సంకల్పానికి పేదరికం అడ్డుకాదు
- మేధావులంతా పేదరికం నుంచి వచ్చిన వారే
- పేద విద్యార్థులకు సాయం చేస్తా
- ఎస్పీ రెమా రాజేశ్వరి నస్కల్ కస్తూర్బా
- పాఠశాలలో విద్యార్థినులకు దుప్పట్ల పంపిణీ
పరిగి : సంకల్పం గట్టిదైతే చదువుకునేందుకు పేదరికం అడ్డుకాదని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. గురువారం ఆమె మండలంలోని నస్కల్ కస్తూర్బా పాఠశాలకు చెందిన 200 మంది విద్యార్థినులకు రగ్గులు పంపిణీ చేశారు. చేవెళ్ల సీఐ ఉపేందర్ స్నేహితుడు, వ్యాపారవేత్త ప్రకాష్ వితరణగా ఇచ్చిన రూ. 50 వేల విలువ చేసే రగ్గులను ఎస్పీతో పాటు డీఎస్పీ రంగారెడ్డి విద్యార్థినులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. తానూ 15 కిలో మీటర్లు నడిచి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలోనే చదివానన్నారు. పేదలకు సాయం చేసేందుకు తాను ఎప్పటికీ ముందుంటారని తెలిపారు. అబ్దుల్ కలాం, నెల్సన్ మండేలా, అబ్రహాంలింకన్ లాంటి ఎందరో మేధావులు పేదరికం నుంచి వచ్చిన వారేనని ఆమె గుర్తు చేశారు. అవగాహన ద్వారా సమాజంలోని మూఢ నమ్మకాలను పారదోలదామని పిలుపునిచ్చారు. నేటికీ బాలకార్మికులు పనుల్లో మగ్గుతుండడం, బాల్య వివాహాలు కొనసాగుతుండటం బాధకరమన్నారు.
అనంతరం డీఎస్పీ రంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగుతుందని ఎవరైనా ఎలాంటి ఆపదలోనైనా జంకులేకుండా పోలీసులను సంప్రదించాలన్నారు. దాత ప్రకాష్ మాట్లాడుతూ చలికి వణికి పోతున్నారంటూ పేపర్లలో వచ్చిన వార్తలతో సీఐ ఉపేందర్ సూచనల మేరకు రగ్గులను వితరణ చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో సీఐ ఉపేందర్, ఎస్ఐ నగేష్, ఎంఈఓ అంజిలయ్య, కస్తూర్బా స్పెషల్ ఆఫీసర్ పుష్పలత, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.