జిల్లాకు 385 అంగన్వాడీ భవనాలు
భోగాపురం : జిల్లాలో కొత్తగా 385 అంగన్వాడీ భవనాలు నిర్మించనున్నట్లు ఐసీడీఎస్ పీడీ రాబర్ట్స్ తెలిపారు. మండలంలోని మోడల్ అంగన్వాడీ భవనాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ, గతంలో ఒక్కో అంగన్వాడీ భవన నిర్మాణానికి రూ. 6.5 లక్షలు కేటాయించగా, ప్రస్తుతం 12 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
భవనం పెద్దదిగా నిర్మించడంతో పాటు ప్రహరీ, వంటగది, మరుగుదొడ్లు నిర్మించాలనే ఉద్దేశంతో నిధులు పెంచినట్లు తెలిపారు. జిల్లాలో 17 సీడీపీఓ కార్యాలయాలు ఉండగా 9 కార్యాలయాలకు సొంత భవనాలున్నాయన్నారు. మరో 8 భవనాల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు చెప్పారు. విజయనగరం, సాలూరు, బొబ్బిలి అర్బన్‌లో ఒక్కో భవన నిర్మాణానికి రూ. 30 లక్షలు చొప్పున మంజూరైనట్లు తెలిపారు. అలాగే అర్బన్‌లో ఉన్న నెల్లిమర్ల, చీపురుపల్లి, శృంగవరపుకోట, బొబ్బిలి రూరల్, బాడంగిలో ఒక్కో భవన నిర్మాణానికి 53 లక్షల రూపాయలు చొప్పున మంజూరయ్యాయన్నారు. భోగాపురం ఐసీడీఎస్ భవనం మండల పరిషత్, జిల్లా పరిషత్ నిధులతో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పూర్తి స్థాయిలో పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. బాలామృతం ప్యాకెట్‌కు బదులు 3 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అరలీటరు నూనె, అదనంగా రెండు గుడ్లు అందిస్తున్నట్లు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా ఉన్నదీ, లేనిదీ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రతివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంగనవాడీల పనితీరు మెరుగుపరిచేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఆయనతోపాటు సీడీపీఓ ధనలక్ష్మి ఉన్నారు.