ఉద్యోగుల విభజన | empolyees divide | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల విభజన

Published Fri, Sep 2 2016 11:51 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

మాట్లాడుతున్న జేసీ సుందర్‌ అబ్నార్‌ - Sakshi

మాట్లాడుతున్న జేసీ సుందర్‌ అబ్నార్‌

  • వివరాలు సేకరించేందుకు ఫ్రొఫార్మా తయారీ
  • కార్యాలయాల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు మరో ఫ్రొఫార్మా  
  • టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులతో జేసీ సమీక్ష 
  • ఆదిలాబాద్‌ అర్బన్‌ : కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగుల విభజనలో కసరత్తు మొదలైంది. నూతన జిల్లాలు వచ్చే దసరా నుంచి పాలన అందించాలని ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి వివరాలు సేకరించేందుకు ఫ్రొఫార్మా తయారు చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ సుందర్‌ అబ్నార్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులతో ఉద్యోగుల విభజనకు అవసరమైన వివరాల సేకరణకు ప్రత్యేక ఫ్రొఫార్మా తయారు చేశారు. ముందుగా రెగ్యూలర్‌ ఉద్యోగులకు సంబంధించిన ఫ్రొఫార్మా, అనంతరం కాంట్రాక్టు, పార్ట్‌టైమ్, ఔట్‌సోర్సింగ్, కాంటింజెంట్‌ ఉద్యోగులకు చెందిన ఫ్రొఫార్మాను రూపొందించారు. 
     
    కింది స్థాయి అధికారి నుంచి పైస్థాయి అధికారి వరకు విభాగాల వారీగా ఉద్యోగుల వివరాలు పొందుపర్చే విధంగా ఈ ఫ్రొఫార్మా ఉంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల వివరాలు సేకరించి నూతనంగా ఏర్పడే జిల్లాలకు కేటాయించేందుకు కావాల్సిన సమాచారం ఈ ఫ్రొఫార్మా ద్వారా అధికారులకు అందుతుంది. ఉద్యోగుల వివరాల సేకరణకు సంబంధించిన ఈ ఫ్రొఫార్మా తయారీకి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యుల సలహాలు, సూచనలు ఇచ్చారు. గ్రామ పంచాయతీ, గ్రామ స్థాయిలో కాకుండా మండలం, డివిజన్, జిల్లా స్థాయిలోనే విభజన ఉంటుందని జేసీ సుందర్‌ అబ్నార్‌ తెలిపారు. అటెండర్‌ స్థాయి నుంచి అన్ని వివరాలు సేకరించి విభజన చేపట్టనున్నామని తెలిపారు.
     
    ఉద్యోగుల అభిప్రాయం మేరకు ఎక్కడి వాళ్లు అక్కడికే కేటాయించేలా సమావేశంలో చర్చించారు. విభజనకు సంబంధించి జిల్లాలకు నియమించడమే తమ బాధ్యత అని, సర్వీసు తక్కువ, ఎక్కువగా ఉండడం తమ పరిధిలోకి రాదన్నారు. వివరాల సేకరణలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రొఫార్మా ఉంటుందన్నారు. ఉద్యోగి పేరు నుంచి అన్ని వివరాలు ఇందులో పొందుపర్చినట్లు జేసీ చెప్పారు. 
    ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ విభజనపై.. 
    కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాలకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ను సమకూర్చడంపై కూడా సమీక్షలో చర్చించారు. డీఆర్వో సంజీవరెడ్డి కమిటీ సభ్యులతో చర్చిస్తూ ప్రస్తుతం జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ వివరాల సేకరణకు ప్రొఫార్మ తయారు చేశామన్నారు. ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవచ్చని, ప్రొఫార్మలో ఏయే వివరాలు అడుగుతున్నామో చదివి వినిపించారు.
     
    డిపార్ట్‌మెంట్‌ పేరుతో సహా కార్యాలయాల్లోని అన్ని వస్తువులకు సంబంధించిన వివరాలు, అందులో పని చేస్తున్నవి ఎన్ని.. వాటి సంఖ్య, తదితర వివరాల సేకరణకు ఈ ప్రొఫార్మ రూపొందించారు. కంప్యూటర్, ఏసీ, లైట్లు, కూలర్లు, కుర్చీలు, టేబుళ్లు, జనరేటర్లు, ఇన్వర్టర్లు, ప్రింటర్లు, స్కానర్లు, మోబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వాహనాలు (అద్దె, ప్రభుత్వ), జిరాక్స్‌ మిషన్లు, తదితర వివరాలు ఈ ప్రొఫార్మ ద్వారా సేకరించే వీలుంది. వివరాలు సేకరించిన అనంతరం కొత్త జిల్లాలకు వీటిని కేటాయిస్తారు. మూడు జిల్లాలకు కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉందా.. లేదా.. అనేది ఈ ప్రొఫార్మ ద్వారా తెలిసిపోతుంది.
     
    వివిధ కార్యాలయాల్లో ప్రస్తుతం పని చేస్తున్న వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ సీఈవో జితేందర్‌రెడ్డి, డీపీవో పోచయ్య, డీఈవో సత్యనారాయణరెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు అశోక్, కార్యదర్శి వనజారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement