అరకోటి నిధులు మట్టిపాలు..!
– రైతులకందని భూసార పరీక్ష ఫలితాలు
– ఏడీఏ, ఏఓ కార్యాలయాల్లో సాయిల్హెల్త్ కార్డులు
– హడావుడే తప్ప.. ఆచరణ శూన్యం
కర్నూలు(అగ్రికల్చర్): భూసార పరీక్షలు తప్పనిసరి అంటూ ఊదరగొట్టిన వ్యవసాయ శాఖ.. పరీక్ష ఫలితాలను రైతులకు చేరవేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఖరీఫ్ సీజన్ మొదలై 50 రోజులు గడిచినా ఇప్పటి వరకు సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేయలేదు. జిల్లాలో ఇప్పటికే దాదాపు 2.20 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ఈ పంటలు 20 నుంచి 40 రోజుల దశలో ఉన్నాయి. పైర్లలో ప్రస్తుతం పలు సూక్ష్మ పోషక లోపాలు ఉత్పన్నం అవుతున్నాయి. భూమిలో సూక్ష్మ పోషకాలైన∙బోరాన్, జింక్, ఐరన్, మెగ్నీషియంలు ఏ స్థాయిలో ఉన్నాయి.. ఎక్కువగా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర విషయాలు భూసార పరీక్షల వల్ల తెలుస్తాయి. సకాలంలో రైతులకు ఈ ఫలితాలు చేరితే పంటల్లో ఏర్పడే పోషక లోపాలను సవరించుకునే అవకాశం ఉంది. ఏరువాక సందర్భంగా అక్కడక్కడ కొంతమందికి భూసార పరీక్ష ఫలితాలకు సంబంధించిన కార్డులను పంపిణీ చేశారు. తర్వాత పట్టించుకున్న దాఖలాలు లేవు. భూసార పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అరకోటికిపైగా ఖర్చు చేసింది. ఈ నిధులన్నీ మట్టిపాలయ్యాయి.
ఏడీఏ, ఏఓ కార్యాలయాల్లో కార్డులు..
ఈ ఏడాది 68,098 మట్టి పరీక్షలు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా తీసుకుంది. ఇందుకోసం 68,535 మట్టి నమూనాలు సేకరించారు. వీటిని కర్నూలు, ఎమ్మిగనూరు, డోన్, నంద్యాలలోని భూసార పరీక్ష కేంద్రాలకు పరీక్షించారు. ఒక మట్టి నమూనా పరీక్షలు చుట్టుపక్కల భూములకూ వర్తిస్తాయి. ఈ ప్రకారం జిల్లాలో 2 లక్షల మంది రైతులకు భూమి ఆరోగ్య స్థితి కార్డులు (సాయిల్ హెల్త్‌కార్డులు) పంపిణీ చేయాల్సి ఉంది. ఈ సారి ఈ కార్డులను ప్రత్యేకంగా ల్యామినేషన్ చేయించి పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు 80 వేల కార్డులు ప్రింటు వేయించి, ల్యామినేషన్ చేయించి వాటిని ఏడీఏలకు పంపారు. అక్కడి నుంచి మండల వ్యవసాయ అధికారులు తీసుకెళ్లి రైతులకు పంపిణీ చేయాల్సింది. భూసార పరీక్షలను ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రం ఏడీఏ శేషారెడ్డి పర్యవేక్షిస్తారు. ఒక్కో కార్డుకు దాదాపు రూ.10 వ్యయం చేసి ముద్రించి ల్యామినేషన్ చేయించారు. అయితే ఇవి ఏడీఏ, ఏఓ కార్యాలయాల్లో మూలకు పడిఉన్నాయి. ఖరీఫ్ మొదలై 50 రోజులు దాటినా మట్టిపరీక్ష ఫలితాలు జిల్లా మొత్తం మీద వెయ్యి మందికి కూడా చేరలేదు.
నిధులు వ«థా..
ఒక్క భూసార పరీక్షకు వ్యవసాయ శాఖ రూ.32 ఖర్చు చేస్తుంది. 68,535 మట్టి పరీక్షలకు రూ.21.93 లక్షలు ఖర్చు చేసింది. ఒక పరీక్షకు కూడా మూడు కార్డులు తయారు చేసి రైతులకు పంపిణీ చేయాలి. ఇలా కార్డుల ముద్రణ ల్యామినేషన్‌కు రూ.15 ప్రకారం ఖర్చు చేస్తోంది. ఇందుకోసం రూ.30 లక్షలు ఖర్చు చేస్తోంది. మొత్తంగా భూసార పరీక్షల కోసం జిల్లాలో రూ.51.93 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇంత ఖర్చుపెట్టి పరీక్షలు చేసి, కార్డులు ముద్రించి, ల్యామినేషన్ చేయించిన వాటిని రైతులకు సకాలంలో చేర్చితేనే ఫలితం దక్కినట్లు. అయితే ఇవి రైతులకు చేరడం లేదు. ఈ ఏడాదే కాదు. ప్రతి ఏటా ఇదే తంతు నడుస్తోంది. భూసార పరీక్షలను ప్రభుత్వం చేస్తున్న నిధుల వ్యయం బూడిదలో పోసిన పన్నీరులా అవుతోంది.
భూ ఆరోగ్య స్థితి కార్డులు పంపతున్నాం: శేషారెడ్డి, ఏడీఏ ఎమ్మిగనూ, భూసార పరీక్ష కేంద్రం
ఈ ఏడాది 68,535 మట్టి పరీక్షలు చేశాం. ఒక పరీక్షకు మూడు కార్డులను ముద్రిస్తున్నాం. ఒక పరీక్షకు మూడు కార్డుల రూపంలో రైతులకు పంపిణీ చేస్తున్నాం. కార్డులు ప్రింట్ తీసి ల్యామినేషన్ చేయించి ఏడీఏలకు పంపుతున్నాం. ఇప్పటి వరకు 82 వేల కార్డులు పంపాం. ఏడీఏల నుంచి ఏఓలు తీసుకెళ్లి రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది.