MAHEEDHAR REDDY
-
టీడీపీ నేతలపై కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ఆగ్రహం
సాక్షి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ నేతలపై కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ నేతల నిర్వాకం వల్లే 8 మంది అమాయకులు బలి అయ్యారని మండిపడ్డారు. ప్రచార ఆర్భాటంతో రోడ్డుపై ఫ్లెక్సీలు కట్టారు. టీడీపీ నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు కట్టి ప్రమాదానికి కారణమయ్యారు. చేసింది తప్పని తెలుసుకోకుండా పిచ్చిప్రేలాపణలు చేస్తే జనం బుద్ధి చెబుతారని మహీధర్‌రెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు బాధ్యత వహించాలి: డిప్యూటీ సీఎం చంద్రబాబు ప్రచార పిచ్చితోనే 8 మంది చనిపోయారని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. తక్కువ జనాన్ని ఎక్కువగా చూపించే ప్రయత్నం చేశారు. కందుకూరు ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలి' అని మంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. కందుకూరు ఘటన బాధాకరం: బాలినేని చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరిందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. ఇరుకు సందులో సభ పెట్టి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరు ఘటనలో 8 మంది చనిపోవడం బాధాకరమైన విషయం అన్నారు. -
ఐదేళ్ల నిరీక్షణ ఫలించిన వేళ..!
సాక్షి, కందుకూరు అర్బన్: కందుకూరు పట్టణం వరాల సాయినగర్ కాలనీని జిల్లాలోనే మోడల్ కాలనీగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఉప్పుచెరువులోని సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ పక్కన గతంలో ఆయన పేదలకు పంపిణీ చేసిన పట్టాలకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా సోమవారం స్థలాలను (పొజిషన్) చూపించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డికి ఆర్డీఓ రామారావు, కమిషనర్ వి.శ్రీనివాసరావుతో పాటు పండితులు వేదమంత్రాలతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే తన ఇష్టదైవం దివెనలు అందుకొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో ఒకటైన పేదల సొంతింటి కలను నెరవేర్చే ప్రక్రియకు కందుకూరులో శ్రీకారం చుట్టినట్లు ప్రజల హర్షధ్వనాల మధ్య ప్రకటించారు. తొలి రోజు ఒకటి నుంచి 500వ ప్లాట్ వరకు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి దగ్గరుండి పొజిషన్ చూపించారు. వైఎస్సార్ జయంతి రోజుపట్టాలు పంచడం అదృష్టం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా పట్టాలు పంపిణీ చేసే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సాయినగర్ కాలనీకి 80 అడుగుల ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లను 40 అడుగులతో నిర్మించనున్నట్లు వివరించారు. కందుకూరులో 40 అడుగుల వెడల్పుతో ఉండే రోడ్లు ఉన్న కాలనీలు అరుదన్నారు. అంతే కాకండా కాలనీలో మౌలిక వసతులతో పాటు అంతర్గత డ్రైనేజీ, సీసీ రోడ్లు, గ్రీనరీ ఏర్పాటు చేసి సర్వాంగా సుందరంగా తీర్చిదిద్దుతామని స్థానికులకు హామీ ఇచ్చారు. నిజమైన అర్హులకు మాత్రమే పట్టాలు ఇస్తున్నట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటికే పట్టాలు పొంది ఉంటే విచారించి వాటిని రద్దు చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. గతంలో ఎవరికైతే పట్టాలు ఇచ్చి పొజిషన్ చూపించలేదో, పేర్లు మంజూరు చేసి పట్టాలు కూడా ఇవ్వలేదో వారు ఇప్పటికీ అర్హత కలిగి ఉంటే తప్పని సరిగా పొజిషన్ చూపిస్తామని, ఆందోళన చెందాల్సిన అవరసం లేదని మహీధర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఇంకా సొంతిళ్లు లేని పేదలు ఉంటే వారందరినీ కలిపి 2 వేల మందికి తగ్గకుండా ఇళ్లు మంజూరు చేయాలన్నది తన ధ్వేయమన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలపై ఆయన ధ్వజమెత్తారు. అక్రమాలు జరగకుండా పట్టాలు పొందిన వారి పేర్లను ఆన్లైన్ చేస్తామన్నారు. జీప్లస్ త్రీ ఇళ్లలో పేరు ఉన్న వారు ఆందోళన పడాల్సిన అవరసం లేదని, అర్హులకు అక్కడే కేటాయిస్తామన్నారు. కందుకూరు నియోజవర్గంలో మౌలిక వసతలకు పెద్ద పీట వేస్తూ పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టే పథకాలు ప్రతి ఒక్కరికి అందజేసేందకు ముందుంటామన్నారు. గతంలో పోలీసులు, హోంగార్డులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని మరిచిందని మండిపడ్డారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పేదలకు ఎమ్మెల్యే పొజిషన్ చూపించారు. ఐదేళ్ల సొంతింటి కల ఫలించడంతో పేదల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పేదలకు పొజిషన్ చూపించారని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ దివి లింగయ్యనాయుడు, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు ఎస్కే రఫీ, మాజీ కౌన్సిలర్ జాజుల కోటేశ్వరరావు, ఖాదర్‌బాషా, దారం మాల్యాద్రి పాల్గొన్నారు. -
పారిశుధ్య కార్మికుల సమ్మె విరమణ
సాక్షి, సిటీబ్యూరో: ఐదు రోజులుగా కొనసాగుతున్న జీహెచ్ఎంసీ కార్మికుల సమ్మె నుంచి నగర ప్రజలకు ఉపశమనం లభించింది. బుధవారం సాయంత్రం మునిసిపల్ మంత్రి ఆయా కార్మిక సంఘాలతో జరిపిన చర్చలతో నేతలు తాత్కాలికంగా సమ్మె ఉపసంహరణకు అంగీకరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు.. పొంచివున్న అంటువ్యాధులు.. తదితర కారణాల దృష్ట్యా ఒక మెట్టు దిగినట్లు యూనియన్ల నేతలు వెల్లడించారు. బుధవారం అర్ధరాత్రి నుంచే కార్మికులు పారిశుధ్య కార్యక్రమాల్లో నిమగ్నమవుతారని పేర్కొన్నారు. సచివాలయంలో మంత్రి మహీధర్‌రెడ్డి జీహెచ్ఎంసీ మేయర్ మాజిద్‌హుస్సేన్, కమిషనర్ సోమేశ్‌కుమార్, మునిసిపల్ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో కార్మిక సం ఘాల నేతలతో చర్చలు జరిపారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కార్మిక సంఘాలు కోరినంత మేర వేతనాలు పెంచలేకపోతున్నామని మంత్రి చె ప్పారు. ప్రస్తుతానికి జీహెచ్ఎంసీ ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాల్ని నెలకు రూ. 6700 నుంచి రూ. 8500లకు పెంచేం దుకు అంగీకరించారు. త ద్వారా సంవత్సరానికి రూ. 53.64 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ప్రస్తుతం జీహెచ్ ఎంసీ కార్మికులకు 27 శాతం ఐఆర్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ముట్టడి.. అంతకుముందు మధ్యాహ్నం వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. సంఘాల నేతలు మాట్లాడుతూ.. కార్మికుల వేతనాలు పెంచకపోవడమే కాక, ఎస్మా ప్రయోగిస్తామని బెదిరించ డం దారుణమని దుయ్యబట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, సీపీఐ శాసనసభా పక్ష నాయకుడు గుండా మల్లేశ్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ నాయకుడు జె.చలపతిరావు, సీఐటీయూ నాయకుడు పాలడుగు భాస్కర్, బీఎం ఎస్ నాయకుడు శంకర్,ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, తదితర సంఘాలకు చెందిన నాయకులు ప్రసంగించారు. అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలించారు. -
అనుమతులన్నీ ఆన్లైన్లోనే...
అన్ని పట్టణాభివృద్ధి సంస్థల్లో ‘గ్రీన్‌చానల్’ నెలాఖరు నుంచి ప్రారంభం:మంత్రి మహీధర్‌రెడ్డి అనుమతుల జారీలో జాప్యం నివారణకు కొత్త సేవలు సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలోని అన్ని పట్టణాభివృద్ధి సంస్థ (అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)ల్లో నెలాఖరు నుంచి ‘గ్రీన్‌చానల్’ను అమలు చేయనున్నట్లు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి ప్రకటించారు. లేఅవుట్లు, భవన నిర్మాణాల అనుమతుల్లో జాప్యానికి తావులేకుండా ఆన్లైన్ సేవలు అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో ‘గ్రీన్‌చానల్’ పేరిట ఏర్పాటు చేసిన పౌరసేవా కేంద్రాన్ని గురువారం మంత్రి మహీధర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ..దరఖాస్తుల పరిష్కారంలో హెచ్ఎండీఏ వైపు నుంచి జాప్యం జరిగితే, సిబ్బంది తమకు తాముగా స్వీయ జరిమానా విధించుకోవాలని, ఇది తన ఆదేశమని హెచ్చరించారు. గ్రీన్‌చానల్ విషయంలో గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోకపోతే మళ్లీ 2009 నాటి పరిస్థితే ఉత్పన్నమవుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల్లో ప్రస్తుతం ఆస్తిపన్ను మదింపు కార్యక్రమాన్ని మొదలు పెట్టామని, విద్యుత్తు పొదుపును అమలు చే స్తున్న వారికి, పర్యావరణ పరిరక్షణకు అనువుగా భవనాలు నిర్మించే వారికి ప్రత్యేక రాయితీలు ప్రకటించినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు సర్పంచులు మంత్రి వద్దకు వెళ్లి ఎల్ఆర్ఎస్, బీపీఎస్ చార్జీల్లో స్థానిక సంస్థలకు రావాల్సిన వాటా ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమై చర్చిద్దామని సర్దిచెప్పారు. ఇందుకు మండలాల వారీగా సర్పంచులను ఆహ్వానించనున్నట్లు మంత్రి తెలిపారు. 2015 నాటికి గ్రీన్‌చానల్ పూర్తిస్థాయిలో విజయవంతమవ్వాలని మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి ఆకాంక్షించారు. హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ ‘ఆస్కీ’ సహకారంతో భవిష్యత్‌లో అన్ని రకాల అనుమతులు ఆన్లైన్లో ఇచ్చేలా ప్లాన్ చేశామన్నారు. ప్రస్తుతం లేఅవుట్ దరఖాస్తులను మాత్రమే గ్రీన్‌చానల్‌లో స్వీకరించి 7 రోజుల్లోగా ప్రాసెస్ పూర్తిచేసి ఆమోదమా/తిరస్కారమా అన్నది తేలుస్తామని, ఆపై నిర్ణీత రుసుము చెల్లిస్తే 30 రోజుల్లో అనుమతి పత్రాలు దరఖాస్తుదారు ఇంటికి చేరుస్తామన్నారు. మంత్రి మహీధర్‌రెడ్డి గ్రీన్‌చానల్ బ్రోచర్‌ను ఆవిష్కరించి, కాపీలను అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్, ఓఆర్ఆర్ పీడీ శామ్యూల్ ఆనంద్‌కుమార్, కార్యదర్శి బి.రామారావు, ప్లానింగ్ డెరైక్టర్ వెంకటరత్నం, క్రెడాయ్, అప్రెడా ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, వాస్తవానికి హెచ్ఎండీఏలో 2009లోనే గ్రీన్‌చానల్ ప్రారంభించారు. అయితే... పర్యవేక్షణ లోపం వల్ల అమలు కాలేదు. ఇప్పుడు లోపాలు సవరించుకొని మళ్లీ పునఃప్రారంభించారు.