district bipergation
-
జిల్లా కార్యాలయాలు సిద్ధం చేయాలి
జేసీ సుందర్‌అబ్నార్ మంచిర్యాల టౌన్ : కొమురం భీం జిల్లా ఏర్పాటు సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని సౌకర్యాలను సమకూర్చుకుని అక్టోబర్ 11న దసరా పండుగ రోజు జిల్లా కార్యాలయాలు ప్రారంభించే విధంగా సిద్ధంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంచిర్యాల ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన ఫర్నిచర్, స్టేషనరీ, ఇతర మౌలిక సదుపాయాలు, సైన్‌బోర్డుల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యాలయాలు ప్రభుత్వ భవనాలలో ఏర్పాటు చేసినట్లయితే వాటికి తగిన మరమ్మతు, సున్నం వేసి ఒప్పందం సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రైవేటు భవనాలలో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి భవనం యజమానితో ఒప్పందం చేసుకుని, అద్దె నిర్ణయించడానికి ఆర్ అండ్ బీ శాఖతో సంప్రదించిన అనంతరం ఆర్డీవోకు నివేదిక ఇవ్వాలని తెలిపారు. అధికారులు ప్రభుత్వం సూచించిన ఆరు ఫార్మాట్లలో తమ శాఖకు సంబంధించిన వివరాలను పొందుపరిచి సకాలంలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆయేషా మస్రత్‌ఖానమ్ పాల్గొన్నారు. -
ఉద్యోగుల విభజన
వివరాలు సేకరించేందుకు ఫ్రొఫార్మా తయారీ కార్యాలయాల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు మరో ఫ్రొఫార్మా టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులతో జేసీ సమీక్ష ఆదిలాబాద్ అర్బన్ : కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగుల విభజనలో కసరత్తు మొదలైంది. నూతన జిల్లాలు వచ్చే దసరా నుంచి పాలన అందించాలని ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి వివరాలు సేకరించేందుకు ఫ్రొఫార్మా తయారు చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సుందర్ అబ్నార్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులతో ఉద్యోగుల విభజనకు అవసరమైన వివరాల సేకరణకు ప్రత్యేక ఫ్రొఫార్మా తయారు చేశారు. ముందుగా రెగ్యూలర్ ఉద్యోగులకు సంబంధించిన ఫ్రొఫార్మా, అనంతరం కాంట్రాక్టు, పార్ట్‌టైమ్, ఔట్సోర్సింగ్, కాంటింజెంట్ ఉద్యోగులకు చెందిన ఫ్రొఫార్మాను రూపొందించారు. కింది స్థాయి అధికారి నుంచి పైస్థాయి అధికారి వరకు విభాగాల వారీగా ఉద్యోగుల వివరాలు పొందుపర్చే విధంగా ఈ ఫ్రొఫార్మా ఉంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల వివరాలు సేకరించి నూతనంగా ఏర్పడే జిల్లాలకు కేటాయించేందుకు కావాల్సిన సమాచారం ఈ ఫ్రొఫార్మా ద్వారా అధికారులకు అందుతుంది. ఉద్యోగుల వివరాల సేకరణకు సంబంధించిన ఈ ఫ్రొఫార్మా తయారీకి టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యుల సలహాలు, సూచనలు ఇచ్చారు. గ్రామ పంచాయతీ, గ్రామ స్థాయిలో కాకుండా మండలం, డివిజన్, జిల్లా స్థాయిలోనే విభజన ఉంటుందని జేసీ సుందర్ అబ్నార్ తెలిపారు. అటెండర్ స్థాయి నుంచి అన్ని వివరాలు సేకరించి విభజన చేపట్టనున్నామని తెలిపారు. ఉద్యోగుల అభిప్రాయం మేరకు ఎక్కడి వాళ్లు అక్కడికే కేటాయించేలా సమావేశంలో చర్చించారు. విభజనకు సంబంధించి జిల్లాలకు నియమించడమే తమ బాధ్యత