పేదలపై పామాయిల్ భారం
కె.గంగవరం, న్యూస్‌లైన్ : ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ లేదనే సాకుతో పేదలకు రాయితీలో చౌకధరల దుకాణాల ద్వారా అందించే పామాయిల్ పంపిణీని నిలిపివేశారు. ఏప్రిల్, మే నెలల్లో వారికి పామాయిల్ పంపిణీ కాలేదు. దాంతో అధికరేట్లకు బయటమార్కెట్లో పామాయిల్‌ను కార్డుదారులు కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. మండలంలో 35 వేలమంది లబ్ధిదారులు ఉన్నారు. కిలో పామాయిల్ రాయితీపై రూ. 40కు లభిస్తుండగా బహిరంగ మార్కెట్లో రూ.60 నుంచి రూ.70 అవుతోంది. దాంతో కిలోకు రూ. 20 నుంచి రూ. 30 వరకు పేదలపై అదనపు భారం పడడంతో వారు విలవిల్లాడుతున్నారు.
రెండు నెలల పాటు పామాయిల్ పంపిణీ నిలిపివేసిన ప్రభుత్వం జూన్‌లో కూడా అందించే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రప్రభుత్వం రాయితీ పామాయిల్‌ను రాష్ట్రాలకు సరఫరా చేయకపోవడంతోనే లబ్ధిదారులు ఆయిల్ పంపిణీ జరగలేదు. మండలంలో సుమారు 35 వేల మంది లబ్ధిదారులకు నెలకు కిలో చొప్పున పామాయిల్ పంపిణీ చేయాల్సి ఉంది. ఉన్నతాధికారులు రెండు నెలలుగా ఎన్నికల విధుల్లో ఉండడం, రాష్ట్రానికి రావల్సిన కోటాపై సందిగ్ధత తొలగే వరకు పామాయిల్ పంపిణీ చేయకపోవచ్చని తెలుస్తోంది. కొత్త సర్కార్ కొలువుతీరే వరకు పామాయిల్ సరఫరా జరగకపోవచ్చని లబ్ధిదారులు అందోళన చెందుతున్నారు.
200 మందికి అందని నిత్యావసర సరకులు..
మండలంలోని సుమారు 200 మందికి నిత్యావసర సరకులు అంద లేదు. పౌరసరఫరాల కీ రిజిస్టర్లో పేర్లు నమోదు కాకపోవడంతో వీరికి ఈ పరిస్థితి తలెత్తింది. తమకు కార్డులున్నప్పటికీ సరకులు అందడం లేదని వారు వాపోతున్నారు. అధికారులు స్పందించి తమకు నిత్యావసర సరకులు అందేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.