-
గత మండలాలతోనే..
-
‘ముథోల్’ మండలాలతో భైంసా డివిజన్
నిర్మల్‌రూరల్ : చారిత్రక ఖిల్లాగా.. నిజాం జమానాలోనే రెవెన్యూ జిల్లాగా.. రాజకీయ కేంద్రంగా.. పేరొందిన నిర్మల్ ఇక ఇప్పుడు కొత్త జిల్లాగా రూపుదిద్దుకోనుంది. ముథోల్, నిర్మల్ నియోజకవర్గాలతోపాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్, కడెం మండలాలతో జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గుచూపిన విషయం తెలిసిందే. నిర్మల్ ప్రాంతానికి ఉన్న అనుకూలతల కారణంగానే వందల ఏళ్ల క్రితం నిమ్మలనాయుడు ఈ ప్రాంతాన్ని ఖిల్లాగా చేసుకుని పాలించాడు.
నిజాంరాజులు సైతం పాలన సౌలభ్యం కోసం నిర్మల్‌ను రెవెన్యూ జిల్లాగా చేశారు. ప్రస్తుత ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతోపాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాలను నిర్మల్ జిల్లాలో భాగం చేశారు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ నూతన జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పరిపాలన సౌలభ్యం, భౌగోళిక నేపథ్యం దృష్టిలో ఉంచుకునే నిర్మల్‌ను జిల్లాగా చేసినట్లు సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు ముసాయిదాలోనూ 13మండలాలతో కొత్తజిల్లాను ప్రకటించారు.
రెవెన్యూ డివిజన్‌నే జిల్లాగా..
ఇప్పుడున్న నిర్మల్ రెవెన్యూ డివిజనే కొత్త జిల్లాగా రూపుదిద్దుకోనుంది. ప్రభుత్వం కొత్త జిల్లాలో పేర్కొన్న ముథోల్, తానూరు, కుభీర్, భైంసా, లోకేశ్వరం, కుంటాల, దిలావర్‌పూర్, సారంగపూర్, నిర్మల్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, కడెం.. ఈ 13 మండలాలు ప్రస్తుతం నిర్మల్ డివిజన్‌లోనివే. గతంలో డివిజన్‌ల ఏర్పాటు సమయంలోనే పాలన సౌలభ్యం కోసం ఈ 13మండలాలతో డివిజన్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అవే మండలాలు.. అదే డివిజన్ జిల్లాగా ప్రమోషన్ పొందనుంది.
ముథోల్‌వాసులకు రెట్టింపు సంతోషం
‘ఈ కష్టాలు ఇంకెన్నేళ్లు భరించాలి. తమను నిజామాబాద్‌లో కలపండి.. లేదంటే నిర్మల్‌ను జిల్లాగా చేయండి..’ ఇది నిన్నమొన్నటి వరకు ముథోల్ నియోజకవర్గ ప్రజల ఆవేదన. అల్లంత దూరంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాకేంద్రానికి వెళ్లాలంటేనే చాలా ఇబ్బంది పడేవారు. ఏ చిన్నపనికైనా నిజామాబాద్‌కే పరుగుతీసేవారు.
కానీ వారికి కేసీఆర్ సర్కార్ రెట్టింపు సంతోషాన్ని ఇచ్చింది. అటు నిర్మల్ కేంద్రంగా కొత్తజిల్లాతోపాటు భైంసా కేంద్రంగా నూతన డివిజన్‌నూ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ముథోల్ నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఓ వైపు జిల్లాకేంద్రం, మరోవైపు డివిజన్ కేంద్రంతో పాటు పక్కనే నిజామాబాద్, సరిహద్దు దాటితే ధర్మాబాద్, నాందేడ్.. ఇలా అన్నింటికి మధ్యలో ముథోల్ వచ్చేసింది. భైంసా కేంద్రంగా ప్రకటించిన డివిజన్‌లో ముథోల్ నియోజకవర్గం(ముథోల్, తానూరు, కుభీర్, భైంసా, లోకేశ్వరం, కుంటాల మండలాలు) పూర్తిగా రానుంది.
నిర్మల్‌తోనే అనుబంధం..
ముథోల్‌తోపాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్, కడెం మండలాలను నిర్మల్ జిల్లాలోనే కొనసాగించనున్నారు. ముందు నుంచీ ఈ రెండు మండలాలకు నిర్మల్‌తోనే అనుబంధం ఉంది. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న ఈ మండలాల ప్రజలు ఏ అవసరమున్న నిర్మల్‌కే వస్తుంటారు. రెవెన్యూపరంగానూ ఇవి నిర్మల్ డివిజన్‌లోనే కొనసాగుతున్నాయి. వ్యాపార, వాణిజ్యాలతో పాటు బంధుమిత్ర బాంధవ్యాలూ నిర్మల్‌తో ముడిపడి ఉన్నాయి.
జిల్లా కార్యాలయాలూ ఇక్కడే..
వివిధ శాఖలకు చెందిన జిల్లా కార్యాలయాలు ఇప్పటికే నిర్మల్‌లో ఉన్నాయి. పంచాయతీ రాజ్, నీటిపారుదల, మత్స్యశాఖ, భూగర్భ జలవనరుల శాఖ, పే అండ్ అకౌంట్స్ తదితర శాఖల జిల్లా కార్యాలయాలన్నీ నిర్మల్‌లోనే ఉన్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి సంబంధించి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల కార్యాలయం కూడా నిర్మల్‌లోనే ఏర్పాటు చేశారు. కవ్వాల్ టైగర్‌రిజర్వ్ ఫారెస్ట్ సర్కిల్ కార్యాలయం ఉంది. కొత్త జిల్లా కలెక్టరేట్ కోసం ఇప్పటికే స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కూడా అధికారులు పరిశీలించారు. ఇక జిల్లా ఏర్పాటైన తర్వాత ఎలాంటి సమస్యలు రాకుండా కావాల్సిన సదుపాయాలు ఇక్కడ ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.