Distribution of plots
-
ఐదేళ్ల నిరీక్షణ ఫలించిన వేళ..!
సాక్షి, కందుకూరు అర్బన్: కందుకూరు పట్టణం వరాల సాయినగర్ కాలనీని జిల్లాలోనే మోడల్ కాలనీగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఉప్పుచెరువులోని సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ పక్కన గతంలో ఆయన పేదలకు పంపిణీ చేసిన పట్టాలకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా సోమవారం స్థలాలను (పొజిషన్) చూపించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డికి ఆర్డీఓ రామారావు, కమిషనర్ వి.శ్రీనివాసరావుతో పాటు పండితులు వేదమంత్రాలతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే తన ఇష్టదైవం దివెనలు అందుకొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో ఒకటైన పేదల సొంతింటి కలను నెరవేర్చే ప్రక్రియకు కందుకూరులో శ్రీకారం చుట్టినట్లు ప్రజల హర్షధ్వనాల మధ్య ప్రకటించారు. తొలి రోజు ఒకటి నుంచి 500వ ప్లాట్ వరకు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి దగ్గరుండి పొజిషన్ చూపించారు. వైఎస్సార్ జయంతి రోజుపట్టాలు పంచడం అదృష్టం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా పట్టాలు పంపిణీ చేసే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సాయినగర్ కాలనీకి 80 అడుగుల ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లను 40 అడుగులతో నిర్మించనున్నట్లు వివరించారు. కందుకూరులో 40 అడుగుల వెడల్పుతో ఉండే రోడ్లు ఉన్న కాలనీలు అరుదన్నారు. అంతే కాకండా కాలనీలో మౌలిక వసతులతో పాటు అంతర్గత డ్రైనేజీ, సీసీ రోడ్లు, గ్రీనరీ ఏర్పాటు చేసి సర్వాంగా సుందరంగా తీర్చిదిద్దుతామని స్థానికులకు హామీ ఇచ్చారు. నిజమైన అర్హులకు మాత్రమే పట్టాలు ఇస్తున్నట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటికే పట్టాలు పొంది ఉంటే విచారించి వాటిని రద్దు చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. గతంలో ఎవరికైతే పట్టాలు ఇచ్చి పొజిషన్ చూపించలేదో, పేర్లు మంజూరు చేసి పట్టాలు కూడా ఇవ్వలేదో వారు ఇప్పటికీ అర్హత కలిగి ఉంటే తప్పని సరిగా పొజిషన్ చూపిస్తామని, ఆందోళన చెందాల్సిన అవరసం లేదని మహీధర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఇంకా సొంతిళ్లు లేని పేదలు ఉంటే వారందరినీ కలిపి 2 వేల మందికి తగ్గకుండా ఇళ్లు మంజూరు చేయాలన్నది తన ధ్వేయమన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలపై ఆయన ధ్వజమెత్తారు. అక్రమాలు జరగకుండా పట్టాలు పొందిన వారి పేర్లను ఆన్లైన్ చేస్తామన్నారు. జీప్లస్ త్రీ ఇళ్లలో పేరు ఉన్న వారు ఆందోళన పడాల్సిన అవరసం లేదని, అర్హులకు అక్కడే కేటాయిస్తామన్నారు. కందుకూరు నియోజవర్గంలో మౌలిక వసతలకు పెద్ద పీట వేస్తూ పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టే పథకాలు ప్రతి ఒక్కరికి అందజేసేందకు ముందుంటామన్నారు. గతంలో పోలీసులు, హోంగార్డులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని మరిచిందని మండిపడ్డారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పేదలకు ఎమ్మెల్యే పొజిషన్ చూపించారు. ఐదేళ్ల సొంతింటి కల ఫలించడంతో పేదల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పేదలకు పొజిషన్ చూపించారని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ దివి లింగయ్యనాయుడు, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు ఎస్కే రఫీ, మాజీ కౌన్సిలర్ జాజుల కోటేశ్వరరావు, ఖాదర్‌బాషా, దారం మాల్యాద్రి పాల్గొన్నారు. -
నోరెత్తొద్దు..