అని, సర్వీసు తక్కువ, ఎక్కువగా ఉండడం తమ పరిధిలోకి రాదన్నారు. వివరాల సేకరణలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రొఫార్మా ఉంటుందన్నారు. ఉద్యోగి పేరు నుంచి అన్ని వివరాలు ఇందులో పొందుపర్చినట్లు జేసీ చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ విభజనపై.. కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాలకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ను సమకూర్చడంపై కూడా సమీక్షలో చర్చించారు. డీఆర్వో సంజీవరెడ్డి కమిటీ సభ్యులతో చర్చిస్తూ ప్రస్తుతం జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వివరాల సేకరణకు ప్రొఫార్మ తయారు చేశామన్నారు. ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవచ్చని, ప్రొఫార్మలో ఏయే వివరాలు అడుగుతున్నామో చదివి వినిపించారు. డిపార్ట్మెంట్ పేరుతో సహా కార్యాలయాల్లోని అన్ని వస్తువులకు సంబంధించిన వివరాలు, అందులో పని చేస్తున్నవి ఎన్ని.. వాటి సంఖ్య, తదితర వివరాల సేకరణకు ఈ ప్రొఫార్మ రూపొందించారు. కంప్యూటర్, ఏసీ, లైట్లు, కూలర్లు, కుర్చీలు, టేబుళ్లు, జనరేటర్లు, ఇన్వర్టర్లు, ప్రింటర్లు, స్కానర్లు, మోబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వాహనాలు (అద్దె, ప్రభుత్వ), జిరాక్స్ మిషన్లు, తదితర వివరాలు ఈ ప్రొఫార్మ ద్వారా సేకరించే వీలుంది. వివరాలు సేకరించిన అనంతరం కొత్త జిల్లాలకు వీటిని కేటాయిస్తారు. మూడు జిల్లాలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా.. లేదా.. అనేది ఈ ప్రొఫార్మ ద్వారా తెలిసిపోతుంది. వివిధ కార్యాలయాల్లో ప్రస్తుతం పని చేస్తున్న వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో జితేందర్‌రెడ్డి, డీపీవో పోచయ్య, డీఈవో సత్యనారాయణరెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు అశోక్, కార్యదర్శి వనజారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
చారిత్రక ఖిల్లా.. నిర్మల్ జిల్లా
గత మండలాలతోనే.. ‘ముథోల్’ మండలాలతో భైంసా డివిజన్ నిర్మల్‌రూరల్ : చారిత్రక ఖిల్లాగా.. నిజాం జమానాలోనే రెవెన్యూ జిల్లాగా.. రాజకీయ కేంద్రంగా.. పేరొందిన నిర్మల్ ఇక ఇప్పుడు కొత్త జిల్లాగా రూపుదిద్దుకోనుంది. ముథోల్, నిర్మల్ నియోజకవర్గాలతోపాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్, కడెం మండలాలతో జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గుచూపిన విషయం తెలిసిందే. నిర్మల్ ప్రాంతానికి ఉన్న అనుకూలతల కారణంగానే వందల ఏళ్ల క్రితం నిమ్మలనాయుడు ఈ ప్రాంతాన్ని ఖిల్లాగా చేసుకుని పాలించాడు. నిజాంరాజులు సైతం పాలన సౌలభ్యం కోసం నిర్మల్‌ను రెవెన్యూ జిల్లాగా చేశారు. ప్రస్తుత ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతోపాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాలను నిర్మల్ జిల్లాలో భాగం చేశారు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ నూతన జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పరిపాలన సౌలభ్యం, భౌగోళిక నేపథ్యం దృష్టిలో ఉంచుకునే నిర్మల్‌ను జిల్లాగా చేసినట్లు సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు ముసాయిదాలోనూ 13మండలాలతో కొత్తజిల్లాను ప్రకటించారు. రెవెన్యూ డివిజన్నే జిల్లాగా.. ఇప్పుడున్న నిర్మల్ రెవెన్యూ డివిజనే కొత్త జిల్లాగా రూపుదిద్దుకోనుంది. ప్రభుత్వం కొత్త జిల్లాలో పేర్కొన్న ముథోల్, తానూరు, కుభీర్, భైంసా, లోకేశ్వరం, కుంటాల, దిలావర్పూర్, సారంగపూర్, నిర్మల్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, కడెం.. ఈ 13 మండలాలు ప్రస్తుతం నిర్మల్ డివిజన్లోనివే. గతంలో డివిజన్ల ఏర్పాటు సమయంలోనే పాలన సౌలభ్యం కోసం ఈ 13మండలాలతో డివిజన్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అవే మండలాలు.. అదే డివిజన్ జిల్లాగా ప్రమోషన్ పొందనుంది. ముథోల్వాసులకు రెట్టింపు సంతోషం ‘ఈ కష్టాలు ఇంకెన్నేళ్లు భరించాలి. తమను నిజామాబాద్‌లో కలపండి.. లేదంటే నిర్మల్‌ను జిల్లాగా చేయండి..’ ఇది నిన్నమొన్నటి వరకు ముథోల్ నియోజకవర్గ ప్రజల ఆవేదన. అల్లంత దూరంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాకేంద్రానికి వెళ్లాలంటేనే చాలా ఇబ్బంది పడేవారు. ఏ చిన్నపనికైనా నిజామాబాద్‌కే పరుగుతీసేవారు. కానీ వారికి కేసీఆర్ సర్కార్ రెట్టింపు సంతోషాన్ని ఇచ్చింది. అటు నిర్మల్ కేంద్రంగా కొత్తజిల్లాతోపాటు భైంసా కేంద్రంగా నూతన డివిజన్‌నూ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ముథోల్ నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఓ వైపు జిల్లాకేంద్రం, మరోవైపు డివిజన్ కేంద్రంతో పాటు పక్కనే నిజామాబాద్, సరిహద్దు దాటితే ధర్మాబాద్, నాందేడ్.. ఇలా అన్నింటికి మధ్యలో ముథోల్ వచ్చేసింది. భైంసా కేంద్రంగా ప్రకటించిన డివిజన్లో ముథోల్ నియోజకవర్గం(ముథోల్, తానూరు, కుభీర్, భైంసా, లోకేశ్వరం, కుంటాల మండలాలు) పూర్తిగా రానుంది. నిర్మల్‌తోనే అనుబంధం.. ముథోల్తోపాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్, కడెం మండలాలను నిర్మల్ జిల్లాలోనే కొనసాగించనున్నారు. ముందు నుంచీ ఈ రెండు మండలాలకు నిర్మల్‌తోనే అనుబంధం ఉంది. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న ఈ మండలాల ప్రజలు ఏ అవసరమున్న నిర్మల్‌కే వస్తుంటారు. రెవెన్యూపరంగానూ ఇవి నిర్మల్ డివిజన్‌లోనే కొనసాగుతున్నాయి. వ్యాపార, వాణిజ్యాలతో పాటు బంధుమిత్ర బాంధవ్యాలూ నిర్మల్‌తో ముడిపడి ఉన్నాయి. జిల్లా కార్యాలయాలూ ఇక్కడే.. వివిధ శాఖలకు చెందిన జిల్లా కార్యాలయాలు ఇప్పటికే నిర్మల్‌లో ఉన్నాయి. పంచాయతీ రాజ్, నీటిపారుదల, మత్స్యశాఖ, భూగర్భ జలవనరుల శాఖ, పే అండ్ అకౌంట్స్ తదితర శాఖల జిల్లా కార్యాలయాలన్నీ నిర్మల్‌లోనే ఉన్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి సంబంధించి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల కార్యాలయం కూడా నిర్మల్‌లోనే ఏర్పాటు చేశారు. కవ్వాల్ టైగర్‌రిజర్వ్ ఫారెస్ట్ సర్కిల్ కార్యాలయం ఉంది. కొత్త జిల్లా కలెక్టరేట్ కోసం ఇప్పటికే స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కూడా అధికారులు పరిశీలించారు. ఇక జిల్లా ఏర్పాటైన తర్వాత ఎలాంటి సమస్యలు రాకుండా కావాల్సిన సదుపాయాలు ఇక్కడ ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. -
కొత్తమండలాలు లేనట్లే..
జనాభా ప్రాతిపదిక సర్కారు నిర్ణయం ప్రతిపాదిత మండలాలు మావల, సోన్, నస్పూర్, హాజీపూర్, పెంచికల్‌పేట ఒక్క పెంచికల్‌పేట ఏర్పాటుకు వీలు..? కెరమెరి కొమురంభీం జిల్లాలోకి.. జిల్లా అధికారుల తాజా ప్రతిపాదనలు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా విభజన ప్రతిపాదనల తయారీలో ఇంకా మార్పులు, చేర్పులు కొనసాగుతూనే ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక పట్టణంలో లక్షా 50వేల జనాభా ఉంటేనే అర్బన్ మండలాలు ఏర్పాటు చేయాలని, 35 వేల జనాభా దాటితేనే రూరల్ మండలం చేయడానికి వీలుంటుందని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లాలో కొత్త మండలాల ఏర్పాటు లేనట్లేనని స్పష్టమవుతోంది. జిల్లాలో కొత్తగా మావల, సోన్, నస్పూర్, హాజీపూర్లతోపాటు పెంచికల్పేట్లను కొత్త మండలాలుగా ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం ప్రతిపాదనలు పంపిన విషయం విదితమే. ఆయా మున్సిపాలిటీలతో కూడిన మండలాల నుంచి వీటిని వేరు చేసి, కొత్త మండలాలుగా ఏర్పాటు చేయాలని అధికారులు గతంలో ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మావల, సోన్, నస్పూర్, హాజీపూర్ మండలాల ఏర్పాటుకు వీలు పడడం లేదు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ మున్సిపాలిటీల జనాభా లక్షా 50వేల లోపే ఉండడంతో ప్రతిపాదిత ఈ కొత్త మండలాల ఏర్పాటు వీలు పడదని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. రూరల్ మండలం పెంచికల్‌పేట మండలం చేయడానికి వీలుంటుంది. కొత్తగా ప్రతిపాదించిన ఈ రూరల్ మండలంలో 35వేల జనాభా ఉంటుంది. దీంతో పెంచికల్‌పేట మండలం ఏర్పాటుకు దాదాపు మార్గం సుగమమైంది. కెరమెరి కొమురంభీం జిల్లాలోకి.. కెరమెరి మండలాన్ని ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉంచుతూ ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తాజాగా ఈ నిర్ణయాన్ని మార్చారు. ఈ మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న కొమురంభీం(మంచిర్యాల) జిల్లా పరిధిలోకి చేర్చాలని నిర్ణయించారు. ఈ మండలాన్ని ఆదిలాబాద్‌లో చేర్చడంపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమైంది. కొమురంభీం నడయాడిన జోడెఘాట్ ఉన్న కెరమెరి మండలాన్ని కొమురంభీం పేరుతో ఏర్పాటు చేయనున్న జిల్లాలో కాకుండా, ఆదిలాబాద్ జిల్లాలో చేర్చడం సరైంది కాదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కెరమెరి మండలాన్ని కొమురంభీం(మంచిర్యాల) జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. శుక్ర,శనివారాల్లో ఆసిఫాబాద్–ఆదిలాబాద్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. జిల్లాల విభజన ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం శనివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతించిన అఖిలపక్షం నేతలు, శాస్త్రీయ పద్ధతిలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు పలు పార్టీల నేతలు ప్రకటించారు. జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించాక జిల్లా ఏర్పాటుకు ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అనంతరం నెల రోజులపాటు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తామని సీఎం ప్రకటించారు. ఈ నోటిఫికేషన్ విడుదలైతే జిల్లా విభజనపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.