. దాంతో డిపార్టుమెంటులో నాకూ చెడ్డపేరు రాదు.

    మన  పని అయిపోతుంది’అని ఆయనే మార్గనిర్దేశం చేసినట్లు సమాచారం. అనుకున్న విధంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధలు చిందులు తొక్కగానే ఆయన దాడులను నిలిపివేయించారు. ‘డిపార్టుమెంటులో సిబ్బంది బదిలీల ప్రక్రియ మొదలైంది. అది పూర్తయిన తరువాత మళ్లీ దాడులు కొనసాగించొచ్చు’అనే అంశాన్ని వ్యూహాత్మకంగా  తెరపైకి తెచ్చారు. దాంతో కిందిస్థాయి అధికారలు, సిబ్బందిలో కూడా నిరుత్సాహం ఆవహించింది. తాము కోరుకున్న స్థానాల్లో పోస్టింగుల కోసం వారంతా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేయడంలో నిమగ్నమయ్యారు.
     
    దాడులు నిలిపివేసిన ఎక్సైజ్ శాఖ : అటు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల హెచ్చరికలు... ఇటు తమ ఉన్నతాధికారే శల్య సారథ్యంతో ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది హడలెత్తిపోయారు. దాంతో ఈ నెల 1 నుంచి బెల్టు దుకాణాలపై దాడులను అనధికారికంగా నిలిపివేశారు.  జిల్లాలో ఇంకా దాడుల చేయాలని గుర్తించిన బెల్టు దుకాణాలు దాదాపు 400కుపైగా ఉన్నాయి. కానీ వాటి జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. విశాఖ నగరంలో ఒక్క ఆరిలోవ పరిసర ప్రాంతాల్లోనే  10వరకు బెల్టు దుకాణాలను గుర్తించినా వాటిపై దాడులు చేసేందుకు సాహసించలేకపోతున్నారు.

    విశాఖ- భీమిలి బీచ్ రోడ్డులో మరో 10 బెల్టు దుకాణాలనకు పచ్చజెండా ఊపేశారు.  అదే విధంగా అనకాపల్లి నియోజకవర్గంలో ఏకంగా 50 బెల్టు దుకాణాలను చూసీచూడనట్లు వదిలేశారు. జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలతో జిల్లాలో ఎక్సైజ్ శాఖ మొత్తం టీడీపీ ప్రజాప్రతినిధుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది.  బెల్టు దుకాణాలను మూయించివేస్తామన్న టీడీపీ ప్రభుత్వ విధానం ఆచరణ అపహాస్యంగా మారిపోయిది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement