పేదలకు పోజిషన్ చూపుతున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి
సాక్షి, కందుకూరు అర్బన్: కందుకూరు పట్టణం వరాల సాయినగర్ కాలనీని జిల్లాలోనే మోడల్ కాలనీగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఉప్పుచెరువులోని సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ పక్కన గతంలో ఆయన పేదలకు పంపిణీ చేసిన పట్టాలకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా సోమవారం స్థలాలను (పొజిషన్) చూపించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డికి ఆర్డీఓ రామారావు, కమిషనర్ వి.శ్రీనివాసరావుతో పాటు పండితులు వేదమంత్రాలతో ఘన స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే తన ఇష్టదైవం దివెనలు అందుకొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో ఒకటైన పేదల సొంతింటి కలను నెరవేర్చే ప్రక్రియకు కందుకూరులో శ్రీకారం చుట్టినట్లు ప్రజల హర్షధ్వనాల మధ్య ప్రకటించారు. తొలి రోజు ఒకటి నుంచి 500వ ప్లాట్ వరకు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి దగ్గరుండి పొజిషన్ చూపించారు.
వైఎస్సార్ జయంతి రోజుపట్టాలు పంచడం అదృష్టం
ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా పట్టాలు పంపిణీ చేసే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సాయినగర్ కాలనీకి 80 అడుగుల ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లను 40 అడుగులతో నిర్మించనున్నట్లు వివరించారు. కందుకూరులో 40 అడుగుల వెడల్పుతో ఉండే రోడ్లు ఉన్న కాలనీలు అరుదన్నారు. అంతే కాకండా కాలనీలో మౌలిక వసతులతో పాటు అంతర్గత డ్రైనేజీ, సీసీ రోడ్లు, గ్రీనరీ ఏర్పాటు చేసి సర్వాంగా సుందరంగా తీర్చిదిద్దుతామని స్థానికులకు హామీ ఇచ్చారు. నిజమైన అర్హులకు మాత్రమే పట్టాలు ఇస్తున్నట్లు చెప్పారు.
నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటికే పట్టాలు పొంది ఉంటే విచారించి వాటిని రద్దు చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. గతంలో ఎవరికైతే పట్టాలు ఇచ్చి పొజిషన్ చూపించలేదో, పేర్లు మంజూరు చేసి పట్టాలు కూడా ఇవ్వలేదో వారు ఇప్పటికీ అర్హత కలిగి ఉంటే తప్పని సరిగా పొజిషన్ చూపిస్తామని, ఆందోళన చెందాల్సిన అవరసం లేదని మహీధర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఇంకా సొంతిళ్లు లేని పేదలు ఉంటే వారందరినీ కలిపి 2 వేల మందికి తగ్గకుండా ఇళ్లు మంజూరు చేయాలన్నది తన ధ్వేయమన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలపై ఆయన ధ్వజమెత్తారు. అక్రమాలు జరగకుండా పట్టాలు పొందిన వారి పేర్లను ఆన్‌లైన్ చేస్తామన్నారు. జీప్లస్ త్రీ ఇళ్లలో పేరు ఉన్న వారు ఆందోళన పడాల్సిన అవరసం లేదని, అర్హులకు అక్కడే కేటాయిస్తామన్నారు.
కందుకూరు నియోజవర్గంలో మౌలిక వసతలకు పెద్ద పీట వేస్తూ పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశ పెట్టే పథకాలు ప్రతి ఒక్కరికి అందజేసేందకు ముందుంటామన్నారు. గతంలో పోలీసులు, హోంగార్డులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని మరిచిందని మండిపడ్డారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పేదలకు ఎమ్మెల్యే పొజిషన్ చూపించారు. ఐదేళ్ల సొంతింటి కల ఫలించడంతో పేదల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పేదలకు పొజిషన్ చూపించారని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ దివి లింగయ్యనాయుడు, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు ఎస్‌కే రఫీ, మాజీ కౌన్సిలర్ జాజుల కోటేశ్వరరావు, ఖాదర్‌బాషా, దారం మాల్యాద్రి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment