కొత్తమండలాలు లేనట్లే..
-
జనాభా ప్రాతిపదిక సర్కారు నిర్ణయం
-
ప్రతిపాదిత మండలాలు మావల, సోన్, నస్పూర్, హాజీపూర్, పెంచికల్‌పేట
-
ఒక్క పెంచికల్‌పేట ఏర్పాటుకు వీలు..?
-
కెరమెరి కొమురంభీం జిల్లాలోకి..
-
జిల్లా అధికారుల తాజా ప్రతిపాదనలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా విభజన ప్రతిపాదనల తయారీలో ఇంకా మార్పులు, చేర్పులు కొనసాగుతూనే ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక పట్టణంలో లక్షా 50వేల జనాభా ఉంటేనే అర్బన్ మండలాలు ఏర్పాటు చేయాలని, 35 వేల జనాభా దాటితేనే రూరల్ మండలం చేయడానికి వీలుంటుందని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లాలో కొత్త మండలాల ఏర్పాటు లేనట్లేనని స్పష్టమవుతోంది. జిల్లాలో కొత్తగా మావల, సోన్, నస్పూర్, హాజీపూర్‌లతోపాటు పెంచికల్‌పేట్‌లను కొత్త మండలాలుగా ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం ప్రతిపాదనలు పంపిన విషయం విదితమే.
ఆయా మున్సిపాలిటీలతో కూడిన మండలాల నుంచి వీటిని వేరు చేసి, కొత్త మండలాలుగా ఏర్పాటు చేయాలని అధికారులు గతంలో ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మావల, సోన్, నస్పూర్, హాజీపూర్ మండలాల ఏర్పాటుకు వీలు పడడం లేదు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ మున్సిపాలిటీల జనాభా లక్షా 50వేల లోపే ఉండడంతో ప్రతిపాదిత ఈ కొత్త మండలాల ఏర్పాటు వీలు పడదని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. రూరల్ మండలం పెంచికల్‌పేట మండలం చేయడానికి వీలుంటుంది. కొత్తగా ప్రతిపాదించిన ఈ రూరల్ మండలంలో 35వేల జనాభా ఉంటుంది. దీంతో పెంచికల్‌పేట మండలం ఏర్పాటుకు దాదాపు మార్గం సుగమమైంది.
కెరమెరి కొమురంభీం జిల్లాలోకి..
కెరమెరి మండలాన్ని ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉంచుతూ ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తాజాగా ఈ నిర్ణయాన్ని మార్చారు. ఈ మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న కొమురంభీం(మంచిర్యాల) జిల్లా పరిధిలోకి చేర్చాలని నిర్ణయించారు. ఈ మండలాన్ని ఆదిలాబాద్‌లో చేర్చడంపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమైంది. కొమురంభీం నడయాడిన జోడెఘాట్ ఉన్న కెరమెరి మండలాన్ని కొమురంభీం పేరుతో ఏర్పాటు చేయనున్న జిల్లాలో కాకుండా, ఆదిలాబాద్ జిల్లాలో చేర్చడం సరైంది కాదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కెరమెరి మండలాన్ని కొమురంభీం(మంచిర్యాల) జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
శుక్ర,శనివారాల్లో ఆసిఫాబాద్–ఆదిలాబాద్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. జిల్లాల విభజన ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం శనివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతించిన అఖిలపక్షం నేతలు, శాస్త్రీయ పద్ధతిలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు పలు పార్టీల నేతలు ప్రకటించారు.
జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించాక జిల్లా ఏర్పాటుకు ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అనంతరం నెల రోజులపాటు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తామని సీఎం ప్రకటించారు. ఈ నోటిఫికేషన్ విడుదలైతే జిల్లా విభజనపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.