చెప్పింది విని.. ఇచ్చింది తీసుకెళ్లండి ప్లాట్ల పంపిణీ వద్ద అంతా మనోళ్లే ఉండాలి నేలపాడును ఎంచుకోవడానికి కారణం ఇదే రైతులకు టీడీపీ నేతల ఆదేశాలు! నేడు ప్లాట్ల పంపిణీ కార్యక్రమానికి సీఎం రాక! అమరావతి : ‘రాజధానికి భూములు ఇచ్చిన వారికి ప్లాట్లు ఇస్తున్నారు. ఎటువంటి తప్పులున్నా నోరెత్తకుండా ఉండాలి. ప్లాట్ల పంపిణీ కార్యక్రమంలో అంతా మనోళ్లే ఉండాలి. ఎటువంటి పరిస్థితిలోనూ నిలదీసేవారిని పిలవద్దు. అధికారులు చెప్పింది విని.. ఇచ్చింది తీసుకెళ్లండి. ఏదైనా ఉంటే మేం చూసుకుంటాం. మీకు ఎటువంటి నష్టం రాకుండా చేస్తాం. మీ మీద నమ్మకంతో ప్లాట్ల పంపిణీకి నేలపాడు గ్రామాన్ని ఎంపిక చేశాం...’ ఇవీ రైతులకు టీడీపీ నాయకులు ఇచ్చిన ఆదేశాలు. రాజధాని రైతులకు ప్లాట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం సోమవారం ్ఠతుళ్లూరు మండలం నేలపాడులో ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యే అవకాశం ఉంది. ఆ మేరకు అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయని విశ్వసనీయ సమాచారం. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం చంద్రబాబు సోమవారం పర్యటించనున్నారు. ఆ కార్యక్రమాన్ని త్వరగా పూర్తిచేసుకుని నేరుగా నేలపాడుకు రావాలనే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. ప్లాట్ల పంపిణీలో రైతుల నుంచి ఎటువంటి నిరసనలూ వ్యక్తం కాకుండా ఉండేందుకు టీడీపీ నేతలు ముందస్తు చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా నేలపాడులో ఆదివారం రహస్య సమావేశం నిర్వహించారని తెలిసింది. ఈ సమావేశానికి పార్టీ నాయకుల బంధువులు, అనుచరులను మాత్రమే పిలిచారు. ప్లాట్ల పంపిణీ కార్యక్రమంలో ఎటువంటి గొడవలూ జరక్కుండా ఉండాలనిఆదేశాలిచ్చారని సమాచారం. నేలపాడునే ఎందుకు ఎంచుకున్నారంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాలకు చెందిన 22 వేల మంది రైతుల నుంచి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములను సమీకరించింది. భూములిచ్చిన జరీబు రైతులకు ఎకరానికి వెయ్యి గజాల నివాస ప్లాటు, 450 గజాల వాణిజ్య ప్లాటు, మెట్ట రైతులకు వెయ్యి గజాల నివాస ప్లాటు, 200 గజాల వాణిజ్య ప్లాటు ఇస్తామని ప్రకటించింది. మెట్ట రైతులకు అదనంగా 50 గజాలు ఇస్తామని ఇటీవల ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ ప్లాట్ల పంపిణీ వాయిదా వేసుకుంటూ వచ్చింది. దీంతో ప్రభుత్వం తీరుపై 29 గ్రామాల రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్లాట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇదే రీతిన వాయిదా వేసుకుంటూ పోతే రైతుల నుంచి తిరుగుబాటు మొదలవుతుందని భావించిన ప్రభుత్వం.. ఈ ప్రక్రియ ప్రారంభించామని చెప్పుకునేందుకే నేటి నుంచి ప్లాట్లు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. ఇందుకు నేలపాడు గ్రామాన్ని ఎంచుకోవటం వెనుక రహస్యం దాగి ఉందని సమాచారం. గ్రామంలో అయితే రైతులను భయపెట్టి కార్యక్రమాన్ని సజావుగా ముగించవచ్చని పథకం వేసినట్లు తెలిసింది. అందులో భాగంగానే నేలపాడులో ఆదివారం టీడీపీ నేతలు రహస్యంగా సమావేశమై రైతులు కొందరికి హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ఎవ్వరూ నోరెత్తకుండా ఉండాలని గట్టిగా హెచ్చరించి వెళ్లినట్లు సమాచారం. వర్షాలు పడుతున్నాయంటూ వాయిదా వేయొచ్చని... నేలపాడులో సోమవారం పంపిణీ చేయనున్న ప్లాట్లు కాగితాల్లో మాత్రమే చూపిస్తారని, క్షేత్రస్థాయిలో చూపించే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. రాజధాని ప్రాంతంలో భూములను చదును చేయకపోవటమే ఇందుకు నిదర్శనం. రైతులకు ప్లాట్లు కేటాయించాలంటే భూములు చదునుచేసి లేవుట్లు వేయాలి. అయితే ఇప్పటి వరకు 10 శాతం కూడా చదునుచేసిన పాపాన పోలేదు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ప్లాట్లు కేటాయింపును మార్చి నెలకే పూర్తిచేయాల్సి ఉంది. వర్షాలు ప్రారంభమయ్యాక ప్లాట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టటం వెనుకా రహస్యం దాగి ఉంది. రైతులు అడిగితే.. వర్షాలు పడుతున్నాయి.. ఇప్పుడు భూములు చదునుచేయటం వీలుకాలేదని చెప్పి తప్పించుకోవచ్చని ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. అలా మరో మూడునెలల పాటు ప్లాట్ల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేయవచ్చనే ఆలోచనతో నేటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి.