నత్తనడకన ఉద్యోగుల పంపిణీ
ఏడాదైనా తాత్కాలిక పంపిణీయే పూర్తికాలేదు
తుది పంపకాలకు మరో సంవత్సర కాలం!
రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల తాత్కాలిక పంపిణీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పంపిణీపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కమల్నాథన్ అధ్యక్షతన ఒక కమిటీని రాష్ట్ర విభజన తేదీకి ముందే ఏర్పాటు చేసింది. గత ఏడాది మార్చి 29న ఏర్పాటైన ఈ కమిటీ.. ఇప్పటివరకు 11 సార్లు సమావేశాలు నిర్వహించి... రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీకి మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఇరు రాష్ట్రాల మధ్య రాష్ట్రస్థాయి కేడర్ పోస్టుల సంఖ్యను నిర్ధారించింది. రాష్ట్రాల మధ్య ఉద్యోగుల తాత్కాలిక పంపిణీ ప్రక్రియను ప్రారంభించినా... ఇంకా సగం విభాగాల్లో కూడా ఇది పూర్తి కాలేదు.
ఇంకెంత కాలం పడుతుందో..?
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య 115 శాఖలకు చెందిన విభాగాల్లోని పోస్టులను పంపిణీ చేశారు. ఆయా పోస్టుల్లో ఉద్యోగుల తాత్కాలిక పంపిణీ మాత్రం కేవలం 28 శాఖలకు చెందిన విభాగాల్లోనే పూర్తిచేశారు. కమల్నాథన్ కమిటీకి తొలుత కేంద్రం ఇచ్చిన గడువు ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసిపోయింది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీ వరకు పొడిగించారు. కానీ కమల్నాథన్ కమిటీ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. ఈ గడువులోగా ఉద్యోగుల తాత్కాలిక పంపిణీ కూడా పూర్తి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు తాత్కాలిక పంపిణీ పూర్తిచేసి, అభ్యంతరాలను స్వీకరించి, పరిష్కరించిన తర్వాత కేంద్రం నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే ఏడాదిపైనే పడుతుందని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి.
నిరుద్యోగులకు శాపం..
ఉద్యోగుల పంపిణీ పూర్తి కాకపోవడాన్ని సాకుగా తీసుకుని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీని పక్కనపెట్టాయి. కమల్నాథన్ కమిటీ పంపిణీ చేసేది కేవలం 50 వేల రాష్ట్ర స్థాయి ఉద్యోగులను మాత్రమే. జిల్లా, జోనల్, మండల, గ్రామ స్థాయి ఉద్యోగులు పంపిణీ పరిధిలోకి రారు. అయినా ఆ ఖాళీ పోస్టులను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేయడం లేదు.